అమెరికా వెళ్లాలంటే.. అప్పు పుట్టట్లేదు! | Indian Students Interest is gradually decreasing among USA Education | Sakshi
Sakshi News home page

అమెరికా వెళ్లాలంటే.. అప్పు పుట్టట్లేదు!

Sep 30 2025 1:42 AM | Updated on Sep 30 2025 1:42 AM

Indian Students Interest is gradually decreasing among USA Education

ట్రంప్‌ దెబ్బకు అమెరికా కల విలవిల 

వెళ్లే వారికి పెట్టుబడులు ఇవ్వడానికి వెనుకంజ 

ఇచ్చిన వాళ్ల నుంచి వసూలుకు పెరిగిన ఒత్తిడి 

తీవ్ర ఆందోళనలో తల్లిదండ్రులు

సాక్షి, హైదరాబాద్‌: విదేశీ విద్య కోసం అమెరికా వెళ్లాలన్న ఆసక్తి విద్యార్థుల్లో క్రమంగా తగ్గుతోంది. తమ పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులూ వెనుకాడుతున్నారు. అధ్యక్షుడు ట్రంప్‌ దెబ్బకు అమెరికా అంటేనే నమ్మకం పోతోందని కన్సల్టెన్సీ సంస్థలూ అంటున్నాయి. ఇదిలాఉంటే, ఇప్పటికే అమెరికా వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఆందోళనతో ఉన్నారు. ప్రైవేటు అప్పులు వారిని వెంటాడుతున్నాయి. ఇంకోవైపు అమెరికా నుంచి విద్యార్థులు డబ్బులు పంపాలని కోరడం మరింత ఆందోళన రేపుతోంది. పిల్లలు అమెరికా వెళ్లే వరకూ ఆనందంగా ఉన్న మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నాయి. హెచ్‌1–బీ వీసీకు లక్ష డాలర్లు చెల్లించాలన్న ట్రంప్‌ నిర్ణయం అనేక కుటుంబాల్లో కునుకులేకుండా చేస్తోంది.  

పెరుగుతున్న అప్పు ఒత్తిడి 
భారత్‌ నుంచి ఈ ఏడాది దాదాపు 3 లక్షల మంది అమెరికా వెళ్లారు. తెలుగు రాష్ట్రాల నుంచి 50 వేల మంది వెళ్లినట్టు అంచనా. ఇందులో ఎక్కువ మంది చిన్నస్థాయి ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలే ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో బ్యాంకు లోన్లలతోపాటు, తేలికగా ప్రైవేటు అప్పులు పుట్టాయి. అమెరికా వెళ్లే విద్యార్థి పార్ట్‌ టైం ఉద్యోగం చేసి సంపాదిస్తాడనే నమ్మకం ఉండేది. దీంతో ప్రైవేటు వ్యక్తులూ అప్పులివ్వడానికి వెనుకాడలేదు. కొంతమంది తల్లిదండ్రులు రూ.2 నుంచి 5 వడ్డీకి కూడా అప్పులు తెచ్చారు. 

వడ్డీ రెండేళ్లలో అసలును మించి పోయిందని ఇప్పుడు వాపోతున్నారు. వచ్చే జీతంలో ఎక్కువ భాగం నెలనెలా వడ్డీ కట్టేవాళ్లూ ఉన్నారు. అమెరికాలో పార్ట్‌టైం ఉద్యోగాలు చేయొద్దంటూ ఆంక్షలు పెట్టడంతో, జీవనం కోసం విద్యార్థులు తల్లిదండ్రులను ఆశ్రయించారు. డబ్బులు పంపకపోతే అమెరికాలో ఉండటం కష్టమని చెబుతున్నారు. దీంతో తల్లిదండ్రులు ఏడాదిగా కొత్త అప్పులు తీసుకురాక తప్పని పరిస్థితి. దీనికితోడు రూపాయి మారక విలువ తగ్గడంతో అమెరికాలో యూనివర్సిటీ ఫీజుల భారం ఎక్కువైంది. 

ఇవన్నీ తల్లిదండ్రులను మరింత అప్పుల్లోకి నెట్టాయి. హెచ్‌1–బీ వీసాకు ఆంక్షలు పెట్టడంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన 19 వేల మంది విద్యార్థులు ఎంఎస్‌ పూర్తి చేసుకుని, ఉద్యోగం లేని కారణంగా వెనక్కు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది గమనించిన అప్పుల వాళ్లు తామిచ్చిన మొత్తాన్ని ఇవ్వమని తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తున్నారు. వడ్డీ ఇవ్వకున్నా అసలైనా ఇవ్వాలని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఏమీ చేయలేని అమోమయంలోకి వెళ్తున్నారు.  

అమ్మో... అప్పా? 
కొత్తగా అమెరికా వెళ్లే విద్యార్థులకు అప్పులు ఇచ్చేందుకు ప్రైవేటు వ్యక్తులు ముందుకు రావడం లేదు. స్థిరాస్తి కుదవపెడితే ఆలోచిస్తామని చెబుతున్నారు. బ్యాంకులు కూడా షూరిటీని అడుగుతున్నాయని తల్లిదండ్రులు అంటున్నారు. అమెరికా వెళ్లాలంటే ముందుగా జీవన వ్యయాన్ని బ్యాంకు నిల్వగా చూపించాలి. ఈ మొత్తాన్ని ఆరు నెలల ముందే బ్యాంకులో డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. వచ్చే జనవరి సెమిస్టర్‌ కోసం యూఎస్‌ వెళ్లే విద్యార్థులు ఇప్పట్నుంచే ఏర్పాట్లు చేసుకోవాలి. ఒక్కో విద్యార్థి కనీసం రూ. 40 లక్షలు సమకూర్చుకుంటే తప్ప అమెరికా వెళ్లలేరు. కొంతమంది ఉద్యోగులు తమ పీఎఫ్‌ డ్రా చేస్తున్నారు. 

ఒత్తిడి పెరిగింది: మల్లెల హర్షవర్ధన్‌ (సిద్దిపేట) 
సాధారణ ఉద్యోగం చేసే నేను రూ.20 లక్షల ప్రైవేటు అప్పు చేసి ఎంఎస్‌ కోసం కొడుకును అమెరికా పంపాను. రెండేళ్లల్లో అప్పు రెట్టింపు అయింది. నెలనెలా అమెరికాలో అబ్బాయికి డబ్బులు పంపుతున్నాను. అప్పు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నా ఏమీ చేయలేని పరిస్థితి. స్థిరాస్తులు కూడా ఏమీ లేవు. భయమేస్తోంది.  

అప్పంటే భయమేస్తోంది : మారపంపు నవీన్, వడ్డీ వ్యాపారి, వరంగల్‌ 
అమెరికా వెళ్లే వారికి కొన్నేళ్లుగా అప్పులు ఇస్తున్నాను. పెద్దగా ష్యూరిటీ ఆశించలేదు. కానీ రెండేళ్లుగా ఇస్తున్న అప్పులు తిరిగి రావడం కష్టంగా ఉంది. కొంతమంది వద్ద స్థిరాస్తులు కూడా లేవు. గట్టిగా అడిగే పరిస్థితి లేదు. అందుకే అమెరికా వెళ్లే వారికి అప్పులు ఇవ్వడం మానేశాను.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement