
ఎవరి అంచనాలకూ అందకుండా ప్రవర్తిస్తూ అయోమయానికి గురిచేయటంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సిద్ధహస్తుడు. ఆర్నెల్లక్రితం రెండోసారి అధికారంలో కొచ్చింది మొదలు తీసుకుంటున్న విపరీత నిర్ణయాల మాదిరే హెచ్1బీ వీసా ఫీజు దాదాపు లక్ష డాలర్లు చేసి ఐటీ, ఫార్మా, సాంకేతిక రంగాల నిపుణుల ఆశలను భగ్నం చేశారు. ఈ వీసా లబ్ధిదారుల్లో అత్యధికులు భారతీయులని తెలిసే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని వేరే చెప్పనవసరం లేదు.
ప్రస్తుతం హెచ్1బీ వీసాదారులు 7,30,000 మందిలో దాదాపు 71 శాతం మంది భారతీయులు. ఇప్పటికే మన సరుకులపై సుంకాల మోత మోగించి భిన్నరంగాల కార్మికుల పొట్టగొట్టిన ట్రంప్, ఇప్పుడు ఐటీ, ఫార్మా,సాంకేతిక రంగ పరిశ్రమల్లో పనిచేస్తున్న అత్యంత నైపుణ్యంగల ఇంజనీర్ల ఆశలు అడియాసలు చేశారు. మొదట ఫీజు పెంపుపై చేసిన అస్పష్ట ప్రకటన అమెరికాలోని భారతీయుల్లో తీవ్ర ప్రకంపనలు రేపింది.
పండగ కోసం స్వస్థలాలకు చేరుకుంటున్న వేలాదిమంది మార్గమధ్యంలో వెనుదిరిగే ప్రయత్నం చేయగా, అలాంటివారిని మరింత ఇబ్బంది పెట్టాలన్న ఏకైక లక్ష్యంతో ట్రంప్ కనుసన్నల్లో పనిచేసే ‘మాగా’ ఉద్యమకారులు విమానాల్లో భారీయెత్తున సీట్లు బ్లాక్ చేసి టిక్కెట్ల ధరలు ఆకాశాన్నంటేలా చేశారు. అసలు జరుగుతున్నదేమిటో అర్థంకాక అమెజాన్, మైక్రోసాఫ్ట్ తదితర సంస్థలన్నీ ఆదివారం మధ్యాహ్నం గడువు ముగిసే వేళకు వచ్చితీరాలని సందేశాలు పంపటంతో స్వస్థలాలకొచ్చినవారంతా ఉన్నపాటున బయల్దేరారు.
అంతా అయిన తర్వాత ఈ పెంపు కొత్త దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుందంటూ, అది కూడా వార్షిక ఫీజు కాదు... ఒక్కసారి కట్టాల్సిన రుసుమేనంటూ వైట్‌హౌస్ అధికార ప్రతినిధి తీరిగ్గా ప్రకటించారు. పైగా రెండు మూడేళ్లలో వీసాను నవీకరించుకోవాల్సినవారికి కూడా ఇది వర్తించబోదని చెప్పారు. కానీ యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఛాంబర్ ఆఫ్ ప్రోగ్రెస్ సంస్థల ప్రతినిధుల ప్రకటనలు గమనిస్తే ఇప్పటికీ దిగ్గజ సంస్థల్లో ఏర్పడిన అయోమయం పోలేదని అర్థమవుతుంది. అసలు ఇప్పుడు చెప్పిన మాటకు ట్రంప్ కట్టుబడి ఉంటారన్న గ్యారెంటీ కూడా లేదు.
తీరికూర్చుని నిందలేయటానికి తప్ప వలసదారుల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ కొచ్చిన నష్టం లేశమాత్రమైనా లేదు. అర్హులైన అమెరికన్ల ఉద్యోగాలు కొల్లగొట్టిందీ లేదు. ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే నిజమవుతుందన్న ఉద్దేశంతోనే ఆ కట్టుకథను మాగా ప్రచారంలో పెట్టింది. ప్రారంభంలో వలసదారులు తక్కువ వేతనానికి చేరినా త్వరలోనే తమ నైపుణ్యంతో, చురుకుదనంతో అక్కడివారితో సమానంగా వేతనం అందుకుంటున్నారు.
నిజానికి ఐటీ, ఫార్మా, సాంకేతిక రంగాల మాట అటుంచి చిప్ డిజైన్,క్లౌడ్ కంప్యూటింగ్, పెనువేగంతో విస్తరిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) తదితర ప్రాజెక్టుల్లో సమర్థంగా పనిచేసే చాలినంతమంది స్థానిక నిపుణులు దొరకటం అక్కడి సంస్థలకు అసాధ్యం. ఏఐలో అమెరికాను చైనా దాటిపోతోందన్న వార్త ఇప్పటికే అక్కడి పరిశ్రమల్ని కలవరపెడుతోంది. దాన్ని మరింత పెంచటం, చివరకు అమెరికా వెనకబాటుకు కారకుడు కావటం మినహా ట్రంప్ సాధించేదేమీవుండదు.
వలసదారుల వల్ల అమెరికా పొందిన లబ్ధి అంతా ఇంతా కాదు. ప్రపంచంలో ఎక్కడా లేనంత సంపద పోగు పడటానికి వలసదారులే కారణం. 1990–2000 మధ్య నోబెల్ సాధించిన శాస్త్రవేత్తల్లో 26 శాతంమంది వలసదారులు. ఇప్పుడు ప్రముఖ కంపెనీలుగా ఉన్న సంస్థల వృద్ధి వెనక 25 శాతం వలసదారులే ఉన్నారు. తన విపరీత నిర్ణయాలు అనుద్దేశిత పర్యవసానాలకు దారి తీస్తాయన్న ఎరుక ట్రంప్‌కు లేకుండా పోయింది. తాజా పెంపు నిర్ణయాన్ని న్యాయస్థానాలు తప్పుబట్టి తాత్కాలికంగా నిలిపేయవచ్చంటున్నారు. ఆ సంగతెలావున్నా ట్రంప్ సృష్టించిన అనిశ్చితి పర్యవసానంగా స్థానిక కంపెనీలు తమ కార్యక్షేత్రాలను వేరే దేశాలకు తరలిస్తాయి.
దాంతోపాటు వృత్తిరంగ నిపుణులు, విద్యార్థులు ఇతర దేశాల వైపు దృష్టి సారిస్తారు. ఇదంతా అమెరికాకే నష్టం. మన ప్రభుత్వం మెరుగైన విధానాలతో ముందు కొస్తే, ఆ ప్రతిభా సామర్థ్యాలకు ఆసరాగా నిలిస్తే ఆ చర్య దేశాభివృద్ధికి దోహదపడుతుంది.