వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 30 దేశాల్లోని రాయబారుల్ని, ఇతర సీనియర్ స్థాయి అధికారుల్ని విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. బదులుగా వారి స్థానంలో వేరే వారిని నియమించనున్నారు. తొలగించిన రాయబారులు, ఇతర రాయబార కార్యాలయం సీనియర్ స్థాయి సిబ్బందిని వేరే విభాగాల్లో విధులు అప్పగించనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
విదేశాల్లో అమెరికన్ పౌరులను రక్షించడం, విదేశీ వ్యవహారాలపై అధ్యక్షుడికి సలహా ఇవ్వడం, ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి విభాగాల కిందకు వచ్చే స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రకారం.. ఇది సాధారణ సిబ్బంది మార్పులలో భాగమేనని చెబుతున్నప్పటికీ.. ట్రంప్ ప్రభుత్వం దీన్ని అమెరికన్ ఫస్ట్ విధానంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అమెరికా ప్రయోజనాలను కాపాడేలా లక్ష్యంతో కొత్త రాయబారులను నియమించాలన్న ఉద్దేశమేని తెలిపింది.
ప్రభావిత దేశాలు
ఆఫ్రికా: అత్యధికంగా ప్రభావితమైన ఖండం. బురుండి, కామెరూన్, కేప్ వెర్డే, గాబోన్, ఐవరీ కోస్ట్, మడగాస్కర్, మారిషస్, నైజర్, నైజీరియా, రువాండా, సెనెగల్, సోమాలియా, ఉగాండా ఇలా మొత్తం 13 దేశాల్లో రాయబారులు తొలగింపుకు గురయ్యారు.
ఆసియా: ఫిజీ, లావోస్, మార్షల్ దీవులు, పాపువా న్యూ గినియా, ఫిలిప్పీన్స్, వియత్నాం -ఆరుదేశాలు
యూరప్: ఆర్మేనియా, మాసిడోనియా, మోంటెనెగ్రో, స్లోవేకియా -నాలుగు దేశాలు
మధ్యప్రాచ్యం: అల్జీరియా, ఈజిప్ట్ – 2 దేశాలు.
ఇతర దేశాలు: నేపాల్, శ్రీలంక, గ్వాటెమాలా, సురినామ్‌లు ఉన్నారు.
ఈ రాయబారులందరూ జో బైడెన్ పాలనలో నియమితులయ్యారు. అయితే, తాజాగా తొలగింపుల నేపథ్యంలో ట్రంప్.. వీరిందని తొలగించే లక్ష్యంగా బుధవారం అధికారికంగా నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల్లో పేర్కొన్న దేశాల్లో నిరాయబారుల వెనక్కి రావాలని ప్రకటించారు. సాధారణంగా రాయబారులు 3–4 సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు. అయితే, వారు అధ్యక్షుడి ఇష్టప్రకారం పనిచేస్తారు. తొలగింపుకు గురైన వారు తమ ఫారిన్ సర్వీస్ ఉద్యోగాలను కోల్పోవడం లేదు. అమెరికాకు తిరిగి వచ్చి ఇతర విభాగాల్లో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు.
ఈ నిర్ణయం వల్ల అమెరికా విదేశాంగ విధానంలో పెద్ద మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆసియా, యూరప్, ఆఫ్రికా, మధ్యప్రాచ్యం వంటి ప్రాంతాల్లో అమెరికా సంబంధాలు కొత్త రూపం దాల్చే అవకాశం ఉంది. బైడెన్ పాలనలో ఏర్పడిన కొన్ని ఒప్పందాలు మారే అవకాశం ఉంది.


