అమెరికా చరిత్రలో అతిపెద్ద మిలిటరీ ఖర్చు బిల్లును 2026 సంవత్సరానికి గానూ 90,100 కోట్ల డాలర్లతో ప్రతినిధుల సభ ఆమో దించింది. లాటిన్ అమెరికాలో సరికొత్త యుద్ధానికి ట్రంప్ సిద్ధమవుతున్న తరుణంలో, ఈ వ్యయ బిల్లు ఆమోదం కోసం డెమోక్రాట్లు కూడా రిపబ్లికన్లతో కలిసి ఓటు వేయడం గమనార్హం. ఇప్పటికే జూలైలో కేటాయించిన 15,600 కోట్ల డాలర్ల అనుబంధ సైనిక వ్యయ నిధులతో కలిపితే, 2026లో ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను ప్రోత్సహించడానికి అమెరికా మొత్తం లక్షా 5,700 కోట్ల డాలర్లను వెచ్చించనుంది. ‘ఆపరేషన్ దక్షిణ గోళం’ పేరిట కరేబి యన్ ప్రాంతానికి ఎఫ్–35 స్టెల్త్ ఫైటర్లు, యుద్ధనౌకలను తరలించడం... 1962 క్యూబా క్షిపణి సంక్షోభం తర్వాత అతిపెద్ద సైనిక మోహరింపుగా పరిగణించవచ్చు. శత్రు వైమానిక రక్షణ వ్యవస్థలను అణచివేసే ఇఎ18జి వార్‌జెట్‌లు ఇప్పటికే ప్యూర్టోరికో చేరు కున్నాయి.
అమెరికా చూపు ఇప్పుడు వెనిజులాలోని అపారమైన ముడి చమురు నిల్వలపై పడింది. ప్రపంచంలోనే అత్యధికంగా 20 శాతం ముడిచమురు నిల్వలు (సుమారు 30,000 కోట్ల బారెల్స్) ఈ చిన్న దక్షిణ అమెరికా దేశంలోనే ఉన్నాయి. ఇది సౌదీ అరేబియా కంటే ఎక్కువ. గతంలో అధ్యక్షుడు ఛావెజ్ చమురు పరిశ్రమలను జాతీయం చేసి, 2005లో భూసంస్కరణల ద్వారా సామాన్య రైతాంగాన్ని భూస్వాముల నుండి విముక్తి చేశారు. అదే ఏడాది 13 లాటిన్ అమెరికా దేశాలు కలిసి వాణిజ్య సమాఖ్యగా ఏర్పడి స్వల్ప ధరలకే ముడిచమురును అమ్ముకోవాలని ఒప్పందం చేసుకున్నాయి. 2008లో బ్యాంకులను జాతీయం చేయడం, రష్యాతో కీలక ఒప్పందాలు చేసుకోవడం ద్వారా అమెరికా ఆయిల్ కంపెనీల ఆధిపత్యాన్ని వెనిజులా తగ్గించింది. ఇవన్నీ అమెరికాకు మింగుడుపడని అంశా లుగా మారాయి.
ప్రస్తుతం ‘మాదక ద్రవ్యాల ఉగ్రవాదం’ ముసుగులో మదూరో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు వాషింగ్టన్ కుయుక్తులు పన్నుతోంది. ‘కార్టెల్ ఆఫ్ సన్స్’ అనే సంస్థతో వెనిజులా నాయకత్వానికి సంబంధాలు ఉన్నాయని అమెరికా ఆరోపిస్తుండగా, అధ్యక్షుడు మదూరో, కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఈ వాదనలను తిరస్క రిస్తున్నారు. వెనిజులా ప్రజలకు మద్దతుగా నిలుస్తానని రష్యా అధ్యక్షుడు పుతిన్ బహిరంగంగా ప్రకటించారు.
యుద్ధ తంత్రాన్ని అమెరికా మరింత క్రూరంగా మార్చి, నేరుగా భూభాగంలోకి సైన్యాన్ని పంపకుండా క్షిపణులు, డ్రోన్ల సహాయంతో దాడులు చేసే వ్యూహంలో ఉంది. ఇటీవల డ్రోన్ల దాడిలో కొందరు మత్స్యకారులు ప్రాణాలు కోల్పోవడం దీనికి నిదర్శనం. ఆయుధ కంపెనీలకు లాభాలు చేకూర్చడమే లక్ష్యంగా అమెరికా ఈ యుద్ధాలను ప్రోత్సహిస్తోంది.
గత నాలుగేళ్లలో ఉక్రెయిన్‌కు 17,000 కోట్ల విలువైన ఆయుధాలను, ఇజ్రాయెల్‌కు భారీగా ఆయుధ సామగ్రిని సరఫరా చేస్తూ అమెరికా తన యుద్ధ దాహాన్ని ప్రదర్శిస్తోంది. పశ్చిమా సియాలో చమురు ఆధిపత్యం కోసం ఇజ్రాయెల్‌ను అంగరక్షకుడిగా వాడుకున్నట్లే, ఇప్పుడు దక్షిణ అమెరికాలోని వెనిజులాలో తన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని స్థాపించాలని అమెరికా ప్రయత్నిస్తోంది. 1946 నుండి ఇప్పటివరకు ఇజ్రాయెల్‌కు సుమారు 35,000 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం అందించిన అమెరికా, ఇప్పుడు సహజ సంపదను దోచుకోవడమే లక్ష్యంగా వెనిజులాపై దాడికి సిద్ధమవు తోంది. ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తూ సాగుతున్న ఈ యుద్ధ క్రీడలో వెనిజులా ఇప్పుడు బలిపీఠంపై ఉంది.
– జమిందార్ బుడ్డిగ
ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యవర్గ సభ్యులు


