అమెరికా.. సగటు ఇండియన్ డాలర్ డ్రీమ్‌కు కేరాఫ్ అడ్రస్. గత కొన్ని దశాబ్దాలుగా ఆ కలను నిజం చేసుకునేందుకు లక్షలాది మంది భారతీయులు శ్వేతసౌధం ముందు వాలిపోయారు.. తమ కలను సాకారం చేసుకున్నారు కూడా. కాని.. ఇప్పుడా భారతీయుల ఆ కలలసౌధం ట్రంప్ రూపంలో కుప్పకూలుతోంది. నిమిషానికో నిబంధన, రోజుకో చట్టం తీసుకొస్తూ సగటు భారతీయుని ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. దీంతో అమెరికా అంటేనే అమెరికానా..? అనేలా చేస్తున్నారు. దీనికి నిదర్శనం ఈ ఏడాది జరిగిన డిపోర్టేషన్ల సంఖ్యే.
అగ్రరాజ్యం అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టాక అమెరికాలో సగటు భారతీయుడి జీవితం బిక్కుబిక్కుమంటూ గడుస్తోంది. ఇండియన్ల పరిస్థితే కాదు.. అక్కడుంటున్న అన్ని దేశాల వారి పరిస్థితీ ఇదే. అయితే మనది కొంచెం ఎక్కువ. దినదిన గండం.. నూరేళ్ల ఆయుష్ణులా.. ఎప్పుడు ఏ చట్టంతో కొడతాడో.. ఏ రూలును ఝులిపిస్తాడో.. ఏ వైపు నుంచి వేటు వేస్తాడోనన్న చందంలా మారింది అమెరికాలో నివశిస్తున్న విదేశీయుల పరిస్థితి. ఓ రోజు H1b అంటాడు.. మరో రోజు విద్యార్థులపై పడతాడు.. ఇంకో రోజు పన్నులంటాడు. ఇలా బతుకుదెరువు కోసం వెళ్లిన విదేశీయులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు ట్రంపన్న. ఇలా ఏదో ఒక కారణ చెప్పి అక్కడ్నుంచి బలవంతంగా పంపించేస్తున్నాడు.
ఈ సందర్భంగా డిపోర్టేషన్‌కు సంబంధించి ఓ భయంకరమైన న్యూస్ బయటకొచ్చింది. అదేంటంటే అమెరికా నుంచి బహిష్కరణకు గురైన భారతీయుల సంఖ్య. ఈ ఒక్క సంవత్సరమే అక్రమంగా ఉన్నారంటూ 3,258 మంది భారతీయుల్ని అమెరికా బహిష్కరించిందన్న వార్త కలకలం రేపుతోంది. 2025 జనవరి 1 నుండి నవంబర్ 28 వరకూ జరిగిన డిపోర్టేషన్ల సంఖ్య ఇది.
2024తో పోలిస్తే ఈ ఏడాది బహిష్కరణల సంఖ్య రెండు రెట్లు అధికంగా ఉండడం మరింత ఆందోళన కలిగించే అంశం. 2009 తర్వాత నమోదైన అత్యధిక వార్షిక సంఖ్య కూడా ఇదే. దీనిపై అమెరికన్లే తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో అగ్రరాజ్యం అతి చేస్తోందని సగానికి పైగా అమెరికన్లు అభిప్రాయపడినట్లు Pew Research Centre సర్వేలో వెల్లడైంది.
రాజ్యసభలో మంత్రి రామ్‌జీ లాల్ సుమన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ గణాంకాలను వెల్లడించారు. ట్రంప్ ప్రభుత్వం ప్రకారం బహిష్కరణకు గురైన వాళ్లంతా అక్రమంగా దేశంలోకి ప్రవేశించినవాళ్లు, వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉండిపోయినవాళ్లు. అలాగే ఏ డాక్యుమెంట్లూ లేకుండా అమెరికాలో నివాశముంటున్న వారు, లేదా నేర నిర్ధారణ జరిగిన వాళ్లు.
దీనిపై ప్యూ రీసెర్చ్ సెంటర్ ఈ ఏడాది అక్టోబర్‌లో ఈ సర్వే నిర్వహించింది. ఇందులో సగానికి పైగా అమెరికన్ పెద్దలు ట్రంప్ ప్రభుత్వం బహిష్కరణల విషయంలో పరిధి దాటి ప్రవర్తిస్తోందని నమ్ముతున్నారట. అక్రమ వలసదారులందరినీ బహిష్కరించాలా అని అడిగినప్పుడు, కేవలం 31% మంది మాత్రమే అవును అని చెప్పారు. సగానికి పైగా ప్రజలు కేవలం కొందరిని మాత్రమే బహిష్కరించాలని నిర్భంయగా చెప్పారు. ఈ డిపోర్టేషన్లపై వ్యతిరేకత మార్చి నుండి అక్టోబర్ మధ్య 9 శాతం పెరిగడం గమనార్హం. మరింత ఆశ్చర్యకరంగా ఈ మార్పు అటు రిపబ్లికన్లలో, ఇటు డెమొక్రాట్లలో కూడా కనిపించడం. అంటే ప్రతపక్షంలోనే కాదు.. అధికార పక్షంలోనూ ఈ అభిప్రాయం ఉందన్నమాట.
ఈ సర్వేను మరింత డీటెయిల్డ్‌గా చూస్తే.. మార్చిలో కేవలం 13% మంది రిపబ్లికన్లు ప్రభుత్వం అతి చేస్తోందని భావించగా, అక్టోబర్ నాటికి ఆ సంఖ్య 20 శాతానికి చేరింది. డెమొక్రాట్లలో ఈ అభిప్రాయం 86 శాతానికి పెరిగింది. రిపబ్లికన్లలో ఎక్కువ శాతం మంది ఇప్పటికీ అక్రమ వలసదారులందరినీ బహిష్కరించాలని కోరుకుంటున్నారు.
వీరిలో వైట్ రిపబ్లికన్లు అత్యధికంగా ఉండగా, సుమారు 40 శాతం మంది ఆసియా రిపబ్లికన్లు కూడా ఇదే అభిప్రాయాన్ని పంచుకున్నారు. డెమొక్రాట్లలో కేవలం 8 శాతం మంది మాత్రమే అందరినీ పంపించేయాలని కోరుకోగా, 16 శాతం మంది బ్లాక్ డెమొక్రాట్లు అక్రమ వలసదారులందరినీ బహిష్కరించాలని కోరారు. హిస్పానిక్ వర్గానికి చెందిన వారు అంటే రెండు పార్టీలలోనూ ఎవరినీ బహిష్కరించకూడదని కోరుకుంటున్న వారిలో అధికంగా ఉన్నారు.
మార్చి నుంచి అక్టోబర్ వరకు బహిష్కరణల విషయంలో ట్రంప్ అతి చేస్తున్నాడనే సాధారణ ఆందోళన రెండు పార్టీల్లోనూ పెరిగినప్పటికీ, వ్యక్తిగత ప్రభావం పట్ల ఆందోళన అంతగా పెరగలేదు. మార్చిలో 27 శాతం డెమొక్రాట్లు తమ ఇమ్మిగ్రేషన్ లేదా సిటిజన్‌షిప్ స్టేటస్‌తో సంబంధం లేకుండా తమకు, తమ కుటుంబ సభ్యుడికి లేదా స్నేహితుడికి బహిష్కరణ ముప్పు ఉందని ఆందోళన చెందారు.
అక్టోబర్‌కు వచ్చేసరికి ఇది 40 శాతం కంటే ఎక్కువ పెరగడం గమనార్హం. రిపబ్లికన్ రెస్పాండెంట్లు మాత్రం ఏడాది పాటు తమ నిర్ణయాల్లో ఎటువంటి మార్పు లేకుండా ఉన్నారు. మార్చి, అక్టోబర్ రెండింటిలోనూ కేవలం 10శాతం మంది మాత్రమే ఈ విషయాన్ని చెప్పారు. హిస్పానిక్ వ్యక్తుల్లో 50 శాతం కంటే ఎక్కువ మంది తమ ఫ్రెండ్స్ డిపోర్టేషన్‌కు గురవుతారేమోనని ఆందోళన చెందుతున్నారు. అలాగే.. తమ ప్రాంతాల్లో ఇమ్మిగ్రేషన్ అధికారులు దాడులు లేదా అరెస్టులు చేస్తున్నారని 60 శాతం మంది హిస్పానిక్ ప్రజలు తెలిపారు. ఆసియన్లలో ఈ సంఖ్య 47%, బ్లాక్ పీపుల్‌లో 39%, వైట్ పీపుల్‌లో 38% గా ఉంది.
మా దేశంలోకి అడుగు పెట్టొద్దు..: ప్రపంచంలోని 20% దేశాలపై అమెరికా ఆంక్షలు
అమెరికాకు ఏమైంది.. ఆంక్షల పేరుతో నిత్యం ఏదోఒక దేశంతో గిల్లికజ్జాలు పెట్టుకుంటున్న ఈ అగ్రరాజ్యం ప్రపంచ దేశాలపై మరో బాంబు వేసింది. గత కొన్ని రోజులుగా ట్రావెల్ బ్యాన్ పేరుతో కొత్త పేచీని తెరపైకి తీసుకొచ్చిన అమెరికా దాన్నిప్పుడు మరిన్ని దేశాలకు విస్తరించుకుంటూ పోతోంది. ఇప్పటికే దాదాపు 20 దేశాల ప్రజలు అమెరికాలోకి అడుగుపెట్టకుండా నిషేధించిన ట్రంప్ ప్రభుత్వం తాజాగా మరిన్ని దేశాలను ఈ జాబితాలో చేర్చింది.
ప్రధానంగా ఆఫ్రికా నుంచి వచ్చే దేశాల సంఖ్యను దాదాపు రెట్టింపు చేస్తూ యూఎస్‌లో ప్రవేశానికి పూర్తి లేదా పాక్షిక నిషేధం విధించింది. ఇది వచ్చే జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. దీంతో ఇప్పటికే ఉన్న ట్రావెల్ నిషేధాలు, పరిమితుల లిస్ట్‌లో మరిన్ని ఆఫ్రికన్, వెస్ట్ ఏషియన్‌తోపాటు మరికొన్ని ఇతర దేశాలను చేర్చినట్లైంది. మొత్తం నిషేధం, పరిమితులు ఎదుర్కొంటున్న దేశాల సంఖ్య 39కి చేరింది. టోటల్‌గా ఈ సంఖ్య ప్రపంచ దేశాల్లో దాదాపు సుమారు 20%. అంటే.. ప్రపంచంలోని దాదాపు 20శాతం దేశాల ప్రజలు అమెరికావైపు కన్నెత్తి కూడా చూడకూడదన్నమాట.
తాజా ట్రావెల్ బ్యాన్ విస్తరణలో అమెరికా ఐదు దేశాలపై పూర్తి ట్రావెల్ బ్యాన్ విధించింది. బుర్కినా ఫాసో, మాలి, నైజర్, దక్షిణ సూడాన్, సిరియా దేశాలపై పూర్తి ప్రయాణ నిషేధం విధించారు. దీంతోపాటు పాలస్తీనా అథారిటీ జారీ చేసిన ప్రయాణ పత్రాలు ఉన్నవారిపై కూడా కఠిన ఆంక్షలు ఉంటాయి. ఇవి కాకుండా మరో 15 దేశాలు పాక్షిక ట్రావెల్ పరిమితులు ఎదుర్కోనున్నాయి. అంగోలా, ఆంటిగ్వా అండ్ బార్బుడా, బెనిన్, కోట్ డి ఐవోర్, డొమినికా, గాబన్, గాంబియా, మలావీ, మౌరిటానియా, నైజీరియా, సెనెగల్, టాంజానియా, టోంగా, జాంబియా, జింబాబ్వే పాక్షిక ఆంక్షల ఈ జాబితాలో ఉన్నాయి.
ఇది ఇమ్మిగ్రెంట్, నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలపై ప్రభావం చూపుతుంది. ఇక్కడి భారతీయులపైనా ప్రభావం పడనుంది. టాంజానియా, జాంబియా వంటి దేశాల్లో సంపన్నులైన భారతీయ సంతతి ప్రజలు అధికంగా ఉన్నారు.. ఈ నిర్ణయం వీరిపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. వీటితోపాటు యాంటిగ్వా, బార్బుడా వంటి కొన్ని కరీబియన్ దేశాలపై నిషేధం విధించడం జరిగింది. వీరు విదేశీయులకు ఇచ్చే సిటిజన్‌షిప్ బై ఇన్వెస్ట్‌మెంట్ అంటే పెట్టుబడి ద్వారా పౌరసత్వం ఇచ్చే పథకం అని తెలుస్తోంది.
తొలుత ఈ ట్రావెల్ బ్యాన్‌ను ఈ ఏడాది జూన్‌లో ప్రకటించారు. అమెరికా జాతీయ, ప్రజా భద్రతను దృష్టిలో పెట్టుకుని 19 దేశాల పౌరుల ప్రవేశాన్ని నిషేధించింది. ఆ తర్వాత అఫ్గానిస్తాన్, ఇరాన్, సోమాలియా, యెమెన్ వంటి దేశాలపై పూర్తి ప్రవేశ నిషేధం విధించగా.. లావోస్, వెనిజులా వంటి దేశాలపై పాక్షిక నిషేధాన్ని అమల్లోకి తెచ్చింది. అవినీతి పరులు, క్రిమినల్స్, మోసగాళ్ల విషయంలో అమెరికా అధికారులకు ఇమ్మిగ్రేషన్ తనిఖీలప్పుడు కష్టమవుతోందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా చెబుతోంది.
వీసా పరిమితి ముగిసినా ఉంటున్న వారు, తాము బహిష్కరించినా తమ పౌరుల్ని వెనక్కి తీసుకోడానికి కొన్ని ప్రభుత్వాలు నిరాకరించడం, బలహీనమైన భద్రతా సహకారం వంటి కారణాలను అమెరికా చూపుతోంది. వాషింగ్టన్ డీసీలో ఓ ఆఫ్ఘన్ జాతీయుడు ఇద్దరు అమెరికన్ నేషనల్ గార్డ్ సైనికులపై జరిపిన కాల్పుల ఘటనను ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా వైట్ హౌస్ పేర్కొంది.
సదరు వ్యక్తికి అన్ని రకాల స్క్రీనింగ్ పరీక్షలు జరిగినప్పటికీ, భద్రతా వ్యవస్థలో లోపాలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే.. అమెరికా శరణార్థుల దరఖాస్తుల్ని ప్రాసెస్ చేసే కేంద్రంలో అక్రమంగా పనిచేస్తున్న ఏడుగురు కెన్యా జాతీయుల్ని దక్షిణాఫ్రికా అధికారులు అరెస్టు చేసి బహిష్కరించారు. వారంతా టూరిస్ట్ వీసాలపై వచ్చి అక్కడ పనిచేస్తున్నట్లు గుర్తించారు.
ఈ ట్రావెల్ బ్యాన్ ఎక్స్‌పాన్షన్‌ను కొందరు రిపబ్లికన్ శాసనసభ్యులు, ఇమ్మిగ్రేషన్ హార్డ్‌లైనర్లు గట్టిగా సమర్థించారు. ఇది దేశ భద్రతకు, అక్రమ వలసల్ని అరికట్టడానికి అవసరమైన సరైన చర్య అని వాదిస్తున్నారు. భద్రతా సహకారం, డాక్యుమెంటేషన్ స్టాండర్డ్‌లకు విదేశీ ప్రభుత్వాలను జవాబుదారీగా చేయడం సరిహద్దు సమగ్రతను బలోపేతం చేస్తుందని వారు వెనకేసుకొచ్చారు.
అయితే కేవలం జాతీయతను బట్టి ఒక దేశం మొత్తాన్ని ప్రమాదకరంగా చూడటం సరికాదని, నేర చరిత్ర లేని సాధారణ పౌరుల్ని ఇది ఇబ్బంది పెడుతుందని మానవ హక్కుల సంఘాలు, న్యాయ నిపుణులు వాదిస్తున్నారు. ట్రంప్ గతంలో నార్వే, స్వీడన్ వంటి దేశాల నుండి వలసలను ఇష్టపడతానని, అభివృద్ధి చెందని దేశాలను కించపరిచేలా మాట్లాడారని గుర్తు చేస్తున్నారు.


