
ఉక్రెయిన్ సైన్యం సంచలన ప్రకటన చేసింది. రష్యా తరపున పోరాడుతున్న ఓ సైనికుడ్ని అదుపులోకి తీసుకున్నామని, అయితే అతను భారతీయుడని తెలిపింది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం ధృవీకరించాల్సి ఉంది(Is Indian Captured By Ukraine Army).
ది కీవ్ ఇండిపెండెంట్ కథనం ప్రకారం.. పట్టుబడిన యువకుడి పేరు మజోతి సాహిల్ మొహమ్మద్ హుస్సేన్(22). స్వస్థలం గుజరాత్ మోర్బీ. ఉన్నత విద్య కోసం రష్యాకు వెళ్లి.. ఇప్పుడు యుద్ధ సైనికుడిగా ఉక్రెయిన్‌కు పట్టుబడ్డాడు. ఈ మేరకు అతని స్టేట్‌మెంట్‌తో సదరు మీడియా సంస్థ ఓ వీడియో విడుదల చేసింది.
ఉన్నత విద్య కోసం రష్యా వెళ్లిన మజోత్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడట. ఏడేళ్ల శిక్ష పడడంతో జైలు జీవితం అనుభవిస్తున్నాడట. అయితే.. యుద్ధంలో పోరాడితే శిక్షా కాలం తగ్గిస్తామని, ఆర్థికంగా కూడా సాయం అందిస్తామని మజోత్‌కు రష్యా అధికారులు ఆఫర్ చేశారట. జైల్లో ఉండడం ఇష్టం లేక అందుకు అంగీకరించానని, అయితే ఆ ఒప్పందంపై సంతకం చేసింది అక్కడి నుంచి బయటపడేందుకేనని ఆ యువకుడు వీడియోలో చెప్పాడు.
రష్యాలో అంతా పచ్చి అబద్ధం. నాకు ఆర్థిక సాయం అందలేదు. తగ్గిస్తామని అధికారులు చెప్పడం, జైల్లో ఉండడం ఇష్టం లేకనే ఆ ఒప్పందం కుదుర్చుకుని రష్యా తరఫున స్పెషల్ మిలిటరీ ఆపరేషన్(Special Military Operation)లో పాల్గొన్నానంటూ అతను చెప్పడం ఆ వీడియోలో ఉంది. ఉక్రెయిన్ స్థావరాన్ని చూడగానే తాను తన రైఫిల్‌ను పక్కన పెట్టి సాయం కోసం అర్థించానని చెప్పాడతను. తనకు రష్యాకు తిరిగి వెళ్లడం ఇష్టం లేదని.. రష్యా జైల్లో మగిపోవడం కంటే ఇక్కడ ఉక్రెయిన్ జైల్లో శిక్ష అనుభవించడం ఎంతో నయంగా భావిస్తున్నట్లు చెప్పాడతను.
Ukraine's military says they have captured an Indian national who was fighting alongside Russian forces.
Majoti Sahil Mohamed Hussein is a 22-year-old student from Morbi, Gujarat, India & came to Russia to study at a university pic.twitter.com/Kzi5F4EDR4— Sidhant Sibal (@sidhant) October 7, 2025
మరోవైపు ఈ కథనం తమ దృష్టికీ వచ్చిందని, అయితే ఉక్రెయిన్ నుంచి అధికారికంగా తమకు ఎలాంటి సమాచారం అందలేదని భారత విదేశాంగ చెబుతోంది.
2022 ఫిబ్రవరి 24వ తేదీన రష్యా.. ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దురాక్రమణను మొదలుపెట్టింది. అయితే ఈ యుద్ధంలో ఇతర దేశాల యువకులకు గాలం వేసి రష్యా సైన్యం ఉపయోగించుకుంటోందని.. ఉత్తర కొరియా, భారత్.. ఇలా పలు దేశాలకు చెందిన యువకులకు ఉద్యోగాలు, ఆర్థిక సాయం ఆఫర్ చేస్తుందనే విమర్శ తొలి నుంచి వినిపిస్తోంది. ఉక్రెయిన్ సైన్యం ఇప్పటికే 48 దేశాలకు చెందిన 1,500 మందికి పైగా విదేశీయులను పట్టుకున్నట్లు(Foreigners Caught in Ukraine War) నివేదికలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే.. ఈ యుద్ధంలో భారతీయులు చిక్కుకుపోవడం పట్ల భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం అవుతోంది. రష్యాలో ఉన్న భారతీయుల్లో 126 మందిని ఉక్రెయిన్ యుద్ధంలో దించారని, అందులో 12 మంది మరణించగా.. మరో 16 మంది ఆచూకీ లేకుండా పోయారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది. ఇదే విషయాన్ని మాస్కో వర్గాల దృష్టికి తీసుకెళ్లిన భారత్.. ఈ యుద్దంలో చిక్కుకున్న తన పౌరులకు విముక్తి కల్పించాలని కోరింది కూడా. ప్రధాని మోదీ సైతం జోక్యం చేసుకున్న నేపథ్యంలో 96 మందిని రష్యా విడుదల చేసింది. అయితే ఇలాంటి నియామకాలు ఆపేసినట్లు రష్యా చెబుతున్నప్పటికీ.. ఆ నియామకాలు మాత్రం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: ట్రంప్ సుంకాలపై గీతా గోపినాథ్ షాకింగ్ రియాక్షన్