clarifies
-
తెలంగాణలో పెట్రోల్, డీజీల్ కొరత.. కిషన్‌రెడ్డి క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: మన దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా చూస్తున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పెట్రోల్ కొరతపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజీల్‌ను ఎవరూ ఇళ్లలో నిల్వ చేసుకోవద్దన్న కిషన్‌రెడ్డి.. చమురు నిల్వలు లేకపోతే ప్రభుత్వమే ప్రకటిస్తుందని తెలిపారు.ప్రజలు తప్పుడు ప్రచారం నమ్మొద్దు. పెట్రోలు ధరలు పెరుగుతాయని రాహుల్ స్టేట్మెంట్ ఇవ్వడం దురదృష్టకరం. కేంద్రం ముందు చూపుతో దేశంలో చమురు కొరత లేదు. తెలంగాణలో సరిపడా పెట్రోల్, డీజిల్ ఉంది. పానిక్‌తో ఎవరూ పెద్ద ఎత్తున పెట్రోల్ కొని నిల్వ చేసుకోవద్దు’’ అని కిషన్‌రెడ్డి సూచించారు. -
డీలిమిటేషన్‌పై కేంద్రం క్లారిటీ
ఢిల్లీ: డీలిమిటేషన్‌పై కేంద్రం స్పష్టతనిచ్చింది. ప్రస్తుతం ఉన్న సీట్లకు 50 శాతం పెంచుతున్నట్లు పేర్కొంది. బిల్లులో ఈ విషయం స్పష్టంగా ఉందన్న సమాచార శాఖ.. పార్లమెంట్ చర్చ సందర్భంగా మరింత క్లారిటీ ఇస్తామని తెలిపింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఢిలిమిటేషన్ ఉంటుందన్న అపోహలను కేంద్రం కొట్టిపారేసింది. ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్లు పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.తమిళనాడులో 58కి, కేరళంలో 30కి పెరుగుతాయన్న కేంద్రం.. డీలిమిటేషన్‌తో దక్షిణాదిలో సీట్లు తగ్గవని తెలిపింది. రాష్ట్రాలకు చట్టబద్ద రక్షణ ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బిల్లులోని అంశాలను ముక్కలుగా చదవి విశ్లేషించొద్దని కేంద్రం పేర్కొంది. 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని, అందుకోసం లోక్‌సభ స్థానాలను భారీగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.డీలిమిటేషన్ 2011 జనాభా లెక్కల ఆధారంగా కాకుండా తాజాగా జరుగుతున్న జనగణన ప్రాతిపదికన జరగాలని ఆప్, ఆర్జేడీ వంటి పార్టీలు డిమండ్ చేస్తున్నాయి. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఆమోదానికి ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ఇందుకు విపక్షాల మద్దుతు మోదీ ప్రభుత్వానికి తప్పనిసరి. ఈ నేపథ్యంలో సమావేశాలు వాడీవేడిగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. పార్లమెంటు సమావేశాలకు విధిగా హాజరు కావాలంటూ బీజేపీ, కాంగ్రెస్ ఇప్పటికే తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి.రేపటి (ఏప్రిల్ 16, గురువారం) నుంచి మూడు రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ రాజకీయ లబ్ధి కోసమే మోదీ సర్కారు హడావుడిగా మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణలను తెరపైకి తెచ్చిందని కాంగ్రెస్‌తో పాటు విపక్షాలన్నీ మండిపడుతున్నాయి. మరోవైపు డీలిమిటేషన్‌తో తమకు తీవ్ర అన్యాయం జరగనుందని దక్షిణాది రాష్ట్రాలు అభ్యంతరం లేవనెత్తుతున్నాయి. ఈ ప్రక్రియను పార్లమెంటులోనే సవాలు చేస్తామని ఇప్పటికే స్పష్టం చేశాయి. -
అత్తమామల పోషణ కోడలి బాధ్యత కాదు: హైకోర్టు
భారతీయ కుటుంబ వ్యవస్థలో నైతిక విలువలకు, చట్టబద్ధమైన బాధ్యతలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టం చేస్తూ అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సీఆర్పీసీ సెక్షన్ 125 ప్రకారం, ఒక కోడలు తన అత్తమామలకు భరణం చెల్లించాల్సిన చట్టపరమైన అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.కేసు నేపథ్యం ఏమిటి?ఉత్తరప్రదేశ్ పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఒక మహిళపై ఆమె అత్తమామలు కోర్టును ఆశ్రయించారు. తమ కుమారుడు మరణించాడని, తాము వృద్ధులమని, నిరక్షరాస్యులమని, ఎటువంటి ఆదాయ వనరులు లేని పేదలమని వారు పేర్కొన్నారు. తమ కోడలు తన భర్తకు రావాల్సిన సర్వీసు ప్రయోజనాలన్నింటినీ పొందిందని, పైగా ఆమెకు స్వతంత్ర ఆదాయం ఉన్నందున తమను పోషించాల్సిన బాధ్యత ఆమెపై ఉందని వారు వాదించారు.గతంలో ఆగ్రాలోని కుటుంబ కోర్టు ఆగస్టు 2025లో వీరి పిటిషన్‌ను తిరస్కరించింది. తాజాగా భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 144 కింద తాము భరణం పొందేందుకు అర్హులమని కోరుతూ వృద్ధ దంపతులు వేసిన రీపిటిషన్పై జస్టిస్ మదన్ పాల్ సింగ్ ధర్మాసనం విచారణ చేపట్టింది.కోర్టు వ్యాఖ్యలువిచారణ సందర్భంగా జస్టిస్ మదన్ పాల్ సింగ్ చట్టంలోని నిబంధనలను విశ్లేషించారు. ‘భరణం కోరే హక్కు అనేది కేవలం చట్టబద్ధమైన హక్కు మాత్రమే. సెక్షన్లో స్పష్టంగా పేర్కొన్న వ్యక్తుల వర్గాలకు (భార్య, పిల్లలు, తల్లిదండ్రులు) మాత్రమే ఇది పరిమితం. అత్తమామలు ఈ పరిధిలోకి రారు. నైతిక బాధ్యత అనేది ఎంత బలంగా ఉన్నప్పటికీ చట్టబద్ధమైన ఆదేశం లేని పక్షంలో దానిని చట్టపరమైన బాధ్యతగా అమలు చేయలేం’ అని కోర్టు స్పష్టం చేసింది. అత్తమామలను ఈ నిబంధన పరిధిలోకి చేర్చకూడదని శాసనసభ తన విచక్షణతోనే నిర్ణయించిందని, కోడలిపై అత్తమామల పోషణ బాధ్యతను మోపడం చట్టం ఉద్దేశం కాదని న్యాయమూర్తి పేర్కొన్నారు.వారసత్వ ఆస్తులపై స్పష్టతపిటిషనర్లు వాదించినట్లుగా.. కోడలు కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిందని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని కోర్టు గుర్తించింది. అలాగే, మరణించిన కుమారుడి ఆస్తి వారసత్వానికి సంబంధించిన అంశాలు ఇటువంటి భరణం కేసుల విచారణ పరిధిలోకి రావని హైకోర్టు తేల్చి చెప్పింది.చట్టం ప్రకారం తల్లిదండ్రుల పోషణ బాధ్యత కుమారుడిపై లేదా కుమార్తెపై ఉంటుంది తప్ప, కోడలిపై అత్తమామలను పోషించాలనే చట్టపరమైన నిబంధన లేదని ఈ తీర్పు ద్వారా మరోసారి స్పష్టమైంది. ఈ నిర్ణయం భవిష్యత్తులో ఇటువంటి అనేక కుటుంబ వివాదాల్లో కీలకంగా నిలవనుంది.ఇదీ చదవండి: డాలరు ధాటికి రూపీ విలవిల -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఛైర్మన్ రాజీనామా
దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో చోటుచేసుకున్న అనూహ్య మార్పులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. బ్యాంక్ ఛైర్మన్ అతాను చక్రవర్తి రాజీనామా చేసిన నేపథ్యంలో సంస్థ పాలనా విషయాల్లో ఎటువంటి ఆందోళనలు లేవని ఆర్బీఐ స్పష్టం చేసింది.గందరగోళానికి తెరదించిన ఆర్బీఐహెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో ఇటీవలి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపిన ఆర్బీఐ, బ్యాంక్ మేనేజ్మెంట్ కోరిన విధంగా పరివర్తన ఏర్పాట్లకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో బ్యాంక్ పటిష్టతపై ఆర్బీఐ పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ‘హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అత్యుత్తమ ఆర్థిక ప్రమాణాలు, సమర్థవంతమైన మేనేజ్మెంట్ బృందాన్ని కలిగి ఉంది. మా అంచనాల ప్రకారం ఈ బ్యాంక్ నిర్వహణ లేదా పాలనలో ఎటువంటి భౌతిక పరమైన లోపాలు లేవు’ అని ఆర్బీఐ పేర్కొంది.తాత్కాలిక సారథిగా కేకీ మిస్త్రీఅతాను చక్రవర్తి నిష్క్రమణతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు కేకీ మిస్త్రీని మార్చి 19 నుంచి మూడు నెలల పాటు తాత్కాలిక పార్ట్-టైమ్ ఛైర్మన్‌గా నియమించేందుకు ఆర్బీఐ పచ్చజెండా ఊపింది. ఈ విషయాన్ని బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది.కేకీ మిస్త్రీగురువారం జరిగిన కాన్ఫరెన్స్ కాల్లో కేకీ మిస్త్రీ మాట్లాడుతూ, బ్యాంక్ పనితీరులో ఎటువంటి లోపాలు లేవని పునరుద్ఘాటించారు. ‘మా అంతర్గత చర్చల్లో కానీ, మా దృష్టికి వచ్చిన అంశాల్లో కానీ ఎటువంటి కార్యాచరణ లోపాలు లేవు. హైలైట్ చేయాల్సిన ప్రత్యేక సమస్యలేవీ ప్రస్తుతానికి లేవు’ అని ఆయన స్పష్టం చేశారు.అతాను చక్రవర్తి నిష్క్రమణ వెనుక..మే 2021లో బోర్డులో చేరిన అతాను చక్రవర్తి మార్చి 17న తన రాజీనామా లేఖను సమర్పించారు. తన వ్యక్తిగత విలువలు, నైతికతకు ప్రస్తుత పరిస్థితులు అనుగుణంగా లేవని ఆయన లేఖలో పేర్కొనడం చర్చనీయాంశమైంది. అయితే, రాజీనామా లేఖలో పేర్కొన్న అంశాలు మినహా ఇతర కారణాలేవీ లేవని బ్యాంక్ యాజమాన్యం ధ్రువీకరించింది. చక్రవర్తి హయాంలోనే హెచ్డీఎఫ్సీ లిమిటెడ్‌తో బ్యాంక్ విలీనం వంటి చారిత్రాత్మక నిర్ణయం జరిగింది.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
అమెరికాలోనే చదివిన వారికి లక్ష డాలర్ల ఫీజులేదు
న్యూయార్క్: హెచ్–1బీ వీసా దరఖాస్తుదారులందరిపై ఏకంగా ఒకేసారి లక్ష డాలర్ల ఫీజు గుదిబండ పడేసిన ట్రంప్ సర్కార్ హఠాత్తుగా ఒక వర్గం వారికి మాత్రం భారీ లబ్ధి చేకూర్చేలా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అమెరికాలో ఉంటూ విద్యనభ్యసిస్తూ హెచ్–1బీ కోసం దరఖాస్తుచేసుకున్న విద్యార్థులు ఈ అధిక వీసా ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదని ట్రంప్ ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు సోమవారం అమెరికా సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) విభాగం ఒక నోటిఫికేషన్ జారీచేసింది.ఇప్పటికే అమెరికాలోని పలు రంగాల సంస్థల్లో పనులు చేస్తున్న విదేశీయులు చేసే దరఖాస్తులకు సైతం లక్ష డాలర్ల మినహాయింపు వర్తిస్తుందని యూఎస్సీఐఎస్ ఆ ప్రకటనలో పేర్కొంది. దీంతో ఇప్పటికే అమెరికాలో చదువుకుంటున్న, అక్కడి సంస్థల్లో పనిచేస్తున్న భారతీయులకు భారీ లబ్ధిచేకూరనుంది. విదేశాల్లోని వ్యక్తులు చేసే హెచ్–1బీ వీసా దరఖాస్తులకు మాత్రం లక్ష డాలర్ల ఫీజు ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది.అమెరికాలో విద్యనభ్యసిస్తూ ఎఫ్–1వీసా ఉండి దానికి హెచ్–1బీ వీసాగా మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకున్న వాళ్లు ఈ లక్ష డాలర్ల ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. సెపె్టంబర్ 21వ తేదీ మొదలవగానే అర్ధరాత్రి 12.01 నిమిషాల తర్వాత వచ్చే ప్రతి విదేశీ హెచ్–1బీ వీసా దరఖాస్తుదారులు తప్పకుండా లక్ష డాలర్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుందని గతంలోనే ట్రంప్ ప్రభుత్వం స్పష్టంచేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఏఏ వర్గాల వారికి ఈ అధిక ఫీజు మినహాయింపు ఉంటుందనే దానిపై సోమవారం యూఎస్సీఐఎస్ ఈ ప్రకటనలో స్పష్టతనిచ్చింది.. హాయిగా వెళ్లిరావొచ్చు ఇప్పటికే హెచ్–1బీ వీసా ఉన్న విదేశీయులు అత్యవసర పనుల నిమిత్తం స్వదేశం లేదా విదేశాలకు వెళితే మళ్లీ తిరిగొచ్చేటప్పుడు వీసా నిబంధనలు ప్రతిబంధకంగా మారుతాయన్న భయంతో చాలా మంది ఎక్కడికి వెళ్లకుండా అమెరికా గడ్డ మీదనే ఉండిపోతున్నారు. ఇలాంటి భయాలు అక్కర్లేదని హాయిగా అమెరికా నుంచి విదేశాలకు వెళ్లిరావొచ్చని ప్రభుత్వం స్పష్టంచేసింది. ‘‘హెచ్–1బీ వీసా పొడిగింపు, హెచ్–1బీ వీసాగా మార్పు, నివాస స్థితి పొడిగింపు వంటి దరఖాస్తులు ఇంకా పరిశీలనలో ఉన్నందున ఈలోపు అంతర్జాతీయ విమానప్రయాణం చేస్తే తమ వీసా స్టేటస్‌కు ముప్పు వస్తుందనే భయం ఎవరికీ అక్కర్లేదు’’అని గ్రీన్ అండ్ స్పైగల్ న్యాయసేవల సంస్థ ఉన్నతాధికారి డ్యాన్ బెర్జర్ చెప్పారు. చిన్న మెలిక పెట్టిన ప్రభుత్వంఅయితే, ఇప్పటికే అమెరికాలో ఉంటూ చదువుకుంటున్న లేదా ఏదైనా ఉద్యోగం చేస్తున్న విదేశీయులు చేసే ‘హెచ్–1బీ వీసాగా మార్పు’,‘నివాస స్థితి పొడిగింపు’,‘స్టేటస్ మార్పు’వంటి అభ్యర్థనలకు వాళ్లు అనర్హులు అని తేలితే వాళ్ల నుంచి కూడా లక్ష డాలర్ల ఫీజు వసూలుచేస్తామని యూఎస్సీఐఎస్ వ్యాఖ్యానించింది. ఈ లెక్కన ఏ దరఖాస్తునైనా ఉద్దేశపూర్వకంగా అనర్హమైనదిగా ప్రకటించి లక్ష డాలర్ల రుసుం కట్టాల్సిందేనని ఇమిగ్రేషన్ విభాగం ప్రకటిస్తే సమస్య మళ్లీ మొదటికొచ్చే ప్రమాదముందని కొందరు అభిప్రాయపడుతున్నారు.కొత్తగా విదేశాల నుంచి చేసే దరఖాస్తులకే లక్ష డాలర్ల ఫీజు ఉంటుంది. ఇప్పటికే హెచ్–1బీ వీసా ఉండి, దాని రెన్యూవల్ దరఖాస్తు ఆమోదం/పెండింగ్ స్థితిలో ఉండగా స్వదేశం వెళ్లిపోయిన విదేశీయులు మళ్లీ అమెరికాలోకి విమానంలో వచ్చినా వాళ్లకు సైతం ఫీజు మినహాయింపు ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం చూస్తే.. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులు మొదట అమెరికాలోనే చదువుకోవాలనేదే ట్రంప్ ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టమవుతోంది.గత కొన్నాళ్లుగా హెచ్–1బీ వీసా దరఖాస్తుల్లో భారతీయుల హవా కొనసాగుతోంది. భారతీయులు అమెరికా ఉద్యోగాలు కొల్లగొడుతున్నారని, వీరికి అడ్డుకట్ట వేసే ఉద్దేశంలోనే లక్ష డాలర్ల ఫీజు ట్రంప్ తీసుకొచ్చారని తెలుస్తోంది. అమెరికా ప్రభుత్వం ప్రతి ఏటా 65,000 హెచ్–1బీ వీసాలను జారీచేస్తోంది. ఇవిగాక అమెరికాలోనే మాస్టర్స్, అంతకుమించిన ఉన్నత విద్య చదివి ఉద్యోగాలు చేయాలనుకునే వారికి అర్హతల మేరకు మరో 20,000 హెచ్–1బీ వీసాలను అందజేస్తోంది. -
యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ.. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ
యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే అంశంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రూ.2000 మించిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే యోచన ప్రభుత్వానికి లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజ్యసభలో స్పష్టం చేసింది. రూ.2000 దాటిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించాలని జీఎస్టీ కౌన్సిల్ నుంచి ఎలాంటి సిఫారసు చేయలేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభ వర్షాకాల సమావేశాల్లో చెప్పారు.రూ.2000 మించిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందా అనే ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, జీఎస్టీ రేట్లు, మినహాయింపులను కేంద్రం, రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల సభ్యులతో కూడిన రాజ్యాంగ సంస్థ అయిన జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సుల ఆధారంగా నిర్ణయిస్తామని సభకు తెలిపారు. యూపీఐ ట్రాన్సాక్షన్ డేటా ఆధారంగా కర్ణాటకలోని వ్యాపారులకు దాదాపు 6,000 జీఎస్టీ డిమాండ్ నోటీసులు అందాయి.మరోవైపు యూపీఐ లావాదేవీలను మరింత లోతుగా స్క్రూటినీ చేస్తూ, వాటి ఆధారంగా జీఎస్టీని దూకుడుగా అమలు చేస్తే మొదటికే మోసం రావొచ్చని ఎస్బీఐ రీసెర్చ్ ఒక నివేదికలో హెచ్చరించింది. దీనివల్ల చిన్న వ్యాపారులు తిరిగి నగదు లావాదేవీల వైపు వెళ్లిపోయే అవకాశం ఉందని పేర్కొంది. అలా జరగకుండా జీఎస్టీ అమలు విషయంలో జాగ్రత్తగా, బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుందని నివేదిక సూచించింది. -
అపార్ట్మెంట్ మెయింటెనెన్స్‌పై జీఎస్టీ.. ఇదిగో క్లారిటీ..
అపార్ట్మెంట్ మెయింటెనెన్స్‌పై జీఎస్టీకి సంబంధించి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. నెలవారీ మెయింటెనెన్స్‌పై జీఎస్టీ వర్తింపునకు సంబంధించి అపార్ట్మెంట్ యజమానులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల (ఆర్డబ్ల్యూఏ)ల్లో నెలకొన్న అయోమయాన్ని తొలగించేందుకు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రయత్నించింది.జీఎస్టీ విధింపుపై అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లలోని నివాసితుల్లో నెలకొన్న అయోమయంపై వార్తా కథనాలు వచ్చిన నేపథ్యంలో ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ప్రెస్ రిలేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ విభాగానికి చెందిన డైరెక్టర్ జనరల్ కార్యాలయం స్పష్టత ఇచ్చింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఆర్డబ్ల్యూఏ మొత్తం టర్నోవర్ రూ.20 లక్షలు దాటకుండా అదే సమయంలో ఒక్కో సభ్యుడి మెయింటెనెన్స్ ఛార్జీల మొత్తం నెలకు రూ.7,500 దాటినా కూడా జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది.ఇలా అయితేనే జీఎస్టీరెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లలోని ఒక్కో సభ్యుడు చెల్లించే నెలవారీ మెయింటెన్స్ రూ.7,500 కంటే ఎక్కువ ఉండి ఆ అసోసియేషన్ వసూలు చేసే మెయింటెన్స్ మొత్తం కూడా సంవత్సరానికి రూ .20 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రమే ఆర్డబ్ల్యూఏ తన సభ్యుల నుండి వసూలు చేసే నెలవారీ సబ్స్క్రిప్షన్ లేదా కంట్రిబ్యూషన్‌పై జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.ఇక హౌసింగ్ సొసైటీ లేదా రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో రెండు లేదా అంతకంటే ఎక్కువ రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్లు కలిగి ఉన్నవారికి తమ ప్రతి రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్ కు నెలకు రూ.7,500 చొప్పున పరిమితిని వేర్వేరుగా వర్తింపజేయాలని స్పష్టం చేసింది. అంటే ఒక్కో సభ్యుడికి నెలకు రూ.7,500 దాటితే మొత్తం పన్ను పరిధిలోకి వస్తుంది. ఉదాహరణకు మెయింటెనెన్స్ ఛార్జీలు ఒక్కో సభ్యుడికి నెలకు రూ.9,000 అయితే రూ.1,500 వ్యత్యాసంపై కాకుండా మొత్తం రూ.9,000పై 18 శాతం జీఎస్టీ చెల్లించాలి.ఆర్డబ్ల్యూఏలు, హౌసింగ్ సొసైటీలకు ప్రయోజనం చేకూర్చడానికి 2018 జనవరి 18న జీఎస్టీ కౌన్సిల్ తన 25వ సమావేశంలో అపార్ట్మెంట్ మెయింటెనెన్స్‌పై జీఎస్టీ మినహాయింపు పరిమితిని రూ .5,000 నుండి రూ .7,500 కు పెంచింది. -
10 శాతం జీఎస్టీ?ఇక డీజిల్ కార్లకు చెక్? నితిన్ గడ్కరీ క్లారిటీ
10% GST on the sale of diesel vehicles: పొల్యూషన్‌కు చెక్ పెట్టేలా డీజిల్ ఇంజన్ల వాహనాల కొనుగోలుపై 10 శాతం అదనపు జీఎస్టీ బాదుడుకు కేంద్రం సిద్ధమవుతోందన్న వార్తలు కలకలం రేపాయి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సూచన మేరకు ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఇక డీజిల్ వాహనాలకు కాలం చెల్లినట్టే అన్న ఊహాగానాలు మార్కెట్లో వ్యాపించాయి. దీంతో స్టాక్మార్కెట్లో ఆటో, చమురు మార్కెటింగ్ కంపెనీల షేర్లు ఒక్కసారిగా తీవ్ర నష్టాలను చవి చూశాయి. అయితే దీనిపై తక్షణమే స్పందించిన రోడ్డు రవాణా & రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ వార్తలు అవాస్తవాలు అంటూ ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చారు. అలాంటి ప్రతిపాదనేదీ ప్రస్తుతానికి 'యాక్టివ్ పరిశీలన'లో లో లేదని స్పష్టం చేశారు. అయితే 2070 నాటికి కార్బన్ ఉద్గరాలను పూర్తిగా నిరోధించాలన్న లక్ష్యానికి అనుగుణంగా డీజిల్ వంటి ప్రమాదకర ఇంధనాల వల్ల ఏర్పడే వాయు కాలుష్య స్థాయిలను తగ్గించడంతోపాటు ఆటోమొబైల్ విక్రయాలు వేగంగా పెరుగుతుండటంతో క్లీనర్ , గ్రీన్ ఆల్టర్నేటివ్ ఇంధనాలను చురుకుగా స్వీకరించడం తప్పనిసరి అని ఆయన అన్నారు. ఈ ఇంధనాలు దిగుమతి ప్రత్యామ్నాయాలుగా, ఖర్చుతో కూడుకున్నవి కాకుండా దేశీయమైనవి , కాలుష్య రహితంగా ఉండాలని సూచించారు. పర్యావరణహితమైన వాహనాల ఉత్పత్తిపై కంపెనీలు దృష్టి సారించాలన్నారు. There is an urgent need to clarify media reports suggesting an additional 10% GST on the sale of diesel vehicles. It is essential to clarify that there is no such proposal currently under active consideration by the government. In line with our commitments to achieve Carbon Net… — Nitin Gadkari (@nitin_gadkari) September 12, 2023 -
‘డాలర్ ఫైనాన్సియల్ టెర్రరిస్ట్’..
అమెరికన్ డాలర్ ‘ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాది’ అని చేసిన వ్యాఖ్యపై కోటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉదయ్ కోటక్ తాజాగా వివరణ ఇచ్చారు. ఆ మాట తాను అనుకోకుండా అన్నానన్నారు. ఈ మేరకు ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘యూఎస్ డాలర్‌పై ఇటీవల జరిగిన చర్చలో నేను అనుకోకుండా "ఆర్థిక ఉగ్రవాది" అనే పదాలను ఉపయోగించాను. నా ఉద్దేశం ఏమిటంటే రిజర్వ్ కరెన్సీకి అసమాన శక్తి ఉంటుంది. అది నోస్ట్రో ఖాతా అయినా కావచ్చు. 500 బీపీఎస్ రేటు పెరుగుదల అయినా లేదా లిక్విడిటీ కోసం యూఎస్ డాలర్‌ను కలిగిన అభివృద్ధి చెందుతున్న దేశాలైనా కావచ్చు’ అని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఇన్సూరెన్స్ కంపెనీలకు ఐఆర్డీఏఐ కీలక ఆదేశాలు.. రిజర్వ్ డాలర్‌గా ఉన్న అమెరికన్ డాలర్ హోదా అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించే శక్తిని ఇస్తుందన్నారు. చరిత్రలో కీలకమైన ఈ తరుణంలో ప్రపంచం కొత్త రిజర్వ్ కరెన్సీ కోసం వెతుకుతోందని తాను భావిస్తున్నట్లు కోటక్ ఒక కార్యక్రమంలో చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. యూరప్, బ్రిటన్, జపాన్, చైనాతో సహా ఇతర దేశాలు తమ కరెన్సీలను రిజర్వ్ కరెన్సీలుగా పేర్కొనడానికి ముందస్తు అవసరాలు లేవని ఆయన అన్నారు. రూపాయి రిజర్వ్ కరెన్సీ కావాలంటే దేశం బలమైన సంస్థలను, వ్యవస్థలను రూపొందించడంపై దృష్టి పెట్టాలని వ్యాఖ్యానించారు. గత మార్చి త్రైమాసికంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాండ్‌లోన్ నికర లాభం రూ. 3,495.6 కోట్ల వద్ద 26.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. నికర వడ్డీ ఆదాయం 35 శాతం పెరిగి రూ.6,102.6 కోట్లకు చేరుకుంది. బ్యాంక్ నికర నిరర్థక ఆస్తులు నాల్గవ త్రైమాసికంలో రూ.1,193.30 కోట్లకు తగ్గాయి. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది రూ.1,736.71 కోట్లు. శాతాల పరంగా, నికర ఎన్పీఏ నికర అడ్వాన్స్లలో 0.64 శాతం నుంచి 0.37 శాతానికి మెరుగుపడింది. ఇదీ చదవండి: ATM Fraud Alert: ఏటీఎం కార్డ్ మెషిన్లో ఇరుక్కుపోయిందా.. జాగ్రత్త! -
భగవద్గీత పార్క్ ధ్వంసంపై భారత్ సీరియస్.. వివరణ ఇచ్చిన కెనడా
టోరంటో: కెనడాలోని బ్రాంప్టన్‌లో భగవద్గీత పార్క్ ధ్వంసం విషయమై భారత్ సీరియస్ అయ్యింది. ఆ పార్క్ పేరును కూడా తొలగించడంతో భగవద్గీత పార్క్‌లో జరిగిన ద్వేషపూరితమైన ఈ వ్యవహారాన్ని ఖండిస్తున్నామని, సత్వరమే కెనడా అధికారులు ఈ విషయమై చర్యలు తీసుకోవాలని కెనడాలోని భారత్ హైకమిషన్ ట్వీట్ చేసింది. ఐతే ఈ విషయమై బ్రాంప్టన్ మేయర్ బ్రౌన్ ట్విట్టర్లో వివరణ ఇస్తూ.... ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పైగా ఈ విషయమై తమ నగర పాలక సంస్థ సత్వరమే చర్యలు తీసుకుందని తెలిపారు. అయితే ఆ పార్క్‌లో ఎలాంటి విధ్యంసం జరగలేదని, కేవలం మరమత్తుల విషయమై ఆ పేరుని తీసి ఖాళీ గుర్తును ఉంచామని తెలిపారు. ఏదైన ప్రదేశం మరమత్తులు చేయాల్సి వస్తే దాని పేరుని తొలగించి ఆ ప్లేస్‌లో ఇలా ఖాళీగా ఉంచడం సర్వసాధరణమని తెలిపారు. అంతేగాక మరమ్తత్తుల పనులు పూర్తి అయిన వెంటనే అదే పేరును తిరిగి ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా తెలిపారు. అంతేగాక ఆ నగర పోలీసులే ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలిపారు. అలాగే విధ్వంసం చోటుచేసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు కూడా లేవన్నారు. పైగా గతంలో ఇది ట్రాయ్ పార్క్ అని ఆ తర్వాత భగవద్గీత పార్క్‌గా మార్చినట్లు కూడా తెలిపారు. ఇదిలా ఉండగా ఇటీవల కెనడాలోని స్వామి నారాయణ్ మందిర్ అనే హిందు దేవాలయాన్ని కెనడా ఖలిస్తానీ తీవ్రవాదులు భారత్‌పై ద్వేషంతో కూల్చేశారు. ఈ నేపథ్యంలోనే భారత్ హైకమిషన్ తీవ్రంగా స్పందించింది. అంతేగాక కెనడాలో పెరుగుతున్న నేరాల దృష్ట్యా అక్కడ ఉన్న భారత పౌరులను, చదువు నిమిత్తం కెనడా వచ్చిన విద్యార్థులను తగు జాగ్రత్తలు పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. We condemn the hate crime at the Shri Bhagvad Gita Park in Brampton. We urge Canadian authorities & @PeelPolice to investigate and take prompt action on the perpetrators @MEAIndia @cgivancouver @IndiainToronto pic.twitter.com/mIn4LAZA55 — India in Canada (@HCI_Ottawa) October 2, 2022 From @CityBrampton Community Services and Communications Department on the confusion over resident complaints about Gita Park sign. “We learned that the sign was damaged during the original install & a city staff member brought it back for unplanned maintenance & to reprint.” https://t.co/hkfmSFF1Ui — Patrick Brown (@patrickbrownont) October 3, 2022 (చదవండి: నోబెల్-2022: జన్యుశాస్త్ర మేధావి పాబో.. మానవ పరిణామ క్రమంలో సంచలనాలెన్నో!) -
నేను చనిపోలేదు.. ఎక్కువ సేపు నిద్రపోయానంతే: నటుడు
తను మరణించినట్లు వస్తున్న వార్తలను బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్ ఖండించారు. ‘‘నేను చనిపోలేదు ఎక్కువ సేపు నిద్రపోయానంతే’’ అంటు ఆయన స్పష్టత నిచ్చారు. కాగా శుక్రవారం ఉదయం 7 గంటలకు పరేశ్ రావల్ మరణించినట్లుగా ట్విటర్లో ఓ నెటిజన్ పోస్టు షేర్ చేశాడు. అది చూసిన రావల్ స్పందిస్తూ తన మరణ వార్తపై చమత్కరించారు. ఆయన ట్వీట్ చేస్తూ.. ‘అపోహ కలిగించిందుకు మన్నించాలి. ఉదయం 7 దాటాకా కూడా ఎక్కువ సమయం నిద్రపోయానంతే. నేను మరణించలేదు’ అంటూ చేతులు జోడించిన ఎమోజీని జత చేశారు. దీంతో నెటిజన్లు శతమానం భవతి అంటూ ఆయనను ఆశీర్వదిస్తుంటే మరికొందరు ఇలా తప్పుగా ట్వీట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొవాలంటూ మండిపడుతున్నారు. కాగా పరేశ్ రావల్ తెలుగులో చిరంజీవి హిట్ మూవీ ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’లో లింగం మామ పాత్రతో గుర్తింపు పొందారు. దీనితో పాటు ఆయన టాలీవుడ్లో పలు సినిమాల్లో నటించారు. కరోనా సెకండ్ వేవ్ భారత సినీ పరిశ్రమలో కలకలం సృష్టిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు, దర్శక-నిర్మాతలు మృత్యువాత పడుతున్నారు. ఈ క్రమంలో కొందరు బతికున్న నటులు సైతం కరోనాతో మరణించారంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ సింగర్ లక్కీ ఆలీ, నటుడు ముఖేష్ కన్నాలు కోవిడ్‌తో మరణించినట్లు వార్తలు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ వార్తలను వారు ఖండిస్తూ తాము చనిపోలేదని, బ్రతికే ఉన్నామంటూ ప్రకటనలు ఇచ్చారు. మేం బతికిఉన్నామంటూ మేమే ప్రకటించుకోవాల్సి రావడం దురదృష్టకరమంటూ ముఖేష్ కన్నా వ్యాఖ్యానించినప్పటికి, తాజాగా పరేశ్ రావల్‌పై ఇలాంటి తప్పుడు వార్తలు రావడం గమనార్హం. 🙏...Sorry for the misunderstanding as I slept past 7am ...! pic.twitter.com/3m7j8J54NF — Paresh Rawal (@SirPareshRawal) May 14, 2021 -
నా పెళ్లా? నాకు తెలియదే!
హీరోయిన్లకు నిరంతరం ఎదురయే కామన్ గాసిప్ – పెళ్లి. పెళ్లికి సిద్ధమవుతున్నట్టు అప్పుడప్పుడూ వార్తలు వస్తుంటాయి. తాజాగా ‘త్వరలోనే వరలక్ష్మి పెళ్లి చేసుకోబోతోంది. వరుడు ఫలానా క్రికెటర్. పెళ్లి తర్వాత వరలక్ష్మి సినిమాలకు దూరంగా ఉండాలనుకుంటోంది’ అంటూ ఇంటర్నెట్లో ఓ వార్త వైరల్ అయింది. ఆ వార్త వరలక్ష్మి కంట కూడా పడింది. వెంటనే దాన్ని కొట్టిపారేశారామె. ఈ విషయాన్ని తన ట్వీటర్లో పంచుకుంటూ – ‘‘ఏంటీ నాకు పెళ్లా? నేను పెళ్లి చేసుకోబోతున్నాను అనే విషయం నాకు ఆలస్యంగా తెలిసింది (వ్యంగ్య ధోరణిలో). అందరికీ నా పెళ్లి మీద అంత ఆసక్తి ఎందుకు? ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటే అందరికీ వినపడేలా గట్టిగా అరచి చెబుతాను. అప్పుడు నా పెళ్లి గురించి ఎంచక్కా రాసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను పెళ్లి చేసుకోవడం లేదు. సినిమాలను వదిలేయడం లేదు’’ అన్నారు వరలక్ష్మి. -
మరో ఫేక్ న్యూస్ : రతన్ టాటా ఆందోళన
సాక్షి, న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరోసారి ఫేక్ న్యూస్ బారిన పడ్డారు. దీంతో ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చారు. అంతేకాదు తాను చెప్పని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సంబధిత నకిలీ వార్తా కథనాన్ని షేర్ చేసిన రతన్ టాటా..ఇది కూడా నన్ను భయపెడుతోంది. ఇది నేను చెప్పలేదంటూ ట్వీట్ చేశారు. తన ఫోటో ఉన్నంత మాత్రాన ఆ వ్యాఖ్యలు తాను చేసినట్టు కాదని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి నకిలీ వార్తలపై తనకు వీలైన సమయాల్లో స్పందిస్తానని చెప్పారు. కానీ వీటిపట్ల అప్రమత్తంగా వుండాలని, ఇలాంటి వాటిని నిర్ధారించుకోవాలంటూ రతన్ టాటా మరోసారి సూచించారు. రతన్ టాటా ఆదివారం సాయంత్రం వివరణ ఇచ్చిన ఈ ట్వీట్ వైరల్ అయింది. లక్షకు పైగా లైక్‌లు, వేలాది రీట్వీట్లను సాధించింది. కాగా గత నెలలో కరోనావైరస్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం గురించి రతన్ టాటా అభిప్రాయం పేరుతో ఒక నకలీ వార్త బాగా వైరల్ అయింది. దీంతో స్వయంగా రతన్ టాటా ఆ అభిప్రాయం తనది కాదని, తాను అసలు అలా చెప్పలేదంటూ ట్విటర్ ద్వారా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. (నకిలీ వార్తలకు చెక్ చెప్పిన రతన్ టాటా) I’m afraid this too, has not been said by me. I will endeavour to call out fake news whenever I can, but would encourage you to always verify news sources. My picture alongside a quote does not guarantee me having said it, a problem that many people face. pic.twitter.com/pk0S75FxPA — Ratan N. Tata (@RNTata2000) May 3, 2020 -
చించావు పో రష్మిక!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సినీ నటి రష్మిక ఫొటోలపై జగిత్యాల కలెక్టర్ ట్విట్టర్లో కామెంట్ చేసినట్లు కొన్ని టీవీ చానెళ్లు, సోషల్ మీడియాలో వైరల్ కావడం చర్చనీయాంశమైంది. కలెక్టర్ హోదాలో ఉన్న అధికారి ఓ నటిపై కామెంట్ చేయడం ఏమిటనే విమర్శలకు దారితీసింది. బుధవారం మధ్యాహ్నం 2.38 గంటలకు నటి రష్మికకు కలెక్టర్ అధికారిక ట్విట్టర్ ఖాతా (collector @jagtial) నుంచి ‘చించావు పో రష్మిక’అనే కామెంట్ పోస్ట్ అయింది. దీంతో ట్విట్టర్ ఖాతాదారులు అవాక్కయ్యారు. సోషల్ మీడియాలో దుమారం లేపింది. దీంతోపాటు పలు మీడియా చానళ్లలో ఈ వార్త ఒకేసారి రావడం అధికార వర్గాలను ఇబ్బందికి గురి చేసింది. ఈ పోస్టింగ్ వెళ్లిన సమయంలో కలెక్టర్ రవి.. మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో ఓ అధికారిక సమావేశంలో పాల్గొనడం గమనార్హం. కాగా, 15 రోజుల క్రితమే కలెక్టర్‌గా రవి బాధ్యతలు చేపట్టారు. ఆయన ట్విట్టర్ ఖాతాను ఉపయోగించడం లేదు. గతంలో ఇక్కడ విధులు నిర్వర్తించిన కలెక్టర్ హయాంలో అధికారిక ట్విట్టర్ ఖాతాను కలెక్టరేట్ ఉద్యోగి ప్రసాద్ ఉపయోగించేవాడని సమాచారం. నాకు ట్విట్టర్ ఖాతానే లేదు: కలెక్టర్ ఈ విషయంపై కలెక్టర్ రవిని వివరణ కోరగా తనకు ట్విట్టర్ ఖాతానే లేదని, ట్విట్టర్ ఉపయోగించేంత సమయం కూడా లేదని చెప్పా రు. బుధవారం మధ్యాహ్నం 2.38 గంటలకు బ్రహ్మోత్సవాల కు సంబంధించి మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో నిర్వహించిన కార్యక్రమంలో ఉన్నానని పేర్కొన్నారు. ఈ విషయమై ఎస్పీ సింధూశర్మకు ఫిర్యాదు చేశానన్నారు. గతంలో కలెక్టర్‌కు ట్విట్టర్ ఖాతా ఉండేదని, ఆ ఖాతాను ప్రసాద్ అనే ఉద్యోగి చూస్తున్నాడని, అతనిని విచారించామని తెలిపారు. వేరే ఉద్యోగులు చేశారా అనే దానిపై కూడా విచారణ చేపట్టామన్నారు. కాగా, ఈ ఘటనపై ఎస్పీ నేతృత్వంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులపై వేటు కలెక్టర్ రవి ట్విట్టర్‌ను ఎవరో హ్యాక్ చేసినట్లు గుర్తించి జగిత్యాల డీఆర్వో అరుణశ్రీ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. సైబర్ నేరం కింద పట్టణ సీఐ జయేశ్‌రెడ్డి కేసు నమోదు చేశారు. దర్యాప్తు కోసం సైబర్ విభాగానికి పంపించారు. కాగా, కలెక్టర్ రవి ట్విట్టర్ ఖాతాను నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రసాద్, మమతలను తొలగించారు. ట్విట్టర్ పోస్టు -
క్షమాభిక్ష నేను కోరలేదు..
ముంబైః తన క్షమాభిక్ష పిటిషన్‌ను మహారాష్ట్ర గవర్నరు తోసిపుచ్చారన్న వార్తలపై బాలీవుడ్ హీరో సంజయ్ దత్ స్పందించాడు. అసలు తాను క్షమాభిక్ష పిటిషనే పెట్టుకోలేదని స్పష్టం చేశాడు. తానుగానీ, తన కుటుంబసభ్యులు కానీ మహారాష్ట్ర గవర్నరు, ప్రభుత్వానికి అలాంటి అర్జీ పెట్టుకోలేదని సంజుభాయ్ స్పష్టం చేశాడు. దీనికి సంబంధించి సంజయ్ దత్ తరఫు న్యాయవాదులు హితేష్ జైన్, సుభాష్ జాదవ్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సంజయ దత్ గానీ, ఆయన కుటుంబ సభ్యులుగానీ ఎవరూ క్షమాభక్ష పిటిషన్ దాఖలు చేయలేదని తెలిపారు. అయితే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూ ఈ పిటిషను దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. సంజయ్‌తోపాటు, ఈ కేసులో మిగిలిన దోషులకు కూడా క్షమాభిక్ష ప్రసాదించాలంటూ ఖట్జూ ఈ పిటిషన్ వేశారని తెలిపారు. మరికొద్ది రోజుల్లో ఆయన శిక్షాకాలం పూర్తి కావస్తుండగా, ఇక క్షమాభిక్ష పిటిషన్ ప్రశ్నే ఉత్పన్నం కాదని వారు స్పష్టం చేశారు. ఇటీవల ఫిబ్రవరిలో సంజయ్ పెరోల్ పై బయటకు వచ్చాడు. కాగా 1993 నాటి వరుస బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్ శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అతడికి 2013లో సుప్రీంకోర్టు అయిదేళ్ల కారాగార శిక్ష విధించిన సంగతి విదితమే. అయితే అప్పటికే దత్ 18 నెలలపాటు కారాగారంలో గడపడంతో ఆ కాలాన్ని మినహాయించింది. 2013 మే లో కారాగారానికి వెళ్లిన సంజయ్ దత్ 30 నెలల పాటు శిక్ష అనుభవించాడు. 2016, ఫిబ్రవరిలో అతడు విడుదల కావాల్సి ఉంది. కాగా 1993లో ముంబైలో 13 వరుస బాంబు పేళ్లులు సంభవించాయి. ఈ ఘటనల్లో 257మంది చనిపోగా, మరో 713మంది గాయపడ్డారు. -
గుడుంబా వద్దు,చీప్ లిక్కర్ ముద్దు!


