
యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే అంశంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రూ.2000 మించిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే యోచన ప్రభుత్వానికి లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజ్యసభలో స్పష్టం చేసింది. రూ.2000 దాటిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించాలని జీఎస్టీ కౌన్సిల్ నుంచి ఎలాంటి సిఫారసు చేయలేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభ వర్షాకాల సమావేశాల్లో చెప్పారు.
రూ.2000 మించిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందా అనే ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, జీఎస్టీ రేట్లు, మినహాయింపులను కేంద్రం, రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల సభ్యులతో కూడిన రాజ్యాంగ సంస్థ అయిన జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సుల ఆధారంగా నిర్ణయిస్తామని సభకు తెలిపారు. యూపీఐ ట్రాన్సాక్షన్ డేటా ఆధారంగా కర్ణాటకలోని వ్యాపారులకు దాదాపు 6,000 జీఎస్టీ డిమాండ్ నోటీసులు అందాయి.
మరోవైపు యూపీఐ లావాదేవీలను మరింత లోతుగా స్క్రూటినీ చేస్తూ, వాటి ఆధారంగా జీఎస్‌టీని దూకుడుగా అమలు చేస్తే మొదటికే మోసం రావొచ్చని ఎస్‌బీఐ రీసెర్చ్ ఒక నివేదికలో హెచ్చరించింది. దీనివల్ల చిన్న వ్యాపారులు తిరిగి నగదు లావాదేవీల వైపు వెళ్లిపోయే అవకాశం ఉందని పేర్కొంది. అలా జరగకుండా జీఎస్‌టీ అమలు విషయంలో జాగ్రత్తగా, బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుందని నివేదిక సూచించింది.