డీలిమిటేషన్‌పై కేంద్రం క్లారిటీ | Center Clarifies On Delimitation | Sakshi
Sakshi News home page

డీలిమిటేషన్‌పై కేంద్రం క్లారిటీ

Apr 15 2026 7:11 PM | Updated on Apr 15 2026 8:09 PM

Center Clarifies On Delimitation

ఢిల్లీ: డీలిమిటేషన్‌పై కేంద్రం స్పష్టతనిచ్చింది. ప్రస్తుతం ఉన్న సీట్లకు 50 శాతం పెంచుతున్నట్లు పేర్కొంది. బిల్లులో ఈ విషయం స్పష్టంగా ఉందన్న సమాచార శాఖ.. పార్లమెంట్‌ చర్చ సందర్భంగా మరింత క్లారిటీ ఇస్తామని తెలిపింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఢిలిమిటేషన్‌ ఉంటుందన్న అపోహలను కేంద్రం కొట్టిపారేసింది. ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్లు పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

తమిళనాడులో 58కి, కేరళంలో 30కి పెరుగుతాయన్న కేంద్రం.. డీలిమిటేషన్‌తో దక్షిణాదిలో సీట్లు తగ్గవని తెలిపింది. రాష్ట్రాలకు చట్టబద్ద రక్షణ ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బిల్లులోని అంశాలను ముక్కలుగా చదవి విశ్లేషించొద్దని కేంద్రం పేర్కొంది. 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని, అందుకోసం లోక్‌సభ స్థానాలను భారీగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

డీలిమిటేషన్‌ 2011 జనాభా లెక్కల ఆధారంగా కాకుండా తాజాగా జరుగుతున్న జనగణన ప్రాతిపదికన జరగాలని ఆప్, ఆర్జేడీ వంటి పార్టీలు డిమండ్‌ చేస్తున్నాయి. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఆమోదానికి ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ఇందుకు విపక్షాల మద్దుతు మోదీ ప్రభుత్వానికి తప్పనిసరి. ఈ నేపథ్యంలో సమావేశాలు వాడీవేడిగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. పార్లమెంటు సమావేశాలకు విధిగా హాజరు కావాలంటూ బీజేపీ, కాంగ్రెస్‌ ఇప్పటికే తమ ఎంపీలకు విప్‌ జారీ చేశాయి.

రేపటి (ఏప్రిల్‌ 16, గురువారం) నుంచి మూడు రోజుల పాటు జరగనున్న పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ రాజకీయ లబ్ధి కోసమే మోదీ సర్కారు హడావుడిగా మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణలను తెరపైకి తెచ్చిందని కాంగ్రెస్‌తో పాటు విపక్షాలన్నీ మండిపడుతున్నాయి. మరోవైపు డీలిమిటేషన్‌తో తమకు తీవ్ర అన్యాయం జరగనుందని దక్షిణాది రాష్ట్రాలు అభ్యంతరం లేవనెత్తుతున్నాయి. ఈ ప్రక్రియను పార్లమెంటులోనే సవాలు చేస్తామని ఇప్పటికే స్పష్టం చేశాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement