హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఛైర్మన్ రాజీనామా | RBI Clarifies After HDFC Bank Chairman Atanu Chakraborty Resigns | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఛైర్మన్ రాజీనామా

Mar 19 2026 12:57 PM | Updated on Mar 19 2026 1:44 PM

RBI Clarifies After HDFC Bank Chairman Atanu Chakraborty Resigns

పాలనా పరమైన ఆందోళనలు లేవు: ఆర్‌బీఐ

దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో చోటుచేసుకున్న అనూహ్య మార్పులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. బ్యాంక్ ఛైర్మన్ అతాను చక్రవర్తి రాజీనామా చేసిన నేపథ్యంలో సంస్థ పాలనా విషయాల్లో ఎటువంటి ఆందోళనలు లేవని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

గందరగోళానికి తెరదించిన ఆర్‌బీఐ

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఇటీవలి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపిన ఆర్‌బీఐ, బ్యాంక్ మేనేజ్‌మెంట్ కోరిన విధంగా పరివర్తన ఏర్పాట్లకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో బ్యాంక్ పటిష్టతపై ఆర్‌బీఐ పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ‘హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అత్యుత్తమ ఆర్థిక ప్రమాణాలు, సమర్థవంతమైన మేనేజ్‌మెంట్ బృందాన్ని కలిగి ఉంది. మా అంచనాల ప్రకారం ఈ బ్యాంక్ నిర్వహణ లేదా పాలనలో ఎటువంటి భౌతిక పరమైన లోపాలు లేవు’ అని ఆర్‌బీఐ పేర్కొంది.

తాత్కాలిక సారథిగా కేకీ మిస్త్రీ

అతాను చక్రవర్తి నిష్క్రమణతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు కేకీ మిస్త్రీని మార్చి 19 నుంచి మూడు నెలల పాటు తాత్కాలిక పార్ట్-టైమ్ ఛైర్మన్‌గా నియమించేందుకు ఆర్‌బీఐ పచ్చజెండా ఊపింది. ఈ విషయాన్ని బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది.

కేకీ మిస్త్రీ

గురువారం జరిగిన కాన్ఫరెన్స్ కాల్‌లో కేకీ మిస్త్రీ మాట్లాడుతూ, బ్యాంక్ పనితీరులో ఎటువంటి లోపాలు లేవని పునరుద్ఘాటించారు. ‘మా అంతర్గత చర్చల్లో కానీ, మా దృష్టికి వచ్చిన అంశాల్లో కానీ ఎటువంటి కార్యాచరణ లోపాలు లేవు. హైలైట్ చేయాల్సిన ప్రత్యేక సమస్యలేవీ ప్రస్తుతానికి లేవు’ అని ఆయన స్పష్టం చేశారు.

అతాను చక్రవర్తి నిష్క్రమణ వెనుక..

మే 2021లో బోర్డులో చేరిన అతాను చక్రవర్తి మార్చి 17న తన రాజీనామా లేఖను సమర్పించారు. తన వ్యక్తిగత విలువలు, నైతికతకు ప్రస్తుత పరిస్థితులు అనుగుణంగా లేవని ఆయన లేఖలో పేర్కొనడం చర్చనీయాంశమైంది. అయితే, రాజీనామా లేఖలో పేర్కొన్న అంశాలు మినహా ఇతర కారణాలేవీ లేవని బ్యాంక్ యాజమాన్యం ధ్రువీకరించింది. చక్రవర్తి హయాంలోనే హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌తో బ్యాంక్ విలీనం వంటి చారిత్రాత్మక నిర్ణయం జరిగింది.

ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement