మోదీకి ట్రంప్‌ ప్రశంస.. బిత్తరపోయిన పాక్‌ పీఎం.. వీడియోలు చూసేయండి | Trump Praise Modi: Pak PM, Italy Meloni Reactions Viral Video | Sakshi
Sakshi News home page

మోదీకి ట్రంప్‌ ప్రశంస.. బిత్తరపోయిన పాక్‌ పీఎం.. వీడియోలు చూసేయండి

Oct 14 2025 8:10 AM | Updated on Oct 14 2025 9:58 AM

Trump Praise Modi: Pak PM, Italy Meloni Reactions Viral Video

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన పనికి పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ బిత్తరపోయారు. భారత ప్రధాని మోదీపై ప్రశంసలు గుప్పించిన మోదీ.. పాక్‌తో సంబంధాలపైనా వ్యాఖ్య చేసే సరికి షరీఫ్‌ నోటి వెంట మాట రాలేదు. అదే సమయంలో షరీఫ్‌ ప్రసంగించిన టైంలోనూ మరో ఘటన చోటు చేసుకుంది. ఈజిప్ట్‌ గాజా శాంతి సదస్సులో ఈ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. 

ఈజిఫ్ట్‌ శర్మ్‌ ఎల్‌-షేక్‌ వేదికగా గాజా శాంతి సదస్సు Gaza Peace Summit 2025 జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో భారత్, పాకిస్తాన్, ఇజ్రాయెల్, అరబ్ దేశాల నేతలు 20 మంది దాకా పాల్గొన్నారు. ఆ సదస్సులో ట్రంప్‌ మాట్లాడుతూ.. భారత్ గొప్ప దేశం. అక్కడ నా మంచి మిత్రుడు ఉన్నారు. ఆయన అత్యంత అద్భుతంగా పనిచేస్తున్నారు. భారత్, పాకిస్తాన్ కలిసి శాంతియుతంగా జీవించగలవు అని అన్నారు. ఆ వెంటనే.. 

పాకిస్తాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ వైపు చూస్తూ ట్రంప్‌ ‘అంతే కదా?’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే.. ఈ వ్యాఖ్యలకు నోట మాట పడిపోయిందేమో.. షరీఫ్ నవ్వుతూ ఏదో కవర్‌ చేసుకోబోయారు. అదే సమయంలో.. పక్కనున్న మిగతా దేశాల నేతలు చిన్నగా నవ్వుకున్నారు. మరోవైపు.. 

 

షెహ్‌బాజ్ షరీఫ్ తన ప్రసంగంలో ట్రంప్‌ భజనకే పరిమితం అయ్యారు. ఇండియా, పాకిస్తాన్ రెండూ అణు శక్తులు. ఈ వ్యక్తి (ట్రంప్) మరియు ఆయన బృందం నాలుగు రోజుల పాటు మధ్యవర్తిత్వం చేయకపోయుంటే, యుద్ధం ఎవరికీ చెప్పుకోలేని స్థాయికి చేరిపోయేది అని అన్నారు. ఆయన ఇప్పటికే ఏడు యుద్ధాలు ఆపారని, ఇవాళ ఎనిమిదోది(గాజా సంక్షోభం గురించి) ఆపారని అన్నారు. అలాంటి వ్యక్తిని తాను నోబెల్‌ శాంతి బహుమతికి నామినేట్‌ చేస్తున్నా అనడంతో.. వెనకాలే ఉన్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తల పట్టుకుని.. రకరకాల హవభావాలతో ‘ఇవేం పొగడ్తలు’ అన్నట్లు ఎక్స్‌ప్రెషన్లు ఇచ్చారు. వెనుకనే నోటిమీద చేయి వేసుకొని చూస్తుండిపోయారామె. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అవుతోంది. 

మరోవైపు.. ట్రంప్‌ గాజా ప్లాన్‌ కుదరడంపై భారత ప్రధాని మోదీ.. ట్రంప్‌కు అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో గాజా శాంతి సదస్సుకు భారత ప్రధాని మోదీని ట్రంప్‌ ఆహ్వానం అందించారు. అయితే మోదీ తరఫున ప్రత్యేక దూతగా విదేశాంగ సహాయ మంత్రి కీర్తి వర్దన్‌ సింగ్‌ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్‌ను కలిసి.. శాంతి ఒప్పందంపై భారత్‌ తరఫున సంతకం చేశారాయన. ఈ విషయాన్ని విదేశాంగ ప్రతినిధి రణ్‌దీర్‌ జైశ్వాల్‌ అధికారికంగా ధృవీకరించారు. తన చొరవ వల్లే పాక్‌-భారత్‌ మధ్య ఉద్రిక్తతలు చల్లారాయంటూ ట్రంప్‌ మే 10వ తేదీ నుంచి నిన్న ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ ప్రసంగంలోనూ ప్రస్తావించడం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement