breaking news
peace treaty
-
సమయం లేదు.. భారీ రక్తపాతం ఎదురు చూస్తోంది
గాజా శాంతి చర్చల వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాజా శాంతి ప్రణాళిక అమలుకు ఎంతో సమయం లేదని.. త్వరగా ముందుకు కదలాలంటూ ఇజ్రాయెల్, హమాస్లకు సూచించారాయన. ఈ క్రమంలో చర్చలు ఆలస్యమైనా.. అటు ఇటు అయినా.. దారుణమైన పరిణామాలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేశారు.ఇది శతాబ్దాల నాటి ఘర్షణ. స్వయంగా ఈ చర్చలను నేనే పర్యవేక్షిస్తుంటా(Trump Gaza Plan). సమయం ఎంతో కీలకం. ఆలస్యం చేస్తే అత్యంత భారీ రక్తపాతం జరుగుతుంది. అలాంటిదాన్ని ఎవ్వరూ చూడాలనుకోరు.. అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్ ద్వారా హెచ్చరించారు. ‘‘ఈ వారం చివర్లో గాజా యుద్ధాన్ని ముగించేందుకు.. బందీలను విడుదల చేయడానికి.. అన్నింటికంటే ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఎప్పటి నుంచో కోరుకుంటున్న శాంతిని నెలకొల్పేందుకు సానుకూల చర్చలే జరుగుతున్నాయి’’ ట్రంప్ అని ఆ పోస్టు ద్వారా వెల్లడించారు. ప్రస్తుతానికి ఈ చర్చలు కీలక దశలోనే ఉన్నాయంటూ పేర్కొన్నారాయన. ట్రంప్ గాజా ప్లాన్‌పై ఇజ్రాయెల్, హమాస్(Israel Hamas Deal) రెండూ ఒప్పందానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చినప్పటికీ.. చర్చలు మాత్రం నెమ్మదిగా సాగుతున్నాయి. ఈ తరుణంలో.. ఇవాళ(సోమవారం) ఈజిప్ట్‌లో ట్రంప్ గాజా ప్లాన్‌పై చర్చలు జరగనున్న నేపథ్యంలోనే ట్రంప్ వ్యాఖ్యలు ఇటు ఇజ్రాయెల్, అటు హమాస్‌పై ఒత్తిడిని పెంచేందుకేనని స్పష్టంగా తెలుస్తోంది. కైరో(Cairo)లో ఇవాళ జరుగనున్న ఈ చర్చల్లో హమాస్, ఇజ్రాయెల్, అమెరికా, ఈజిప్ట్ ప్రతినిధులు పాల్గొంటున్నారు. గాజా పట్టణంలో కొనసాగుతున్న యుద్ధం.. మానవీయ సంక్షోభ నేపథ్యంలో కాల్పుల విరమణ, హమాస్ చెరలో ఉన్న బందీల విడుదల, గాజాకు మానవతా సహాయం అందించడం వంటి ప్రధాన అంశాలపై చర్చలు జరగనున్నాయి. అలాగే హమాస్ విముక్త గాజా అంశమూ కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. 2023 అక్టోబర్ 7న హమాస్, ఇజ్రాయెల్ సరిహద్దులో జరిపిన దాడితో ఈ యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న దాడులతో.. ఇప్పటిదాకా వేల మంది పౌరులు మృతి చెందారు. తీవ్ర ఆహార సంక్షోభం నెలకొందక్కడ. ఈ పరిణామాలపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలో శాంతి ఒప్పందం త్వరగా కుదరాలని అంతర్జాతీయ సమాజం కోరుకుంటోంది. గాజా శాంతి ఒప్పందంలో(Gaza Peace Deal) భాగంగా ట్రంప్ సూచించిన 20 అంశాల శాంతి ప్రణాళికకు హమాస్ అంగీకారం తెలిపింది. ఇజ్రాయెల్ సైతం అంగీకారం తెలిపినప్పటికీ.. హమాస్ లక్ష్యంగా గాజా నుంచి పూర్తిగా తమ బలగాలను ఉపసంహరించుకునేందుకు మాత్రం ఒప్పుకోవడం లేదు. ఈ తరుణంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ Truth Social వేదికగా చేసిన తాజా పోస్టులో.. గాజా శాంతి ఒప్పందం మొదటి దశ ఈ వారం పూర్తవుతుందని చెబుతుండడం గమనార్హం. ఇదీ చదవండి: భారత్‌పై నోరు పారేసుకున్న పాక్ మంత్రి -
‘నాగా’తో ప్రాదేశిక సమగ్రత దెబ్బతినదు
షోఖువి: నాగా వేర్పాటువాదులతో కేంద్రం కుదుర్చుకోనున్న శాంతి ఒప్పందం వల్ల ఈశాన్య రాష్ట్రాల ప్రాదేశిక సమగ్రత ఏమాత్రం దెబ్బతినదని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. నాగా తీవ్రవాదులతో ఈ ఒప్పందం వల్ల అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, మణిపూర్ రాష్ట్రాల ప్రాదేశిక సమగ్రతకు నష్టం కలుగుతుందా? అన్న మీడియా ప్రశ్నకు రాజ్‌నాథ్ ఈ మేరకు జవాబిచ్చారు. ఈ శాంతి ఒప్పందంపై ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన హామీనిచ్చారు. ప్రస్తుతం నాగా వేర్పాటువాదులతో చర్చలు జరుపుతున్న ఆర్ఎన్ రవి అద్భుతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, అస్సాంల్లోని నాగా మెజారిటీ ప్రాంతాలను ఏకం చేయాలని నేషనల సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్(ఎన్ఎస్సీఎన్–ఐఎం) గ్రూప్ డిమాండ్ చేస్తోంది. దీన్ని ఈ మూడు బీజేపీ పాలిత రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న హింసకు అడ్డుకట్ట వేయడంలో భాగంగా కేంద్రం ఎన్ఎస్సీఎన్–ఐఎం గ్రూప్‌తో 2015లో ముసాయిదా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
ఏళ్ల సమస్యకు పరిష్కారం దిశగా రష్యా..
టోక్యో: జపాన్‌తో చక్కటి సంబంధాలు నెలకొల్పుకునేందుకు రష్యా సిద్ధమవుతోంది. టోక్యోతో ఎలాంటి ఘర్షణలకు దిగకూడదని ఆ దేశం భావిస్తోంది. ఈ మేరకు శాంతి ఒప్పందం చేసుకోనుంది. ‘మేం జపాన్‌తో శాంతి ఒప్పందాన్ని చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. పూర్తి స్థాయిలో ఇరు దేశాల మధ్య మామలు పరిస్థితులు కొనసాగించాలని కోరుకుంటున్నాం’ అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. పుతిన్ గురువారం జపాన్ పర్యటనకు వెళుతున్న నేపథ్యంలో ఈ ఒప్పందం అంశం కీలకం కానుంది. జపాన్-రష్యాల మధ్య గత కొంత కాలం నుంచి కురిల్ దీవుల విషయంలో వివాదం ఉంది. వాస్తవానికి ఈ దీవులు జపాన్‌వే అయినప్పటికీ 1945 రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రష్యాకు అప్పగించింది. అప్పటి నుంచి ఈ దీవులు రష్యా ఆదీనంలో ఉన్నాయి. అయితే, ఈ దీవులు తమకే చెందుతాయంటూ అనంతరం జపాన్ పట్టుబట్టింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య జరగాల్సిన శాంతి ఒప్పందం జరగకుండానే ఆగిపోయింది. దీంతో మరోసారి ఆ దిశగా రెండు దేశాలు పావులు కదుపుతున్నాయి. -
రష్యా, ఉక్రెయిన్ల శాంతి ఒప్పందం
ఆదివారం నుంచి కాల్పుల విరమణ మిన్స్క్ చర్చల్లో ముందడుగు మిన్స్క్(బెలారస్): రష్యా, ఉక్రెయిన్ల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. బెలారస్ రాజధాని మిన్స్క్లో ఆ రెండు దేశాలతో పాటు జర్మనీ, ఫ్రాన్స్‌లు పాల్గొని, 16 గంటల పాటు ఏకధాటిగా జరిపిన శాంతి చర్చల అనంతరం గురువారం ఒక అంగీకారానికి వచ్చారు. దీని ప్రకారం ఆదివారం నుంచి ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాల్లో కాల్పుల విరమణ అమల్లోకి వస్తుంది. ఈ ఒప్పందం విజయవంతంగా అమలైతే రష్యా అనుకూల తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో శాంతి నెలకొంటుంది. ఆ ప్రాంతం 2015 చివరి నాటికి ఉక్రెయిన్ నియంత్రణలోకి వస్తుంది. ఈ ఒప్పందంలో చాలా లోపాలున్నాయన్న విషయం ఒప్పంద ప్రకటన సమయంలోనే తేటతెల్లమైంది. ప్రస్తుతం తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న దెబాల్త్సీవ్ పట్టణంపై నియంత్రణ సహా ఏయే అంశాలపై ఒప్పందం కుదిరందనే విషయంలో మొదటిరోజే రష్యా, ఉక్రెయిన్లు విభేదించాయి. ఆదివారం నుంచి కాల్పుల విరమణ, తిరుగుబాటుదారుల ప్రాబల్యం ఉన్న తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తి, సరిహద్దు సమస్యల పరిష్కారానికి చర్యలు.. తదితర అంశాలపై అంగీకారం కుదిరిందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించగా, తిరుగుబాటుదారుల ప్రాబల్యం ఉన్న తూర్పు ఉక్రెయిన్‌కు ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో ఎలాంటి అంగీకారానికి రాలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు పెట్రో పొరొషెంకో పేర్కొన్నారు. తూర్పు ఉక్రెయిన్ ప్రాంతానికి విశేషాధికారాలు ఇచ్చేందుకు అవసరమైన ఆ దేశ పార్లమెంటు ఆమోదం విషయంలో కూడా సమస్యలు తలెత్తే అవకాశముంది.