
రష్యా, ఉక్రెయిన్‌ల శాంతి ఒప్పందం
రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. బెలారస్ రాజధాని మిన్స్క్‌లో ఆ రెండు దేశాలతో పాటు జర్మనీ, ఫ్రాన్స్‌లు పాల్గొని, 16 గంటల పాటు ఏకధాటిగా...
- ఆదివారం నుంచి కాల్పుల విరమణ
- మిన్స్క్ చర్చల్లో ముందడుగు
మిన్స్క్(బెలారస్): రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. బెలారస్ రాజధాని మిన్స్క్‌లో ఆ రెండు దేశాలతో పాటు జర్మనీ, ఫ్రాన్స్‌లు పాల్గొని, 16 గంటల పాటు ఏకధాటిగా జరిపిన శాంతి చర్చల అనంతరం గురువారం ఒక అంగీకారానికి వచ్చారు. దీని ప్రకారం ఆదివారం నుంచి ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాల్లో కాల్పుల విరమణ అమల్లోకి వస్తుంది. ఈ ఒప్పందం విజయవంతంగా అమలైతే రష్యా అనుకూల తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో శాంతి నెలకొంటుంది.
ఆ ప్రాంతం 2015 చివరి నాటికి ఉక్రెయిన్ నియంత్రణలోకి వస్తుంది. ఈ ఒప్పందంలో చాలా లోపాలున్నాయన్న విషయం ఒప్పంద ప్రకటన సమయంలోనే తేటతెల్లమైంది. ప్రస్తుతం తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న దెబాల్త్సీవ్ పట్టణంపై నియంత్రణ సహా ఏయే అంశాలపై ఒప్పందం కుదిరందనే విషయంలో మొదటిరోజే రష్యా, ఉక్రెయిన్‌లు విభేదించాయి.
ఆదివారం నుంచి కాల్పుల విరమణ, తిరుగుబాటుదారుల ప్రాబల్యం ఉన్న తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తి, సరిహద్దు సమస్యల పరిష్కారానికి చర్యలు.. తదితర అంశాలపై అంగీకారం కుదిరిందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించగా, తిరుగుబాటుదారుల ప్రాబల్యం ఉన్న తూర్పు ఉక్రెయిన్‌కు ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో ఎలాంటి అంగీకారానికి రాలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు పెట్రో పొరొషెంకో పేర్కొన్నారు. తూర్పు ఉక్రెయిన్ ప్రాంతానికి విశేషాధికారాలు ఇచ్చేందుకు అవసరమైన ఆ దేశ పార్లమెంటు ఆమోదం విషయంలో కూడా సమస్యలు తలెత్తే అవకాశముంది.