
షోఖువి: నాగా వేర్పాటువాదులతో కేంద్రం కుదుర్చుకోనున్న శాంతి ఒప్పందం వల్ల ఈశాన్య రాష్ట్రాల ప్రాదేశిక సమగ్రత ఏమాత్రం దెబ్బతినదని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. నాగా తీవ్రవాదులతో ఈ ఒప్పందం వల్ల అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, మణిపూర్ రాష్ట్రాల ప్రాదేశిక సమగ్రతకు నష్టం కలుగుతుందా? అన్న మీడియా ప్రశ్నకు రాజ్‌నాథ్ ఈ మేరకు జవాబిచ్చారు. ఈ శాంతి ఒప్పందంపై ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన హామీనిచ్చారు.
ప్రస్తుతం నాగా వేర్పాటువాదులతో చర్చలు జరుపుతున్న ఆర్‌ఎన్ రవి అద్భుతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, అస్సాంల్లోని నాగా మెజారిటీ ప్రాంతాలను ఏకం చేయాలని నేషనల సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్(ఎన్‌ఎస్‌సీఎన్–ఐఎం) గ్రూప్ డిమాండ్ చేస్తోంది. దీన్ని ఈ మూడు బీజేపీ పాలిత రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న హింసకు అడ్డుకట్ట వేయడంలో భాగంగా కేంద్రం ఎన్‌ఎస్‌సీఎన్–ఐఎం గ్రూప్‌తో 2015లో ముసాయిదా ఒప్పందాన్ని కుదుర్చుకుంది.