ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్-పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు నేతృత్వంలో ఆల్‌పార్టీ మీటింగ్ జరుగుతోంది. సెషన్ సజావుగా సాగేందుకు సహకరించాలని ఈ సందర్భంగా కేంద్రం అన్ని పార్టీలను కోరుతున్నట్లు సమాచారం.
బడ్జెట్ సమావేశాల్లో.. వివిధ రంగాల్లో సంస్కరణల కోసం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇప్పటికే జేపీసీ పరిశీలనలో ఉన్న జమిలి ఎన్నికల కోసం 129 రాజ్యాంగ సవరణ బిల్లు, అలాగే విద్యారంగంలో సంస్కరణల కోసం వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లు, సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. అయితే..
గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు, ఎస్ఐఆర్ అంశాలపై విపక్షాలు కేంద్రంపై పోరాటానికి దిగాయి. ఈ తరుణంలో బడ్జెట్ సమావేశాలను తమ నిరసనలకు వేదికగా మార్చుకోవాలనుకుంటున్నాయి. చర్చకు పట్టుబట్టే అవకాశం ఉండడంతో.. తమకు సహకరించాలని అఖిలపక్షం ద్వారా కేంద్రం బతిమాలుతోంది. ఇదిలా ఉంటే..
VIDEO | Delhi: Visuals from all party meeting being held ahead of the Budget Session.
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7)#Delhi pic.twitter.com/GUDbDQmwcQ— Press Trust of India (@PTI_News) January 27, 2026
జనవరి 28 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండు దశల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. తొలి దశ రేపు.. రాష్ట్రపతి ద్రౌపది మురుము ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం అవుతాయి. కేంద్రం జనవరి 29న ఆర్థిక సర్వే.. ఫిబ్రవరి 1న ఆదివారంనాడు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 13వ తేదీతో తొలి విడత బడ్జెట్ సమావేశాలు ముగుస్తాయి. అలాగే.. మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.


