
ఇంకా కొలిక్కి రాని భూముల పంచాయితీ.. రెండు శాఖల జాయింట్ సర్వేపై కొరవడిన స్పష్టత
పదిన్నర లక్షలకు పైగా ఎకరాల్లో వివాదం ఏర్పడిందంటున్న అటవీ అధికారులు
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ–అటవీశాఖల మధ్య నెలకొన్న సరిహద్దుల పంచాయితీ ఎంతకీ కొలిక్కి రావడం లేదు. ఈ రెండు శాఖల మధ్య కొన్నేళ్లుగా కొనసాగుతున్న భూవివాదాలు ఇప్పట్లో సమసిపోయేలా లేవు. సమస్య పరిష్కారానికి ఎప్పటికప్పుడు భూముల సంయుక్త సర్వే చేపడతామని చెబుతున్నా, అది ఆచరణలోకి రావడం లేదు. ముందుగా ఏవి అటవీ భూములు, ఏవి రెవెన్యూ భూములు అన్న దానిపై స్పష్టత సాధించే విషయంలోనే అడుగు ముందుకు పడకపోవడం గమనార్హం.
అటవీభూమి 60 లక్షల ఎకరాల్లో...
తెలంగాణలో 60.64 లక్షల ఎకరాల మేర తమ శాఖ భూములు ఉన్నట్టుగా రికార్డుల్లో ఉందని అటవీ అధికారులు చెబుతున్నారు. ఇందులో 49.80 లక్షల ఎకరాల భూముల్లో ఎలాంటి వివాదాలు లేకపోగా, రికార్డుల పరంగా క్లియర్‌గా ఉన్నాయంటున్నారు. గతంలోనే సిద్ధం చేసిన లెక్కల ప్రకారం..ప్ర«దానంగా పదిన్నర లక్షల ఎకరాల పరిధిలో అటవీ, రెవెన్యూశాఖల మధ్య సరిహద్దు వివాదాలు నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీటిపై ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం కోసం సంబంధిత శాఖలు ఎదురుచూస్తున్నాయి. గత ప్రభుత్వ హయాం నాటి గణాంకాలను బట్టి చూస్తే...
» మహబూబాబాద్ జిల్లాలో 3.44 లక్షల ఎకరాలుండగా, అందులో అత్యధికంగా 2.89 లక్షల ఎకరాలు వివాదాల్లో ఉన్నట్టు తెలిసింది.
» వరంగల్ రూరల్ జిల్లాలో 38 వేల ఎకరాలుండగా, వాటిలో 26వేల ఎకరాల్లో భూ వివాదాలున్నాయి.
» కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 5.29 లక్షల ఎకరాలుండగా, వివాదాల్లో 1.86 లక్షల ఎకరాలు, ఆదిలాబాద్ జిల్లాలో 4.33 లక్షల ఎకరాలకుగాను 1.50 లక్షల ఎకరాల్లో వివాదాలు, వికారాబాద్ జిల్లాలో 1.08 లక్షల ఎకరాలకుగాను 42 వేల ఎకరాలు, నిర్మల్ జిల్లాలో 3.16 లక్షల ఎకరాలకుగాను 70 వేల ఎకరాల్లో, ఖమ్మం జిల్లాలో 1.42 లక్షల ఎకరాలుండగా వాటిలో 35 వేల ఎకరాల దాకా, నల్లగొండ జిల్లాలో 52 వేల ఎకరాలకుగాను 13 వేల ఎకరాలు భూ వివాదాల్లో ఉన్నట్టుగా తెలిసింది.
» అటవీశాఖకు చెందిన ఎలాంటి వివాదాలకు తావులేని భూమిగా గుర్తించిన 49.80 లక్షల ఎకరాలకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఐఎల్‌ఆర్‌ఎంఎస్–నోషనల్ ఖాతా మార్కింగ్)లో మెజారిటీ భూములు రికార్డుకాగా, కొంతమేర నోషనల్ ఖాతా మార్కింగ్ చేపట్టాల్సి ఉంది.
పక్కాగా స్థిరీకరణకు సర్కార్ దృష్టి
రెండేళ్ల కాలంలో పోడు సమస్యతోపాటు, వివాదాలున్న అటవీ భూముల సమస్యను కూడా పరిష్కరించే దిశగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టలేదనే విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటవీ భూమిని, రెవెన్యూ రికార్డులతో సరిచూసుకొని ఇకపై పక్కాగా స్థిరీకరించుకోవాలని, భవిష్యత్‌లో ఎలాంటి ఆక్రమణలకు తావు ఇవ్వకూడదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దానికి తగ్గట్టుగానే పోలీస్, రెవెన్యూ శాఖల సమన్వయంతో అటవీ అధికారులు పనిచేసేలా చర్యలు చేపట్టాలని యోచిస్తున్నట్టుగా తెలిసింది.
అటవీ భూముల సరిహద్దులు లెక్క తేల్చి, సరిహద్దుల గుర్తింపు, కంచె లేదా కందకాల ఏర్పాటు ద్వారా భవిష్యత్ ఆక్రమణలు అడ్డుకోవచ్చునని అటవీ అధికారులు సూచిస్తున్నారు. రెవెన్యూ శాఖ అ«దీనంలోని రిజర్వ్ ఫారెస్ట్ భూములపై తాజాగా అన్ని జిల్లా స్థాయిల్లో ఇటీవల సర్వే ప్రారంభమైంది. అయినా, ఇంకా పూర్తి స్పష్టత రాకపోవడంతో సమస్య పరిష్కారం కావడం లేదు. రెండు శాఖల ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెడితేనే ఇది పరిష్కారమయ్యే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
లెక్కల రికార్డులేవి?
» అటవీ, రెవెన్యూ రికార్డుల్లో ఆయా శాఖలకు సంబంధించి ఎంత భూములున్నాయన్న దానిపైనా ఇంకా పూర్తి స్పష్టత లభించలేదని అధికార వర్గాల సమాచారం. కొన్నేళ్లుగా ఈ భూముల పంచాయితీకి తెరదించాలని తాము చూస్తున్నా, రెవెన్యూశాఖ పెద్దగా స్పందించడం లేదని అటవీశాఖ అధికారులు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే ఏ శాఖకు ఆ శాఖ వేర్వేరుగా రికార్డులను నిర్వహించడంతోపాటు, వాటి నమోదు కూడా సరిగా చేయకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని రెవెన్యూ శాఖ అధికారులు చెబుతున్నారు.
పూర్తిస్థాయిలో అటవీ భూముల సర్వే చేయకపోవడం, రెండు శాఖలు ఆయా జిల్లాల్లో తమ భూమి అంటే తమ భూమి అని రికార్డులకు ఎక్కించడం వల్ల ఎదురైన వివాదాల పరిష్కారానికి సామరస్యంగా చర్యలు చేపట్టాలనే అభిప్రాయంతో వారున్నారు.