అడవి విడిచిన ఆయుధం… | Special Story On Maoists leave the forests and the mainstream of life | Sakshi
Sakshi News home page

అడవి విడిచిన ఆయుధం…

Oct 18 2025 4:15 PM | Updated on Oct 18 2025 4:18 PM

Special Story On Maoists leave the forests and the mainstream of life

మావోయిస్టు పార్టీలో శిఖర సమానులైన ఇద్దరు కేంద్రకమిటీ సభ్యులు పోలీసుల ముందు లొంగిపోయారు. తమ బలగంతో సహా ముఖ్యమంత్రుల ఎదుట సరెండర్ అయ్యారు. ఆయుధం వదిలి రాజ్యాంగ ప్రతిని చేతబట్టారు. తుపాకీ వదిలి ప్రజాస్వామ్య ప్రతిన బూనారు. రెండు రోజుల్లో దాదాపు 300లకు పైగా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు. భారత దేశ సాయుధ పోరాట చరిత్రలో ఇదో కీలక మైలురాయి. అర్థ శతాబ్దపు నక్సల్బరీ పోరాట చరిత్రలో అతిపెద్ద  కుదుపు. ఇది సైద్ధాంతిక భావాజాలనికి ఎండ్ పాయింట్ అని కొందరంటుంటే… పోరాట పంథాలో మార్పు మాత్రమే అని మరికొందరంటున్నారు. కాలమాన పరిస్థితులను ఎదుర్కొన్న మావోయిస్టు సిద్దాంతాన్ని…  మరో రూపంలో రాబోయే తరానికి అందించడానికే… అన్నలు అస్త్రసన్యాసం చేస్తున్నారనే వాదనలూ వినిపిస్తున్నాయి. 

ఒకరు సిద్ధాంత కర్త… మరొకరు గెరిల్లా వీరుడు
మావోయిస్టు పార్టీలో ప్రస్తుతం తీవ్రమైన అంతర్గత ఘర్షణ ఉంది.ముఖ్యంగా ఆయుధం వదలాలనే వర్గం ఇప్పటికే మూటా ముల్లే సర్దుకుని… అడవీని వీడుతున్నారు. దాదాపు 300మంది మావోలు అటు మహారాష్ట్ర ఇటు ఛత్తీస్ఘడ్ సర్కార్ల ముందు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు పార్టీ సర్వోన్నత నిర్ణాయక మండలి అయిన పొలిట్బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్, మరో కేంద్రకమటీ సభ్యుడు ఆశన్న ఉన్నారు. వీరిద్దరు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీలో కీలక భూమిక పోషించారు. ముఖ్యంగా మల్లోజుల వేణుగోపాల్ మావోయిస్టు పార్టీ సైద్ధాంతిక రూపకల్పన, సాహిత్య రచనా విభాగంలో ఎంతో పనిచేశారు. మావోయిస్టు పార్టీ పొలిట్బ్యూరో ఆమోదించిన ఎన్నో సైద్ధాంతిక పత్రాలకు రూపకల్పన చేసింది కూడా మల్లోజుల వేణుగోపాల్ రావే. 

సాధన పేరుతో ఎన్నో పుస్తకాలు రాసిన చరిత్ర మల్లోజుల వేణుగోపాల్ది. మావోయిస్టు పార్టీ మేధావి వర్గంలో ఎలాంటి శశభిషలు లేకుండా అత్యున్నతుడు అనే పేరు తెచ్చుకుంది కూడా మల్లోజుల వేణుగోపాలే. సల్వాజుడుం వల్లే మావోయిస్టు పార్టీ బలోపేతం అయింది అంటూ థాంక్స్ టు సల్వాజుడుం పేరుతో పేరుతో మల్లోజుల వేణుగోపాల్ పుస్తకం రాశారు. ఒక దశలో గణపతి తరువాత బాధ్యతలు మల్లోజుల వేణుగోపాల్కు ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది.  ఇక ఆశన్న అలియాస్ తక్కలపల్లి వాసుదేవరావు మావోయిస్టు పార్టీ మిలటరీ విభాగంలో ఆరితేరిన యుద్ధవీరుడు. 

2003లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కారు కింద క్లైమోర్మెన్లు పెట్టింది కూడా ఆశన్నే. దండకారుణ్యంలో ఎన్నో అంబుష్లకు నేతృత్వం వహించిన ఆశన్న మావోయిస్టు పార్టీలోనే నెంబర్-1 ఆర్మీ కమాండర్గా ఎదిగాడు. మావోయిస్టు పార్టీ అబూజ్మఢ్లో  నిర్వహించిన చాలా ఆంబుష్లకు నేతృత్వం వహించింది కూడా ఆశన్ననే. 2013లో ఛత్తీస్ఘడ్లోని ఝీరమ్ ఘాటి దాడిలో మహేంద్రకర్మతో పాటు పదిమందిని హత్యచేసిన సంఘటనలోనూ ఆశన్న ప్లానింగ్ ఉందని చెబుతారు. ఇక 2011లో మావోయిస్టు పార్టీ సుక్మా జిల్లాలో 75మంది సీఆర్పీఎఫ్ జవాన్లను చంపేసిన సంఘటన ప్లానింగ్ కూడా ఆశన్నదే అని చెప్తారు. అందుకే మావోయిస్టు పార్టీలో సైద్ధాంతికంగా అత్యంత బలమైన మల్లోజుల… యుద్ధవిద్యలో ఆరితేరిన గెరిల్లా ఆశన్నలు ఆయుధాలు వదిలివేయడం ఇప్పుడు ఓ సంచలనం. 

లేఖలతో యుద్ధం… 
మావోయిస్టు పార్టీకి చెందిన సాయుధ క్యాడర్ వందల సంఖ్యలో ఆయుధాలతో లొంగిపోవడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మావోయిస్టు పార్టీని విభేదించి బయటకు వచ్చిన మల్లోజుల, ఆశన్నలది ద్రోహం అని కొందరు మావోయిస్టు సానుభూతిపరులు చెబుతున్నారు. పార్టీకి ద్రోహం చేసి వీరంతా బయటకు వచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి. మరికొంతమంది ఇప్పటికైనా మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావడం మంచి పరిణామం అంటూ వీరికి మద్దతునిస్తున్నారు. ప్రాణాలు కాపాడుకోవడమే పోరాటంగా మారినప్పుడు లొంగిపోవడంలో తప్పులేదని చెబుతున్నారు. తెలుగు ప్రజల్లో మావోయిస్టుల సరెండర్పై భిన్నాభిప్రాయాలున్నాయి. ఇక చాలాకాలం నుంచి మావోయిస్టులను అరాచకశక్తులు అని తిట్టిపోసే…  ఛత్తీస్ఘడ్ మీడియా మాత్రం లొంగిపోయిన మావోలను హీరోలుగా కీర్తిస్తోంది. మొత్తానికి మావోయిస్టు పార్టీలో అంతర్గతంగా ఉన్నట్లుగానే బయట కూడా లొంగుబాటుపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. 

దాదాపు రెండు నెలలుగా మావోయిస్టు పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూస్తే… ఈ లొంగుబాటుకు కారణాలు అర్ధమవుతాయి. గత నెలలో మావోయిస్టు పార్టీ ఆయుధాలు వదిలి బయటకు వచ్చే విషయంపైనా పెద్ద ఎత్తున లేఖల పర్వం కొనసాగింది. ముఖ్యంగా అభయ్ పేరుతో మల్లోజుల రాసిన లేఖలు పార్టీలో ప్రకంపణలు సృష్టించారు. 

మావోయిస్టు పార్టీ సైద్ధాంతికంగా తప్పులు చేసిందని.. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదని అందువల్లే ఇంతటి నిర్బంధం ఎదుర్కోవాల్సి వస్తుందని మల్లోజుల 21పేజీల లేఖను విడుదల చేశాడు. దీనికి రూపేష్ పేరుతో దండకారుణ్యం స్పెషల్ జోనల్ కమిటి హెడ్ ఆశన్న మద్దతు పలికాడు. అయితే మల్లోజుల రాసిన లేఖపై మావోయిస్టు పార్టీలోని మరో వర్గం తీవ్రంగా స్పందించింది. ఇటీవలే ఎన్కౌంటర్లో చనిపోయిన ఇద్దరు కేంద్రకమటీ సభ్యులు కట్ట రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణరెడ్డిలు సైతం దీనిని ఖండిస్తూ లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ తెలంగాణా విభాగం సైతం దీనిని వ్యతిరేకించింది.  పైగా మల్లోజుల పార్టీకి ద్రోహం చేస్తున్నాడని… అతను తన ఆయుధాలను వెంటనే పార్టీకి అప్పజెప్పాలని లేదంటే బలవంతంగా లాక్కుంటామని మావోయిస్టు పార్టీ హెచ్చరించింది.  దీంతో మావోయిస్టు పార్టీలో చీలిక తప్పదని తేలిపోయింది. దీనికి అనుగుణంగానే మావోయిస్టు పార్టీలో మల్లోజుల వర్గం వరుస లొంగుబాట్లకు తెరతీసింది. 

తెలుగు మావోయిస్టుల్లో విభేదాలు
మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మావోయిస్టు పార్టీలోని తెలుగు నక్సలైట్లలో వచ్చి విభేదాలే ఈ లొంగుబాటుకు కారణం అనే చర్చ వేగం పుంజుకుంది. ముఖ్యంగా ఈ ఏడాది మే నెలలో మావోయస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి బసవరాజు ఎన్కౌంటర్లో మృతి చెందిన తరువాత పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ప్రారంభం అయ్యాయని చెబుతున్నారు. మావోయిస్టు పార్టీ చీఫ్గా మల్లోజుల వేణుగోపాల్కు పగ్గాలు ఇవ్వకపోవడం పట్ల ఆయన వర్గం పార్టీతో విభేదించింది అనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ముప్పాళ్ల లక్ష్మణరావు తరువాత పార్టీ పగ్గాలు మల్లోజులకు ఇస్తారనే చర్చ జరిగింది. 

అయితే అప్పుడు నంబాళ కేశవరావు వైపే కేంద్రకమిటీ మొగ్గుచూపింది. ఇక నంబాళ అలియాస్ బసవరాజు తరువాతనైనా మల్లోజులను చీఫ్గా ఎన్నుకుంటారని భావించారు. అకస్మాత్తుగా తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ పేరు తెరమీదకు వచ్చింది. దీంతో మల్లోజుల వర్గం పూర్తిగా పార్టీ కేంద్రకమిటీలోని ఇతర నాయకత్వంతో విభేదాలు  పెంచుకుందనే చర్చ జరుగుతోంది. దీనివల్లే మల్లోజుల వర్గం ఆయుధాలు వీడాలనే నిర్ణయానికి వచ్చిందని పార్టీలోని ఓ వర్గం చెబుతోంది. ఇటీవలే పోలీసుల ముందు లొంగిపోయిన తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న సైతం మావోయిస్టు పార్టీకి ప్రస్తుతం ఎవరు ప్రధాన కార్యదర్శి లేరని ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. 

అసలు కేంద్రకమిటీ సమావేశమే జరగలేదని ఆశన్న స్పష్టం చేస్తున్నారు. దీనిని బట్టి చూస్తే తిప్పరి తిరుపతిని ప్రధాన కార్యదర్శిగా మల్లోజుల వర్గం అంగీకరించడం లేదని స్పష్టమవుతోంది. అయితే మల్లోజుల వేణుగోపాల్ను వ్యతిరేకించే వారిలో కేంద్రకమిటీకి చెందిన మల్లా రాజిరెడ్డి, తిప్పరి తిరుపతి, పాక హనుమంతుతో పాటు గోండి మావోయిస్టు నాయకుడు హిడ్మా పేర్లు వినిపిస్తున్నాయి. తెలంగాణా మావోయిస్టు పార్టీ చీఫ్గా ఉన్న దామోదర్ అలియాస్ జగన్ దీనిపై ఎలాంటి స్టాండ్ తీసుకున్నారనే విషయం ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. అయితే ఇప్పటికే మల్లోజుల లేఖను వ్యతిరేకించిన వారిలో దామోదర్ కూడా ఉండటంతో… మల్లోజులను సపోర్ట్ చేసే నాయకత్వం పెద్దగా మావోయిస్టు పార్టీలో మిగల్లేదని అర్ధమవుతోంది. 

లొంగుబాటలో మరికొంతమంది
భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద నక్సలైట్ లొంగుబాటుగా భద్రతా బలగాలు కీర్తిస్తున్న ఈ సరెండర్స్ ప్రభావం ఎలా ఉండబోతోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత నాలుగు రోజుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన దాదాపు 310మంది మావోయిస్టులు లొంగిపోయారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. లొంగిపోయిన వారిలో మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న పాటు చాలామంది దండకారుణ్యం స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్లు  ఉన్నారు. వీరిలో డీకేఎస్జెడ్సీ మెంబర్ భాస్కర్, టెక్నికల్ టీమ్లో పనిచేసిన సరోజ మరికొంత మంది కమాండర్లు ఉన్నారు. 

దాదాపు 20 వరకు ఏకే-47 తుపాకులు, 40వరకు ఆటోమెటిక్ వెపన్స్ మొత్తానికి 200 ఆయుధాలను మావోయిస్టులు లొంగుబాటు సమయంలో పోలీసులకు అప్పగించారు. అయితే మొత్తం మావోయిస్టు పార్టీ కేడర్లో ఇది ఎంత భాగం అనేది ఇప్పుడ పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయింది. కేంద్ర నిఘా వర్గాల లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా మావోయిస్టుల సంఖ్య వేయిలోపే ఉందని తెలుస్తోంది. అయితే వివిధ వర్గాల ద్వారా వస్తున్న సమాచారంతో పాటు లొంగిపోయిన మావోయిస్టులు చెబుతున్న లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీకి 2500మంది సాయుధ సైన్యం ఉన్నట్లు అంచనా. గణాంకాల పరంగా చూసుకుంటే ప్రస్తుతం లొంగిపోయిన వారి సంఖ్య మొత్తం సాయుధ మావోయిస్టులలో దాదాపు 15శాతంగా చెప్పుకోవచ్చు. దీంతో మిగిలిన మావోయిస్టుల సంగతేంటనే చర్చ జరుగుతోంది. ఒకవేళ మిగిలిన వారు కూడా ఇదే బాట పడితే దాదాపు వేయి మంది వరకు లొంగపోవచ్చని పోలీసులు అంచనా వేస్తన్నారు. 

వచ్చే వారంరోజుల్లో లొంగుబాట్లకు సంబంధించి స్పష్టమైన ముఖచిత్రం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దండకారుణ్యం స్పెషల్ జోనల్ కమిటీ దారిలోనే మావోయిస్టు పార్టీకి చెందిన ఉదంతి ఏరియా కమిటీ కూడా లొంగుబాటు వైపు మొగ్గు చూపింది. దీనికి అనుగుణంగా తమ మావోయిస్టు కామ్రెడ్లకు ఉదంతి ఏరియా కమిటి కార్యదర్శి సునీల్ లేఖ రాశారు. ఈ నెల 20వ తేదీన మద్యాహ్నం 12గంటల ముప్పై నిమిషాలకు ఎక్కడ కలువాలో కూడా తన లేఖలో సునీల్ స్పష్టం చేశారు. దీంతో పాటు తాము ఎక్కడ కలవాలో కూడా లేఖలో స్పష్టంగా మావోయిస్టులు పేర్కొన్నారు. దీనిని బట్టి ఒక విధంగా ప్రభుత్వం ఛత్తీస్ఘడ్లో కూంబింగ్ ఆపేసినట్లు సంకేతాలు వస్తున్నాయి. మావోయిస్టులు స్వేచ్ఛగా అడవి నుంచి లొంగుబాటు కోసం బయటకు వచ్చే విధంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే లొంగిపోయిన మావోయిస్టుల కోసం ప్రభుత్వం నది దాటేందుకు వీలుగా బోట్లు కూడా ఏర్పాటు చేసింది. మొత్తానికి ప్రభుత్వం ఇచ్చిన ఈ కాలపరిమితిలో మావోయిస్టులు లొంగిపోతారా… లేక మరో ఎత్తుగడతో వస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఆదివాసీలు ఎటువైపు…
మావోయిస్టు పార్టీకి ఇది సంధికాలం. ఓ వైపు లొంగుబాట్లు పెరుగుతుంటే ఆ పార్టీలో ఉన్న మిగిలిన నాయకత్వం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయడం లేదు. లొంగిపోతున్న వారిది తప్పని కాని… ఎవరూ ఈ ట్రాప్లో పడొద్దు అనే మాట కూడా మావోయిస్టు పార్టీ నాయకత్వం నుంచి రావడం లేదు. చాలామందిలో అసలు మావోయిస్టు పార్టీకి ఇంకా నాయకత్వం మిగిలి ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు పార్టీ కార్యదర్శి  తిప్పరి తిరుపతి పేరుతో ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు లొంగుబాటు అవుతున్న వారు స్వేఛ్చగా అడవి నుంచి వస్తున్న క్రమంలో మిగిలిన వారి పరిస్థితిపై ఆశన్న చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తిగా ఉన్నాయి. 

తమతో పాటు రావడానికి కొంతమంది నిరాకరించారని… వారికి కావాల్సిన సామాగ్రి ఇచ్చి జాగ్రత్తలు చెప్పి మరీ వారిని ఇతర దళాల కాంటాక్ట్లోకి పంపించామని ఆయన చెప్పారు. పార్టీ ఫండ్తో పాటు మిగిలిన ఆయుధాలను డంప్లను సాయుధ పోరాటం చేస్తున్న వారికే అప్పజెప్పామని ఆశన్న చత్తీస్ఘడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అంటే ఓ వర్గం ఇంకా దీనిని వ్యతిరేకిస్తోందననేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వర్గం ఎంత బలంగా ఉందనేదే ఇప్పుడు అసలు ప్రశ్న.  ఓ అంచనా ప్రకారం మావోయిస్టు పార్టీ గత రెండున్న దశాబ్దాలుగా బస్తర్లో జనతన సర్కార్ను నిర్వహిస్తోంది. 

అంటే ప్రభుత్వానికి సమాతంరంగా మరో ప్రభుత్వం లాంటింది అన్న మాట. ఒక తరం మొత్తం మావోయిస్టు పార్టీ పాలనలో ఎదిగిందనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు 10లక్షల మంది జనాభా మావోయిస్టు పార్టీ పాలన కింద ఉందనేది ఆ పార్టీ ప్రకటనల ద్వారా అర్ధమవుతున్న మాట. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇది 5లక్షల వరకు ఉండవచ్చనేది అంచనా. ఇందులో దాదాపు 25వేల మంది మిలిషియా సభ్యులుగా ఉన్నట్లు ఛత్తీస్ఘడ్ పోలీసులు అంచనా వేస్తున్నారు. వీరిలో ఎంతమంది ఇప్పుడు లొంగుబాటు వైపు నిలుస్తారు. మావోయిస్టు పార్టీ ఏకమొత్తంగా నిర్ణయం తీసుకుంటే తప్ప వీరు పూర్తిగా ప్రభుత్వానికి సహకరించే అవకాశం లేదు. రాబోయే కాలంలో వీరు ఏవిధంగా ప్రభుత్వ పాలన కిందికి వస్తారు. ఎంత వరకు కొత్త ప్రభుత్వంతో వీరికి సయోధ్య కుదురుతుంది. పాత కొత్తల ఘర్షణ వల్ల ఎలాంటి కొత్త సామాజిక ఆర్ధిక పరిస్థితులు ఉత్పన్నమవుతాయి అనే అనుమానాలు ఉన్నాయి. 

మేధావుల మౌనం…
మావోయిస్టు పార్టీ నిజంగానే తన పంథా మార్చుకుని జనజీవనంలోకి రావాలనే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఆపరేషన్ కగార్ తరువాత పిట్టల్లా రాలిపోతున్న మావోయిస్టులపై జనాల్లో సానుభూతి పెరుగుతోంది. ఎందుకు ఈ పోరాటం… ఎవరి కోసం ఈ ఆరాటం అనే భావన మావోయిస్టుల్లోనూ పెరిగిపోయింది. ముఖ్యంగా కేవలం తాము తయారు చేసుకున్న జనతన సర్కార్ తప్ప బయట ఎక్కడా తమ అవసరం లేదనే వాస్తవం వారికి అర్ధమవుతోంది. దేశవ్యాప్తంగా ప్రజల ఆలోచన సామాజిక, ఆర్ధిక పరిస్థితులు మారిని విషయాన్ని మావోయిస్టులు విస్మరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు మేధావి వర్గం కూడా మావోయిస్టులు లొంగిపోతే తప్పులేదని చెబుతోంది. చాలా వరకు మావోయిస్టులను సపోర్ట్ చేసిన తెలుగు మేధావులు అందుకే ఇప్పుడ మౌనం వహిస్తున్నారు. 

ఇక మావోయిస్టులు అడవిలోనే ఉండాలనే వారి సంఖ్య తగ్గిపోతోంది. ఇప్పుడు జరుగుతున్న లొంగుబాట్లపై కొందరు విమర్శలు చేస్తున్నా… 40ఏళ్లు పోరాటం చేసిన వారిని విమర్శించే నైతికత ఎంతమందికి ఉంటుంది. అడవిలో ఆదివాసీల కోసం పోరాడిన మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న, భాస్కర్లాంటి వారి కంటే ఎక్కువ సామాజిక స్పృహ ఎవరికి ఉంది. నమ్ముకున్న ఆదివాసీలను వదిలేసి రావడం ద్రోహం అనే వారు… ఎవరిని ప్రశ్నిస్తున్నారో ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాలని లొంగిపోయిన మావోయిస్టులు చెబుతున్నారు. గట్టుపై కూర్చోని సిద్ధాంతాలు చెప్పేవారు… అడవిలో గంజి తాగి పోరాటం చేసిన వారిపై రాళ్లు వేయడం ఎంత వరకు కరెక్టు అనే ప్రశ్నలు వస్తున్నాయి. అందుకే మావోయిస్టు పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఇప్పుడు అధికారికంగా మాట్లాడటానికి… మేధావులు సైతం వెనుకంజ వేస్తున్నారు. మొత్తానికి ఇది మావోయిస్టులు తేల్చుకోవాల్సిన వివాదం. ఆయుధాలు వదిలివేయాలా లేక సాయుధ పోరాటంలో కొనసాగాలా అనే విషయంలో లోకస్ స్టాండి కేవలం సాయుధ మావోయిస్టులకు మాత్రమే ఉంది. 

అంతమా… మరో ఆరంభమా…
మావోయిస్టుల లొంగుబాటు పూర్తయితే ఇక దేశంలో నక్సలిజం పూర్తిగా మాయమవుతుందా అనే చర్చ కూడా జరుగుతోంది. మావోయిస్టు పార్టీ పుట్టినిల్లు అయిన తెలంగాణా చరిత్రను కాస్త వెతికితే దీనికి సమాధానం దొరికే అవకాశం ఉంది. తెలంగాణా సాయుధ పోరాటం అందించిన నాయకత్వం… సైద్ధాంతిక భావజాలమే తరువాతి క్రమంలో తెలంగాణాలో నక్సల్ ఉద్యమానికి ఊపిరిలూదింది.  తొలి తెలంగాణా ఉద్యమంతో పాటు మలి దశ పోరాటానికి అదే పోరాట స్ఫూర్తిగా నిలిచింది. ఇప్పుడు లొంగిపోతున్న మావోయిస్టులు… తమ వెంట ఎన్నో సైద్ధాంతిక సూత్రీకరణలు, సామాజిక అనుభవాలతో అడవిని వీడి జనారణ్యంలోకి తీసుకువస్తారు. ఈ డిజిటల్ యుగంలో వారి అనుభవాలు, ఆలోచనలు అన్నీ ఇంటర్వ్యూల రూపంలో, పుస్తకాల మార్గంలో మళ్లీ ప్రజలను తాకే అవకాశం లేకపోలేదు. 

ఈ మొత్తం భావజాలాన్ని ఎవరు కంస్యూమ్ చేస్తారు. వందల వేల యూట్యూబ్ చానెల్స్లో వీరి ఇంటర్వ్యూలు.. రానున్నాయి. ఇందులో మంచి ఎంత చెడు ఎంత అని ఆలోచించే కన్నా… ఇదంతా తరువాతి తరాలకు ట్రాన్స్ఫర్ అవుతుందనేది సుస్పష్టం. సాయుధ పోరాట భావజాలం మరో రూపంలో… మరో తరానికి బదిలీ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. రెండు రోజుల క్రితం లొంగిపోయిన మావోయిస్టు నేత భాస్కర్ తన ఇంటర్వ్యూలో మా అనుభవాలు, పోరాటాలు రాబోయే తరాలకు చెప్పాలన్నా మేము బతకాలి కదా అని అన్నారు. మావోయిస్టు పార్టీ గత నాలుగు దశాబ్దాల్లో చేసిన పోరాటం ఇప్పటికే చాలా వరకు పుస్తకాల్లో రికార్డు అయింది. అయితే ఛత్తీస్ఘడ్ పోరాటాలు మాత్రం అడవిని వదలి వస్తున్న మల్లోజుల, ఆశన్న, బాస్కర్, సరోజలాంటి వారు చెబితేనే తెలుస్తాయి. అందుకే ఇప్పుడు వీరంతా ఏంచేస్తారు. ప్రజా పోరాటాలను నిర్మిస్తారా. రాజకీయాల్లోకి వస్తారా. లేక పుస్తకాలు రాస్తారా అనే చర్చ జరుగుతోంది. వీరు చేయబోయే పనులే … మావోయిస్టు పార్టీ భావజాలం ఎలా ఉండబోతుందనే విషయాన్ని నిర్దేశించబోతోంది. అయితే ఇదంతా భవిష్యత్తు… దీనిని ఎవరూ నిర్దేశించలేరు. 

చివరి మాట… 
లొంగుబాటు విషయంలో ఎవరెన్ని మాటలన్నా… మావోయిస్టు పార్టీ నాయకత్వం ప్రకటన వస్తేనే దీనిపై క్లారిటీ రానుంది. అయితే మావోయిస్టు పార్టీ గురించి ప్రతీ ఒక్కరు ఆతృతగా చూస్తున్న మరో అంశం మావోయిస్టు పార్టీ కీలక నేత గణపతి ఎక్కడున్నారు అనేది. గణపతి బతికే ఉన్నారా ఉంటే ఆయనెందుకు స్పందించడం లేదు. ఆయనకు అల్జీమర్స్ వచ్చిందనే చర్చ కూడా జరుగుతుంది. ఒకవేళ గణపతి బతికి ఉంటే… ఆయన ప్రకటన చేస్తే ఈ కన్ఫ్యూజన్ పూర్తిగా క్లియర్ అయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు మావోయిస్టులు అడవిని వీడుతున్నారు. మేము లొంగిపోవడం లేదు కేవలం ఆయుధాలను ప్రజల ముందు ప్రభుత్వాల ముందు వదిలేస్తున్నాం అని చెబుతున్నారు. ఏది ఏమైనా ఆయుధం ఇప్పుడు అడవిని వీడింది. ఈ ప్రయాణం చీకటి దారుల్లోకా లేక వెలుగు రేఖల వైపా అనేది కాలమే నిర్ణయిస్తుంది. 
- ఇస్మాయిల్‌, సాక్షి టీవీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement