యువతకు ఆచరణాత్మక వ్యవసాయ శిక్షణ | sagubadi: Practical agricultural training for youth | Sakshi
Sakshi News home page

యువతకు ఆచరణాత్మక వ్యవసాయ శిక్షణ

Oct 7 2025 4:43 AM | Updated on Oct 7 2025 4:43 AM

sagubadi: Practical agricultural training for youth

సమీకృత ప్రకృతి వ్యవసాయాన్ని పూర్తి స్థాయి వృత్తిగా చేపట్టాలని భావించే యువతకు సరైన సమాచారంతో పాటు కొద్ది నెలల పాటు ఆచరణాత్మక శిక్షణ కూడా అవసరం. అటువంటి యువతకు ఆచరణాత్మక ప్రకృతి వ్యవసాయ జ్ఞానం అందించడానికి తెలంగాణలో రెండు సంస్థలు ఈ నెలలోనే ప్రత్యేక శిక్షణా శిబిరాలను ప్రారంభించనున్నాయి.

సేంద్రియ పశుపోషణ, సమీకృత సేంద్రియ వ్యవసాయంలో 15 ఏళ్ల అనుభవం గల అక్షయకల్ప సంస్థ 3 నెలల ఉచిత ఫెలోషిప్‌ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనుంది. యువకులను రైతు పారిశ్రామికవేత్తలుగా లేదా రైతు విస్తరణ నిపుణులుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా 19–27 ఏళ్ల మధ్య వయస్కులకు రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం ఈదులపల్లిలోని అక్షయకల్ప రీజనరేటివ్‌ వ్యవసాయ పరిశోధన–అభివృద్ధి కేంద్రంలో 3 నెలల రెసిడెన్షియల్‌ శిక్షణ ఇస్తారు. భోజన వసతులతో పాటు స్టైపెండ్‌ కూడా ఇస్తారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 2,300 మంది ప్రకృతి/సేంద్రియ రైతులకు శిక్షణ ఇచ్చి, నెలకు రూ. 1.2 లక్షలకు పైగా సంపాదించేలా ప్రాక్టికల్‌గా మార్గదర్శనం చేశామని అక్షయకల్ప ప్రతినిధి డాక్టర్‌ తేజేశ్వర్‌ రెడ్డి తెలిపారు. 30 మందితో త్వరలో ఒక బ్యాచ్‌ను ప్రారంభించనున్నామన్నారు. ఇతర వివరాలకు.. 89043 96761, 91132 03476.

చౌహన్‌ క్యు సేద్యంపై 12 నెలల శిక్షణ
దక్షిణ కొరియాకు చెందిన డా. చౌహన్‌ క్యు ప్రకృతి వ్యవసాయ పద్ధతిపై న్యూ లైఫ్‌ ఫౌండేషన్‌(హైదరాబాద్‌) 12 నెలల పాటు యువతకు ఉచిత ఆచరణాత్మక శిక్షణ ఇవ్వనుంది. శాశ్వత ఎత్తుమడులపై ఉద్యాన పంటలను సాగు చేస్తూ అత్యంత తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించటం ఎలాగో నేర్పిస్తామని ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు శివ సిందే తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌ సమీపంలోని క్షేత్రంలో ఉచిత భోజన వసతులతో 12 నెలల పాటు శిక్షణ ఇస్తామని, పూర్తి చేసిన వారికి ధ్రువపత్రం ఇస్తామని అన్నారు. వ్యవసాయ డిప్లొమా విద్యార్థులకు స్టైపెండ్‌ ఇస్తామన్నారు.
కనీస చదువు: 10 తరగతి. కనీస వయసు: 18 ఏళ్లు. 
ఇతర వివరాలకు.. 98660 73174.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement