
భారతదేశంలో 2026లో జీతాలు 9 శాతం పెరుగుతాయని, Aon యాన్యువల్ శాలరీ ఇంక్రీజ్ అండ్ టర్నోవర్ సర్వే ద్వారా వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించినప్పటికీ, 2025లో నమోదైన 8.9 శాతం జీతాల వృద్ధి కంటే.. ఈ అంచనా స్వల్ప పెరుగుదలను సూచిస్తుంది.
రియల్ ఎస్టేట్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFC) వరుసగా 10.9 శాతం, 10 శాతం చొప్పున అత్యధిక జీతాల పెరుగుదలను ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఎగుమతులు తగ్గడం, ఏఐ (కృత్రిమ మేధస్సు) ప్రభావం కారణంగా టెక్నాలజీ కన్సల్టింగ్ రంగాలు మాత్రం 6.5 శాతానికి పరిమితం చేయనున్నాయి. 2025 ఐటీ కంపెనీలు 7 శాతం జీతాల పెరుగుదలను ప్రకటించాయి.
టాప్/సీనియర్ & మిడిల్ మేనేజ్‌మెంట్ జీతాల వృద్ధి వరుసగా 8.5 శాతం, 8.9 శాతం వద్ద ఉంటాయి. అయితే.. జూనియర్ మేనేజ్‌మెంట్ జీతాలు మాత్రం 9.5 శాతానికి (2025లో 9.3 శాతం పెరుగుదల) చేరే అవకాశం ఉంది. పోటీ మార్కెట్‌లో యువ ప్రతిభను ఆకర్షించడంలో భాగంగానే ఈ కొంత జీతాల పెంపు చేయనున్నట్లు సమాచారం. కాగా ఈ ఏడాది ఉద్యోగ విరమణ 17.1 శాతంగా ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది.
1060 కంపెనీల నుంచి సేకరించిన డేటా
ఈ నివేదికను.. 45 పరిశ్రమలలోని 1,060 కంటే ఎక్కువ కంపెనీల నుంచి డేటా ఆధారంగా రూపొందించారు. ఇందులో సుమారు 43 శాతం కంపెనీలు FY26కి వార్షిక ఆదాయ వృద్ధిని 10 శాతం కంటే ఎక్కువ అంచనా వేయగా.. 27 శాతం మంది 5–10 శాతం వృద్ధిని ఆశిస్తున్నారు. మరో 12 శాతం మంది ఎటువంటి ప్రభావం లేదని అంచనా వేస్తున్నారు. 14 శాతం మంది 0–5 శాతం వృద్ధిని చూస్తున్నారు. 4 శాతం మంది మాత్రం ప్రతికూల వృద్ధిని అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: కోటీశ్వరున్ని చేసిన 30 ఏళ్ల క్రితం పేపర్లు