నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన.. ఇండియా రియల్ ఎస్టేట్: ఆఫీస్ అండ్ రెసిడెన్షియల్ మార్కెట్.. జూలై నుంచి డిసెంబర్ 2025 వరకు మొత్తం అమ్మకాలు స్థిరంగా ఉన్నాయని వెల్లడించింది. దేశంలోని టాప్ ఎనిమిది నగరాల్లో మొత్తం 3.48 లక్షల ఇళ్ల అమ్మకాలు జరగడం ద్వారా.. మార్కెట్ బలాన్ని నిలుపుకున్నప్పటికీ, గత సంవత్సరంతో పోలిస్తే కేవలం 1 శాతం స్వల్ప తగ్గుదల మాత్రమే నమోదైందని స్పష్టం చేసింది.
నగరాల వారీగా చూస్తే, ముంబై దేశంలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ మార్కెట్‌గా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. 2025లో ముంబైలో సుమారు 97 వేల ఇళ్లు అమ్ముడయ్యాయి. భూమి లభ్యత పరిమితంగా ఉన్నప్పటికీ, ధరలు పెరుగుతున్నా కూడా ఇక్కడ డిమాండ్ నిలకడగా కొనసాగింది. మరోవైపు, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లో అమ్మకాలు 9 శాతం తగ్గినప్పటికీ, ఇళ్ల ధరలు ఏకంగా 19 శాతం పెరిగాయి.
బెంగళూరు మార్కెట్ స్థిరంగా కొనసాగుతూ, ఎండ్-యూజర్ డిమాండ్ ఆధారంగా అమ్మకాలను నిలబెట్టుకుంది. చెన్నై & హైదరాబాద్ నగరాలు 2025లో గణనీయమైన వృద్ధిని చూపాయి. ముఖ్యంగా చెన్నైలో 12 శాతం అమ్మకాల వృద్ధి నమోదు కావడం గమనార్హం. హైదరాబాద్‌లో కూడా ధరలు & అమ్మకాలు రెండింటిలోనూ పెరుగుదల కనిపించింది.
ధరల విషయానికి వస్తే.. 2025లో అన్ని ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు పెరిగాయి. ముఖ్యంగా కోటి రూపాయల కంటే ఎక్కువ ఖరీదైన ఇళ్ల అమ్మకాలు.. మొత్తం మార్కెట్‌లో సగం వాటాను దక్కించుకున్నాయి. కాగా 50 లక్షల రూపాయల ఖరీదైన ఇళ్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి.


