
బంగారం కంటే ఖరీదైన భూములు
సామాన్యుడి సొంతింటి కల మరింత దూరం
అపార్ట్‌మెంట్ల ధరలు పెరిగే అవకాశం
సాక్షి, సిటీబ్యూరో: ఎకరం రూ.177 కోట్లు.. దుర్గం చెరువు పక్కనే ఉన్న కొండపై ఉన్న భూమి ధర ఇదీ. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని భూముల వేలం దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. గత ప్రభుత్వం హయాంలో కోకాపేటలోని నియోపొలిస్ వేలంలో ఎకరా రూ.100.75 కోట్లు పలికిన ధరే అందర్నీ షాక్‌కు గురి చేయగా.. సోమవారం టీజీఐసీసీ నిర్వహించిన రాయదుర్గం భూముల వేలం సరికొత్త రికార్డులను సృష్టించింది. పశ్చిమ హైదరాబాద్‌లోని బహుళ అంతస్తుల భవనాలే కాదు.. అక్కడి భూముల ధరలూ ఆకాశాన్నంటుతున్నాయని రియల్టీ రంగ నిపుణులు చెబుతున్నారు.
రాష్ట్ర రాజధానిలో భూమి బంగారం కంటే ఖరీదైపోయింది. కొండలే కోట్లకు కోట్లు ధర పలుకుతున్నాయి. తాజాగా రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనాసంస్థ (టీజీఐఐసీ) నాలెడ్జ్ సిటీలోని సర్వే నంబరు 83/1 ప్లాట్ నంబరు–19లో 11 ఎకరాలు, ఇదే సర్వే నంబరులో ప్లాట్ నంబరు–15ఏ/2లో 7.67 ఎకరాలు మొత్తం 18.67 ఎకరాలను వేలం వేసిన సంగతి తెలిసిందే. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.3,135 కోట్ల ఆదాయం సమకూరింది. స్థానిక బిల్డర్లతో పాటు జాతీయ నిర్మాణ సంస్థలు పోటీపడి మరీ ధర రికార్డు స్థాయిని దాటేలా చేశారు. ఈ పరిణామాలు మార్కెట్లో సంచలనంగా మారాయి. హైదరాబాద్ మార్కెట్‌కు ఇంకా భవిష్యత్తు ఉందని, డిమాండ్ తగ్గలేదని మార్కెట్ పడిపోలేదు అనడానికి ఈ వేలమే నిదర్శనమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సొంతింటి కల దూరమేనా..?
భూముల వేలంలో వేలంవెర్రిగా ధర పలకడం స్థానిక రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ ధరల ప్రభావం చుట్టుపక్కల భూములు, అపార్ట్‌మెంట్లపై ఉంటుంది. దీంతో హైదరాబాద్‌కు ఉన్న అఫర్డబులిటీ దూరం అయ్యే ప్రమాదం ఉంటుంది. హైదరాబాద్ అనగానే సరసమైన ఇళ్లకు కేంద్రమని స్థిరాస్తి సంఘాలు ఎంతోకాలంగా చెబు తూ వస్తున్నాయి. వేలంలో రికార్డ్ ధరలు పలుకుతుండటంతో భూముల రేట్లు పెరుగుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతంలోని అపార్ట్‌మెంట్ల ధరలు పెరగక తప్పని పరిస్థితి. సామాన్యుడికి ఇంటి కల దూరమవుతోందని ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో.. ఎకరం భూమి రూ.177 కోట్లు పలకడంతో సంపన్నులు కూడా కొనలేని పరిస్థితి ఏర్పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎందుకింత ధర?
రాయదుర్గం నాలెడ్జ్ సిటీ లేఅవుట్‌ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసింది. ఐటీ కారిడార్‌లో ఉండటంతో గృహ నిర్మాణం, కార్యాలయాలకు అనువుగా ఉంది. భవనం ఎత్తుపై ఆంక్షలు లేకుండా అపరిమిత ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్‌ఎస్‌ఐ)కు అవకాశం ఉండటంతో బిల్డర్లు ధరకు వెనకాడలేదు. వీటి దృష్ట్యా వేలంలో కొన్ని సంస్థలు పోటీపడ్డాయి. 470 ఎకరాల్లో విస్తరించి ఉన్న నాలెడ్జ్ సిటీలో వందకు పైగా ఐటీ, ఐటీఈఎస్
కంపెనీలున్నాయి.
బహుళ జాతి సంస్థల కార్యాలయాలు, ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు, వినోద కేంద్రాలు, బహుళ అంతస్తుల భవనాలు, అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో రాయదుర్గం అభివృద్ధి చెందిన ప్రాంతం కావడంతో ఇక్కడి భూములకు డిమాండ్ అధికంగా ఉంది. ఇక్కడి నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు, మెట్రో, విమానాశ్రయాలతో నగరం నలువైపులా సులువైన కనెక్టివిటీ ఉంది. రాయదుర్గం మెట్రో స్టేషన్‌కు 5 నిమిషాలు, ఔటర్ జంక్షన్‌కు 6 నిమిషాలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్/విప్రో జంక్షన్‌కు, హెచ్‌ఐసీసీ/హైటెక్స్‌కు 15 నిమిషాలు, ఎయిర్‌పోర్ట్‌కు 40 నిమిషాలు ప్రయాణ వ్యవధి ఉంటుంది. దీంతో ఇక్కడి భూములకు డిమాండ్ అధికంగా ఉంది.