
మానవీయ స్పర్శ లేశమాత్రం లేని మానవాకార మృగాలు రోజుల తరబడి సృష్టించిన బీభత్సం పర్యవసానంగా అయినవారినీ, ఆవాసాలనూ మాత్రమే కాదు... జీవిక కోల్పోయి చెట్టుకొకరు పుట్టకొకరై 28 నెలల నుంచి అనాథలుగా బతుకీడుస్తున్న మణిపూర్ పౌరులకు ఆలస్యంగానైనా సాంత్వన లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తొలుత చురాచాంద్‌పూర్ బహిరంగ సభలో బాధితులనుద్దేశించి మాట్లాడాక, రాజధాని ఇంఫాల్‌లో ఉన్న కాంగ్లా ఫోర్ట్ వద్ద జరిగిన సభలో పాల్గొన్నారు.
సాధారణ పరిస్థితుల్ని పునరుద్ధరించటానికి చేయాల్సిందంతా చేస్తామని ఆయన హామీ ఇవ్వటంతో పాటు వేలాది కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్ని ప్రారంభించటం, మరికొన్నిటికి శంకుస్థాపన చేయటం హర్షించదగ్గవి. ఇవన్నీ రాగల కాలంలో సామరస్య వాతావరణానికి దోహదపడే అవకాశం ఉన్న మాట నిజమే అయినా, చేయాల్సింది ఇంకా చాలా ఉంది.
మెజారిటీగా ఉన్న మెయితీలకూ, కుకీ–జో తెగలకూ మధ్య తలెత్తిన ఘర్షణల పర్యవసానంగా మొత్తం 260 మంది ప్రాణాలు కోల్పోగా, 60,000 మంది నిరాశ్రయులయ్యారు. ఆ తెగల మధ్య పరస్పర అవిశ్వాసం, ఘర్షణలు ఈనాటివి కాదు. వీటిని చక్కదిద్దటానికి ఏ ప్రభుత్వమూ పెద్దగా ప్రయత్నించింది లేదు.
బీరేన్‌సింగ్ నేతృత్వంలోని బీజేపీ కూటమి ప్రభుత్వమైతే మెయితీల అనుకూలమన్న ముద్ర పడేలా వ్యవహరించి ఆ ఘర్షణ వాతావరణాన్ని పెంచింది. 2023 మే 3 మొదలుకొని సాగిన దారుణాలు సిగ్గు చేటైనవి. రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న మెయితీలకూ, కుకీ–జో తెగలకూ తలెత్తిన ఘర్షణల్లో మహిళలపై గుంపులు దాడిచేసి వారిని వివస్త్రలను చేయటం, నగ్నంగా ఊరేగించి అత్యాచారాలకు తెగబడటం వంటివి చోటుచేసుకున్నాయి.
చురాచాంద్‌పూర్‌లో కుకీ–జో తెగలవారికి సహాయక శిబిరాలు నెలకొల్పగా, మెయితీ బాధితులు ఇంఫాల్ రక్షణ శిబిరాల్లో ఉంటున్నారు. దురదృష్టమేమంటే కుకీ–జో తెగలవారు ఇంఫాల్‌లో అడుగుపెట్టలేరు. మెయితీలు కొండప్రాంత జిల్లాలకు పోలేరు. ఇదంతా ఇప్పట్లో చక్కబడే అవకాశం లేదు. కుకీ–జో తెగల మండలి ప్రధానికి సమర్పించిన వినతిపత్రంలో తమకు ప్రత్యేక పాలనాధికార వ్యవస్థ కావాలని కోరింది.
అటు మెయితీలకు ప్రాతినిధ్యం వహించే మణిపూర్ సమగ్రతా సమన్వయ కమిటీ (కొకొమీ) అందుకు ససేమిరా అంటున్నది. ఆ వ్యవస్థ ఏర్పాటైతే రాష్ట్ర ప్రతిపత్తి దెబ్బతింటుందనీ, పౌరసత్వాన్ని తెగల వారీగా గుర్తించి, రాష్ట్రాన్ని విభజించినట్టవుతుందనీ దాని వాదన. ‘చట్ట విరుద్ధ’ వలసలను అరికట్టాలని డిమాండ్ చేస్తోంది. పైగా మెయితీలు ఏనాటి నుంచో ఎస్టీ ప్రతిపత్తి కోరుతున్నారు. ఇదే జరిగితే భూహక్కులు కోల్పోతామని కుకీ–జో తెగల భయం. ఈ వాదనలూ, భయాందోళనలూ వర్తమాన సంక్లిష్టతకు అద్దం పడతాయి.
రాష్ట్రాన్ని ఆవరించిన కల్లోలం ‘మన పూర్వీకుల స్మృతికి కళంకం మాత్రమే కాదు... భవిష్యత్ తరాలకు అన్యాయం చేయటం కూడా’ అని మోదీ సరిగానే అన్నారు. దీన్ని చక్కదిద్దటానికి ఇంఫాల్ లోయకూ, కొండ ప్రాంత జిల్లాలకూ మధ్య పటిష్ఠమైన వారధులు నిర్మించాల్సి ఉందన్న ఆయన అభిప్రాయం కూడా సబబైనదే. ఇది జరగాలంటే వైషమ్యాలను పెంచి పోషిస్తున్న వారిపట్ల కఠినంగా వ్యవహరించాలి.
వదంతుల వ్యాప్తిని సహించకూడదు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలను ప్రచారంలో పెట్టడంతోనే సమస్య మొదలైందనీ, ప్రధాన స్రవంతి మీడియా ‘మెయితీ మీడియా’గా మారి వీటిని పెంచిపోషిందనీ ఎడిటర్స్ గిల్డ్ నిజనిర్ధారణ కమిటీ గతంలో ఆరోపించింది. ఇందుకు నాటి మణిపూర్ ప్రభుత్వం ఆగ్రహించి కేసులు కూడా పెట్టింది.
మణిపూర్ తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో మయన్మార్‌తో 352 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. నిరవధిక ఉద్రిక్త వాతావరణం ఎంతమాత్రమూ మంచిది కాదు. బీరేన్‌సింగ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయటంతో సహా చాలా విషయాల్లో ఎంతో జాప్యం జరిగింది. ఇప్పటికైనా నిర్దిష్ట కాల వ్యవధిలో అమలయ్యేలా చర్యలుండాలి. అభివృద్ధి జరిగేలా, ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా, జన జీవనం మళ్లీ పట్టాలెక్కేలా చూడాలి. ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారన్న అపవాదు కలగని రీతిలో పాలనను చక్కదిద్దాలి.