
బిష్ణుపూర్: మణిపూర్‌లో బిష్ణుపూర్ జిల్లాలో అస్సాం రైఫిల్స్ కాన్వాయ్‌పై దుండగులు మెరుపు దాడి చేశారు. కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందగా.. నలుగురు గాయపడ్డారు. రాజధాని ఇంఫాల్ శివారులో ఇవాళ (శుక్రవారం) సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇంఫాల్ ఎయిర్ పోర్టు నుంచి 8 కి.మీ దూరంలో ఉనన నంబోల్ సబల్ లైకై ప్రాంతంలో, ఇంఫాల్ నుంచి బిష్ణుపూర్ ప్రయాణిస్తున్న పారామిలిటరీ దళాల వాహనంపై గుర్తు తెలియని ముష్కరులు కాల్పులు జరిపినట్లు సైన్యం కూడా ధ్రువీకరించింది.
ఇంఫాల్ నుంచి బిష్ణుపూర్ వైపు 33 మంది అస్సాం రైఫిల్స్ సిబ్బందితో వెళ్తున్న వాహనం లక్ష్యంగా దాడి జరిగింది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మణిపూర్ గవర్నర్ అజయ్ భల్లా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. విధి నిర్వహణలో మరణించిన సైనిక కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. ఈ ఘటనలో గాయపడ్డవారు వెంటనే కోలుకోవాలని ప్రార్థించారు. ఇలాంటి హింసాత్మక ఘటనల్ని సహించబోమని ఆయన అన్నారు.
మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ ఈ దాడిని ఇది రాష్ట్రానికి తగిలిన క్రూరమైన దెబ్బగా అభివర్ణించారు. ఘటన సమయంలో కాన్వాయ్‌లో మొత్తం 33 మంది సిబ్బంది ఉన్నారు. ఇద్దరు జవాన్లను కోల్పోవడం దారుణమంటూ ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. "మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వారి ధైర్యం మరియు త్యాగం మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటాయి’’ అని సింగ్ పేర్కొన్నారు.