బోండీ బీచ్‌ హీరోకు సర్వత్రా ప్రశంసలు : భారీగా విరాళాలు | Bondi Beach hero bystander draws near USD 2 million in donations | Sakshi
Sakshi News home page

బోండీ బీచ్‌ హీరోకు సర్వత్రా ప్రశంసలు : భారీగా విరాళాలు

Dec 16 2025 10:53 AM | Updated on Dec 16 2025 11:14 AM

Bondi Beach hero bystander draws near USD 2 million in donations

ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండీ బీచ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో  అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించిన అహ్మద్ అల్ అహ్మద్  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.  ప్రాణాలను పణంగా పెట్టిమరీ  దుండగులను నిలువరించిన అహ్మద్‌కు  నాలుగు నుండి ఐదు తుపాకీ గాయాలు అయ్యాయి.  చాలా రక్తం పోవడంతో   పలు మార్లు ఆపరేషన్లు చేయాల్సి ఉందని  అక్కడి అధికారులు వెల్లడించారు. అలాగే ఎడమ భుజం బ్లేడ్ వెనుక భాగంలో ఒక బుల్లెట్‌ను ఇంకా తీయలేదు. ఈగాయం కారణంగా అతని ఎడమ చేయిని తీసివేయాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అతని పరిస్థితి ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు అహ్మద్‌ చూపించిన తెగువ, దైర్యం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలందుకుంటోంది. ముఖ్యంగా సిడ్నీలోని ఒక ఆసుపత్రిలో అహ్మద్‌ను ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ పరామర్శించారు. నిజమైన  నేషనల్‌  హీరో అంటూ కొనియాడారు. ఆస్ట్రేలియన్లకు ప్రేరణ  అంటూ అభివర్ణించారు. కాల్పుల తర్వాత వెంటనే బాధితులకు చికిత్స చేయడంలో సహాయం చేసిన అహ్మద్,ఇతరును ఆస్ట్రేలియా ప్రధాని ప్రశంసించారు. 

 అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, హెడ్జ్ ఫండ్ బిలియనీర్ బిల్ అక్మాన్ అహ్మద్‌ ధైర్య సాహసాలను కొనియాడారు. పెర్షింగ్ స్క్వేర్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ వ్యవస్థాపకుడు అక్మాన్ అహ్మద్‌ను డేరింగ్‌  హీరో అంటూ ప్రశంసించారు. కుటుంబానికి మద్దతుగా హెడ్జ్ ఫండ్ సంస్థ  ఏర్పాటు చేసిన నిధుల సేకరణకు భారీ స్పందన లభిస్తోంది. గోఫండ్‌మీ పేజీ విరాళాలు  2 మిలియన్ల డాలర్ల (రూ. 18.15కోట్లు)కు సమీపంలో ఉండటం విశేషం. దాదానె 33వేల మంది విరాళాలందించారు. అంతేకాదు అత్యధిక విరాళం (99,999 డాలర్లు) ఇచ్చిన వ్యక్తిగా విలియం అక్మాన్‌ నిలవడం విశేషం.  

సిరియాలో జన్మించిన అహ్మద్, 15 మందిని బలిగొన్న ఈ మారణహోమం సమయంలో కాల్పులకు గురైన వారిలో ఒకరిపైకి దూకి, అతని చేతుల నుండి తుపాకీని లాక్కున్నాడు. ఈ సంఘటన యొక్క అసాధారణ దృశ్యాలు వైరల్ అయ్యాయి. సిడ్నీలోని బోన్డీ బీచ్‌లో జరిగిన హనుకా కార్యక్రమంలో యూదు సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపిన దుండగులు తండ్రీ కొడుకులేనని ఆస్ట్రేలియా అధికారులు ధృవీకరించారు. ఆస్ట్రేలియా చరిత్రలో అత్యంత దారుణమైన ఉగ్రవాద దాడి అయిన ఈ మారణహోమంలో15 మంది మరణించారు. కాల్పులకు పాల్పడిన ఇద్దరిలో 50 ఏళ్ల తండ్రి ఎదురుకాల్పుల్లో మరణించారు. 24 ఏళ్ల కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో హీరోగా నిలిచిన 43 ఏళ్ల  అహ్మద్‌ను దక్షిణ సిడ్నీకి చెందినవాడిగా గుర్తించారు. ఇద్దరు పిల్లల తండ్రి అయిన అహ్మద్‌ 2006లో సిరియా నుండి ఆస్ట్రేలియాకు వచ్చాడు. ఆస్ట్రేలియన్ పౌరసత్వం ఉన్న అతను చిన్న షాపు నడుపుకుంటూ  జీవనం సాగిస్తున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement