ఒక దేశంలో అధిక ఇళ్లు ఉండి.. కొనుగోలుదారులు లేక సంక్షోభంలో కూరుకుపోతుంటే, మరో దేశంలో కోట్లాదిమందికి సొంతింటి కల కలగానే మిగిలిపోతోంది. చైనాలో దాదాపు 90 శాతం మంది ప్రజలకు సొంత ఇళ్లు ఉన్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. భారతదేశంలో మాత్రం 31 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలకు ఇంకా సొంత గూడు లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. మన దేశ గృహనిర్మాణ రంగాన్ని, దాని చుట్టూ అల్లుకున్న సవాళ్లకు ఇది అద్ద పడుతుంది. అసలు చైనాలో ఇంత అధిక సంఖ్యలో ప్రజలకు సొంతిల్లు ఉండటానికి కారణాలేమిటి? అదే సమయంలో భారత్‌లో సొంతింటి కల ఎందుకు సాకారం కావడం లేదో కారణాలను పరిశీలిద్దాం.
చైనాలో సొంతిల్లు ఉండటానికి కారణాలు
గత ప్రభుత్వ విధానాలు, మార్కెట్ సంస్కరణలు
1998కు ముందు చైనాలో పట్టణ గృహనిర్మాణ రంగం దాదాపు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉండేది. 1998లో ప్రభుత్వం గృహనిర్మాణ సంస్కరణలను చేపట్టి ప్రజలు ఇళ్లను సొంతం చేసుకోవడానికి అనుమతించింది. అంతకుముందు ఉన్న ఇళ్లను అతి తక్కువ ధరలకు ఇతరులకు విక్రయించారు. దాంతో పెద్దమొత్తంలో సొంతింటి కల నెరవేరింది.
సంపద పోగుచేసుకోవడంలో..
చైనాలో ప్రజలు సంపదను పోగుచేయడానికి ఇళ్లను అత్యంత సురక్షితమైన, ప్రధాన సాధనంగా భావిస్తారు. విదేశీ పెట్టుబడులకు ఇతర మార్గాలు పరిమితంగా ఉన్నప్పుడు స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టడం ఒక సాంప్రదాయక పద్ధతిగా మారింది. ఇది ఇళ్ల కొనుగోలుకు ఉన్న డిమాండ్‌ను భారీగా పెంచింది.
పట్టణీకరణ
వేగవంతమైన పట్టణీకరణ కారణంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు నగరాలకు తరలివచ్చారు. పెరిగిన డిమాండ్‌ను తీర్చడానికి స్థానిక ప్రభుత్వాలు భూమిని స్థిరాస్తి డెవలపర్‌లకు విక్రయించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకున్నాయి. డెవలపర్‌లు భారీ స్థాయిలో గృహ నిర్మాణాలను చేపట్టారు. కొన్ని సందర్భాల్లో ఇది జనాభా అవసరాల కంటే అధిక సంఖ్యలో ఇళ్లను నిర్మించడానికి దారితీసింది. ఫలితంగా పట్టణ ప్రాంతాల్లో అధిక గృహ లభ్యత ఏర్పడింది.
Breaking
🇨🇳90% of people in China now own their own homes.
Most Homeless People (2025)
🇮🇳 India – 3.1M+
🇺🇸 United States – 580K+
🇳🇬 Nigeria – 500K+
🇷🇺 Russia – 440K+
🇵🇭 Philippines – 420K+
🇧🇷 Brazil – 390K+
🇮🇩 Indonesia – 380K+
🇲🇽 Mexico – 320K+
🇿🇦 South Africa – 280K+
🇫🇷… pic.twitter.com/ZykA0EBKMX— World updates (@itswpceo) October 22, 2025
భారత్‌లో ఇలా..
స్థిరాస్తి ధరలు అధికం, ఆదాయాలు తక్కువ
పట్టణ ప్రాంతాల్లో భూమి, నిర్మాణ వ్యయాలు విపరీతంగా పెరగడం వల్ల ఇళ్ల ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. ఈ ధరలు సామాన్య, మధ్యతరగతి ప్రజల ఆదాయ వృద్ధి రేటు కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మెట్రో సిటీలు, టైర్-1 నగరాల్లో ఇది ప్రధాన సమస్య.
బ్యాంక్ రుణాలు, ఫైనాన్సింగ్ సవాళ్లు
గృహ రుణాలు అందుబాటులో ఉన్నప్పటికీ రుణం కోసం అవసరమయ్యే భారీ డౌన్ పేమెంట్‌ను చెల్లించలేని పరిస్థితులున్నాయి. తక్కువ ఆదాయ వర్గాల వారికి బ్యాంకు రుణాలు పొందడంలో కఠినమైన షరతులు, క్రెడిట్ హిస్టరీ లేకపోవడం అడ్డంకులుగా మారుతున్నాయి.
భూమి కొరత, భూ సేకరణ సమస్యలు
పెరుగుతున్న జనాభాకు సరిపడా భూమి లభ్యత లేదు. పట్టణ ప్రాంతాల్లో భూమి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇది గృహనిర్మాణ ప్రాజెక్టుల వ్యయాన్ని పెంచుతున్నాయి. భూసేకరణ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. దీనికి సంబంధించిన వివాదాలు కూడా ప్రాజెక్టుల ఆలస్యానికి, ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి.
సామాజిక కారణాలు
పట్టణ వలస, మురికివాడలు
మెరుగైన ఉపాధి అవకాశాల కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి లక్షలాది మంది నిరంతరం నగరాలకు వలస వస్తున్నారు. ఈ వలసలకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో గృహ లభ్యత, మౌలిక వసతులు లేకపోవడం వల్ల మురికివాడలు (స్లమ్స్) ఏర్పడుతున్నాయి. ఈ వర్గాలకు సొంతింటి కల సుదూరంగానే ఉంటోంది.
ప్రభుత్వ పథకాల అమలు సవాళ్లు
కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY)’ వంటి పథకాలను అమలు చేస్తున్నప్పటికీ లబ్ధిదారులను గుర్తించడంలో జాప్యం జరుగుతోంది. ఇది పథకాల అమలు ఆలస్యం అవ్వడానికి కారణమవుతోంది.
మౌలిక వసతుల లేమి
ప్రభుత్వం నిర్మించే తక్కువ ధర గృహాలు కొన్నిసార్లు నగరాలకు దూరంగా ఉంటున్నాయి. చాలావరకు కనీస మౌలిక వసతులు (రవాణా, నీరు, విద్యుత్) అందుబాటులో లేని ప్రాంతాల్లో ఉండటం వల్ల వాటిని కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదు.
భారత్‌లో సొంతింటి కలను సాకారం చేయాలంటే ప్రభుత్వాలు తక్కువ ఆదాయ వర్గాలకు తగినంత ఫైనాన్సింగ్ సహాయం అందించాలి. అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించడం, పట్టణ ప్రాంతాల్లో గృహ లభ్యతను పెంచడం వంటివి చేయాలి. భూమి ధరల పెరుగుదలను నియంత్రించడం వంటి సమగ్ర విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది.
ఇదీ చదవండి: 400 సెల్‌ఫోన్లు పేలితే ఇంత తీవ్రత ఉంటుందా?


