400 సెల్‌ఫోన్లు పేలితే ఇంత తీవ్రత ఉంటుందా? | Kurnool Bus Fire Accident, Know About What Kind Of Damage If Lithium Battery Heated, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

400 సెల్‌ఫోన్లు పేలితే ఇంత తీవ్రత ఉంటుందా?

Oct 25 2025 11:26 AM | Updated on Oct 25 2025 1:23 PM

Kurnool Bus Fire Accident what kind of damage if lithium battery heated

కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైన ఘటనలో సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా కొత్త కోణాన్ని గుర్తించాయి. ప్రమాదానికి ఇతర అంశాలు కారణమైనా, బస్సు లగేజీ క్యాబిన్‌లో ఉన్న సుమారు 400 మొబైల్ ఫోన్లు పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగినట్లు తెలిపాయి.

ఘటన జరిగిందిలా..

కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి ఇంకా విచారణ జరుగుతోంది. అయితే ప్రాథమిక వివరాల ప్రకారం.. బస్సు ఒక బైకును ఢీకొట్టగానే ఆ బస్సు కింద బైకు ఇరుక్కుపోయింది. దాన్ని కొంత దూరం ఈడ్చుకెళ్లడం వల్ల మంటలు చెలరేగాయి. ఈ మంటలు తొలుత లగేజీ క్యాబిన్‌కు అంటుకున్నాయి. ఆ క్యాబిన్‌లో 400కు పైగా మొబైల్ ఫోన్లతో కూడిన పార్సిల్ ఉంది. అధిక వేడి వల్ల ఈ ఫోన్లలో వాడే బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలాయి.

బ్యాటరీలు పేలడం వల్ల భారీ శబ్దం వచ్చి మంటలు మరింత తీవ్రమయ్యాయి. ఈ మంటలు లగేజీ క్యాబిన్ పైభాగంలోని ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌కు వేగంగా వ్యాపించాయి. లగేజీ క్యాబిన్ పైభాగంలో, అంటే బస్సు మొదటి భాగంలో ఉండే సీట్లు, బెర్తుల్లో ఉన్నవారికి తప్పించుకునే సమయం లేకుండా పోయింది. దట్టమైన పొగ, మంటల్లో చిక్కుకున్న ప్రయాణికులు అత్యవసర ద్వారం తెరుచుకోకపోవడంతో బయటపడలేకపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ మాత్రం తన సీటు పక్కన ఉండే కిటికీ నుంచి తప్పించుకున్నాడు. ప్రాథమికంగా ఫొరెన్సిక్‌ అధికారులు చెప్పిన పైవివరాల ప్రకారం బస్సు ఢీకొనడం వల్ల మంటలు ప్రారంభమైనప్పటికీ మొబైల్ ఫోన్లలోని బ్యాటరీల పేలుడే ప్రమాద తీవ్రతను పెంచింది.

లిథియం అయాన్ బ్యాటరీలు

మొబైల్ ఫోన్లలో సాధారణంగా లిథియం అయాన్ బ్యాటరీలు ఎక్కువగా వాడుతున్నారు. ఈ బ్యాటరీలు అధిక శక్తి సాంద్రత కలిగి ఉండటం వల్ల చిన్న పరిమాణంలో ఎక్కువ శక్తిని నిల్వ చేయగలవు. అయితే ఇవి వేడెక్కినప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తాయి.

ఈ బ్యాటరీలు పేలేందుకు కారణాలు

  • ఈ బ్యాటరీలకు వేడి తగిలితే పేలే అవకాశం ఉంటుంది. బస్సు ప్రమాదంలో జరిగింది ఇదే. బయట నుంచి అగ్ని ప్రమాదం కారణంగా వేడి ఎక్కువై పార్శిల్‌ క్యాబిన్‌లోకి వచ్చింది. దాంతో ఫోన్లలోని బ్యాటరీలు వేడై పేలిపోయాయి.

  • బ్యాటరీ పూర్తిగా నిండిన తర్వాత కూడా ఛార్జింగ్ కొనసాగడం వల్ల బ్యాటరీ లోపల ఉష్ణోగ్రత పెరుగుతుంది.

  • బ్యాటరీ లోపల అనోడ్, కాథోడ్ పొరలు దెబ్బతినడం లేదా పటిష్టమైన తయారీ విధానాలు అనుసరించకపోవడంతో అవి ఒకదానితో ఒకటి తాకితే పేలిపోతాయి.

  • పూర్తిగా బ్యాటరీ అయిపోయేంత వరకు వేచి చూసి ఒక్కసారిగా ఛార్జింగ్‌ పెట్టినా పేలే అవకాశం ఉంటుంది.

  • బస్సు ఢీకొన్న సందర్భంలో పార్శిళ్లు, అందులోని వస్తువులు గట్టిగా కొట్టుకోవడం వల్ల బ్యాటరీ నిర్మాణంలో మార్పులు వచ్చి అంతర్గత షార్ట్ సర్క్యూట్‌కు దారితీయవచ్చు.

బ్యాటరీ పేలుడు వెనుక రసాయన చర్యలు

లిథియం అయాన్ బ్యాటరీ పేలడాన్ని ‘థర్మల్ రన్‌అవే’ అని కూడా పిలుస్తారు. అధిక వేడిమి లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగా బ్యాటరీ సెల్‌లో ఉష్ణోగ్రత నిర్ణీత పరిమితి దాటినప్పుడు థర్మల్ రన్‌అవేకు దారి తీస్తుంది. మొదట కాథోడ్, అనోడ్‌లను వేరు చేసే సెపరేటర్ (పాలిమర్) కరిగిపోతుంది. సెపరేటర్ కరగడం వల్ల కాథోడ్, అనోడ్ నేరుగా ఒకదాంతో ఒకటి తాకి ఇంటర్నల్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడుతుంది. దీనివల్ల మరింత ఎక్కువ వేడి ఉత్పత్తి అవుతుంది. అధిక ఉష్ణోగ్రత వద్ద అందులోని కెమికల్స్‌ విచ్ఛిన్నం కావడం మొదలవుతుంది. అదే సమయంలో ఎలక్ట్రోలైట్ (బ్యాటరీ లోపల ఉండే ద్రవం) వేడెక్కి ఆవిరై మండే స్వభావం గల హైడ్రోకార్బన్ వాయువులను విడుదల చేస్తుంది.

ఈ చర్యలో విడుదలైన ఆక్సిజన్, ఇతర మండే వాయువులు అధిక వేడి వల్ల మరింత తీవ్రంగా పేలిపోతాయి. ఒక సెల్ పేలడం వల్ల విడుదలైన వేడి పక్కనే ఉన్న ఇతర మొబైళ్లకు వ్యాపించి అవి కూడా థర్మల్ రన్‌అవేకు గురవుతాయి. ఈ గొలుసుకట్టు చర్య కారణంగా బస్సు లగేజీ క్యాబిన్‌లో వందల కొద్దీ ఫోన్లు వరుసగా పేలి భారీ శబ్దంతో అగ్ని తీవ్రత పెరగడానికి కారణం కావచ్చు.

లిథియం బ్యాటరీలతో జాగ్రత్త 

- నాగసాయి, ఏసీపీ, సిటీ సెక్యూరిటీ వింగ్‌, సైబరాబాద్‌

కర్నూలు బస్సు అగ్ని ప్రమాద సంఘటన దురదృష్టకరం. క్లూస్‌ టీమ్‌ ప్రాథమికంగా విచారించిన అంశాలను బట్టి బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో కింద ఇరుక్కుపోయి మంటలు చెలరేగాయి. అవికాస్తా పార్శిల్‌ క్యాబిన్‌కు వ్యాపించి అందులోని మొబైళ్లు ఒక్కసారిగా పేలాయి. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోంది. సాధారణంగా ఫోన్లలో వాడే లిథియం అయాన్‌ బ్యాటరీలకు పేలే గుణం ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా అవి పేలే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఫోన్లు వాడటం జీవితంలో భాగమైంది. ఈ క్రమంలో యూజర్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఛార్జింగ్ చేసేటప్పుడు లేదా సాధారణంగా ఉపయోగించేటప్పుడు ఫోన్‌ను ఎండలోగానీ, కారు డాష్‌బోర్డ్‌ల్లో, స్టవ్ లేదా రేడియేటర్ వంటి అధిక వేడిని ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో పెట్టకూడదు. వేడి పెరిగితే బ్యాటరీ పేలే ప్రమాదం ఉంటుంది.

  • ఎల్లప్పుడూ ఫోన్ తయారీదారు సిఫార్సు చేసిన ఒరిజినల్‌ ఛార్జర్, కేబుల్‌ను మాత్రమే ఉపయోగించాలి.

  • నాసిరకం ఛార్జర్‌లు ఓవర్‌ఛార్జింగ్‌కు లేదా అధిక వేడికి దారితీయవచ్చు.

  • ఫోన్‌ను రాత్రంతా లేదా ఎక్కువ సేపు ఛార్జింగ్‌లో ఉంచడం మానుకోండి. 80 నుంచి 90 శాతం వరకు ఛార్జ్ అయిన తర్వాత తీసివేయడం ఉత్తమం.

  • ఛార్జింగ్ అవుతున్నప్పుడు ఫోన్‌ను వాడడం మానుకోవాలి. దీనివల్ల వేడి పెరిగే ప్రమాదం ఉంది.

  • ఛార్జింగ్ చేసేటప్పుడు ఫోన్‌ను దుప్పటి, దిండు లేదా మంచం వంటి గాలి ఆడకుండా ఉండే మెత్తటి ఉపరితలాలపై కాకుండా గట్టి, చల్లటి ఉపరితలం (టేబుల్)పై ఉంచండి.

  • బ్యాటరీ స్థాయి 20 శాతం కంటే తక్కువకు పడిపోకుండా చూసుకోవడం మంచిది.

  • ఫోన్‌ను కింద పడేయడం, బలంగా కొట్టడం లేదా వంచడం వంటివి చేయకండి. దీనివల్ల బ్యాటరీ లోపల షార్ట్ సర్క్యూట్‌కు దారితీయవచ్చు.

  • మీ ఫోన్ బ్యాటరీ ఉబ్బినట్లు అనిపిస్తే లేదా ఫోన్ వెనుక భాగం ఉబ్బినట్లయితే వెంటనే దాన్ని ఉపయోగించడం ఆపివేసి సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లండి. ఉబ్బిన బ్యాటరీలు చాలా ప్రమాదకరం.

  • ఒక్క మొబైళ్లలోనే కాదు, ఇంట్లో వాడే ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు, ఈవీ వాహనాల్లోనూ లిథియం బ్యాటరీలు వాడుతున్నారు. వీటిని వాడే సమయంలో నిబంధనలకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement