సాక్షి, తాడేపల్లి: కర్నూలు బస్సు ప్రమాదం అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై వైఎస్సార్‌సీపీని టార్గెట్ చేసింది కూటమి ప్రభుత్వం. దీనిలో భాగంగా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి సైతం పోలీసులు వచ్చారు. కర్నూలు బస్సు ప్రమాదానికి మద్యం కారణమనే విషయం అందరికీ తెలిసినా.. దీనిపై పోస్టులు పెట్టిన వారిపై ఇప్పటివరకూ కేసులు పెట్టిన పోలీసులు.. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలోకి అడుగుపెట్టారు. ఏదో రకంగా వైఎస్సార్‌సీపీని వేధించాలనే లక్ష్యంతో కూటమి కనుసన్నల్లో పని చేస్తున్న పోలీసులు.. ఇవాళ(శుక్రవారం, నవంబర్ ) వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి నోటీసులు ఇచ్చారు.
కర్నూలు బస్సు దగ్ధం కేసులో నోటీసులు జారీ చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరికి నోటీసులు ఇచ్చిన పోలీసులు.. బస్సు దగ్దానికి మద్యమే కారణమని ప్రచారం చేశారంటూ నోటీసులు ఇచ్చారు. ప్రచారం వెనుక వైఎస్సార్‌సీపీ ఉందంటూ కేసు పెట్టారు. ఇప్పటికే 27 మందిపై కేసులు నమోదు చేశారు. తాజాగా పూడి శ్రీహరిని కూడా ఈ కేసులో కర్నూలు ఖాకీలు చేర్చారు.

బాబు సర్కార్.. నోటీసులతో భయపెట్టాలని చూస్తోంది: టీజేఆర్
పోలీసుల నోటీసులపై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పందిస్తూ.. ‘‘కర్నూలు బస్సు దగ్దానికి మద్యమే కారణం.. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ అదే విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టిన వారిపై కేసులు పెట్టారు. ఇప్పుడు ఏకంగా మా పార్టీ కేంద్ర కార్యాలయానికే పోలీసులు వచ్చారు. మా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీహరికి నోటీసులు ఇచ్చారు. ప్రజలు, ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ప్రభుత్వం నోటీసులతో భయపెట్టాలని చూస్తోంది’’ అంటూ ఆయన మండిపడ్డారు.
ఇలాంటి నోటీసులు, కేసులకు మేము భయపడము. కర్నూలు బస్సు దగ్దానికి కారణమైన బైకర్లు మద్యం ఎక్కడ తాగారో ప్రభుత్వం ఎందుకు చెప్పటం లేదు?. మృతుని శరీరంలో ఎంత ఆల్కాహాల్ ఉందో రిపోర్టుని ఎందుకు బయట పెట్టలేదు?. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం, డ్రగ్స్ దొరుకుతోంది. విశాఖలో దొరికిన డ్రగ్స్ వివరాలు హోంమంత్రి ఎందుకు బయట పెట్టటం లేదు?. ఎవరి ప్రభుత్వ హయాంలో డ్రగ్స్ దొరికాయో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?’’ అంటూ టీజేఆర్ ప్రశ్నించారు.


