సాక్షి, కర్నూలు: కర్నూలు బస్సు ప్రమాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎట్టకేలకు వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు యజమాని వేమూరి వినోద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వేమూరి వినోద్ కుమార్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. వినోద్‌కు సొంత పూచికత్తుపై స్పెషల్ మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కర్నూలు జిల్లా బస్సు ప్రమాదం ఘటనలో 19 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రమాద ఘటనపై బస్సు డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఏ1గా ఉన్న డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు అరెస్టు చేశారు.
చిన్న టేకూరు వద్ద జరిగిన కావేరీ ట్రావెల్ బస్సు ప్రమాద ఘటనపై ఉలిందికొండ పోలీస్ స్టేషన్‌లో యజమాని, డ్రైవర్‌పై కేసు నమోదైంది. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం కొత్తపేటకు చెందిన ప్రయాణికుడు రమేష్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. డ్రైవర్‌తో పాటు యజమానిపై రెండు సెక్షన్ల కింద BNS 125(a), 106(1) సెక్షన్లు పోలీసులు నమోదు చేశారు.
కాగా, 19 మంది సజీవ దహనానికి కారణమైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య అర్హత లేకున్నప్పటికీ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ప్రమాదం నేపథ్యంలో పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామానికి చెందిన లక్ష్మయ్య కుటుంబ నేపథ్యం, ప్రవర్తన, అలవాట్లపై అధికారులు ఆరా తీశారు. ఈయన 5వ తరగతి వరకే చదువుకున్నాడని, అయితే టెన్త్ ఫెయిల్ అయినట్లు సర్టిఫికెట్ ఇచ్చి, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడని గుర్తించారు.


