అదుపులేని ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ప్రయాణికుల ప్రాణాల్ని గాలిలో దీపాలుగా చేస్తున్నాయి. కర్నూలు దగ్గరలో జరిగిన అగ్ని ప్రమాదంలో బస్సు లోనే ఆహుతి అయిన 19 మానవ ప్రాణాలు ఈ దుఃస్థితికి ఉదాహరణ. ఆ ప్రమాద కారణాలు ప్రత్యక్షంగా ఏవైనప్పటికీ, అలాంటి ప్రమాదం ఏర్పడ టానికి పరోక్షంగా దోహదపడిన పరిస్థితుల్ని చక్కదిద్దడానికి పూనుకోకపోతే మళ్లీ మళ్లీ అలాంటి దురదృష్టకర సంఘటనలు పెచ్చరిల్లుతాయి. ఈ దుర్ఘటన జరిగాక ఆంధ్రప్రదేశ్‌లో సంబంధిత అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. రెండు రోజుల్లో 360కి పైగా అతిక్రమణలు గుర్తించారు. నలభై బస్సుల్ని సీజ్ చేశారు. కళ్లెదుట ప్రతి రోజూ లక్షలాది మంది ప్రయాణించే బస్సులు ఒక్కరోజు తనిఖీలోనే పదుల సంఖ్యలో ప్రయా ణింప వీలుగాని కండిషన్‌లో ఉన్నా యంటే వ్యవస్థ ఏ స్థితిలో ఉందో అర్థమవుతోంది.
మితిమీరి లాభాలు పొందడా నికి ప్రైవేట్ ట్రావెల్ సంస్థలు గడ్డి కరి చినా, వాటిని నియంత్రించే వ్యవస్థకు ఏమైంది? ఆల్‌ఇండియా పర్మిట్‌లు ఈశాన్య రాష్ట్రాల్లో తీసుకోవడం, బళ్ళు ఇక్కడ తిప్పడంలోనే అవినీతి జాడ లున్నాయి. సిటింగ్‌కి అనుమతి తీసుకుని, స్లీపర్‌గా మార్చి ప్రయాణికుల రక్షణను రోడ్డున పడేస్తే, అధికారులు గమనించలేక పోతున్నారా? అగ్నిమాపక నిబంధనల్ని కచ్చితంగా అమలు చేయాల్సిన చోట చూసీచూడనట్లు వది లేయడం ఎంత దారుణం!
గత రెండు రోజుల్లో నమోదైన అతిక్రమణల కేసులు చూస్తే అర్థమయ్యేది ఏమిటంటే నిబంధనలు పాటించే వారికన్నా అతిక్రమించే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. నియంత్రించాల్సిన వ్యవస్థలు అలసత్వంతోనో, అవినీతితోనో కళ్లు మూసుకొంటున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే జరిగే తనిఖీల హడావిడి రెండ్రోజుల తర్వాత పూర్తిగా అటకెక్కుతుంది. తర్వాత షరా మామూలే! పాడె మారువేషంలో స్పీడుగా తిరుగుతుంది రోడ్ల మీద!!
ఇదీ చదవండి : బిగ్‌బీ దివాలీ గిఫ్ట్ : నెట్టింట ట్రోలింగ్ మామూలుగా లేదుగా!
ఈ స్థితి మారాలి. రోడ్డు నిబంధనల్ని నిక్కచ్చిగా పాటించేలా చూడాలి. స్పీడు అతిక్రమించితే బైక్‌నైనా సీజ్ చెయ్యాలి. భారీగా పెనాల్టీ వెయ్యాలి. ప్రజా రవాణా వాహనాల్ని ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ కండిషన్‌లో ఉండేలా నియంత్రించాలి. రోడ్డు ప్రమాదాల్లో విలువైన ప్రాణాల్ని కోల్పోతున్నాం. సరైన చర్యల ద్వారా వాటిని బాగా తగ్గించగలం. ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించాలి.
– డా.డి.వి.జి. శంకరరావు, పార్వతీపురం మాజీ ఎంపీ


