సాక్షి, న్యూఢిల్లీ: కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై అత్యవసర విచారణ జరపాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్‌సీ), కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి సోమవారం ఫిర్యాదు చేశారు. బస్సుపై 16 పెండింగ్ చలాన్లు ఉన్నాయని, అయినా ఆ బస్సు రోడ్లపై స్వేచ్ఛగా తిరిగిందన్నారు. అనుమతి లేకుండా స్లీపర్ సీట్లు అమర్చారని..అలాగే పెద్ద సంఖ్యలో ఫోన్ల రవాణాకు ప్రయత్నించారని పేర్కొన్నారు. వీటన్నింటి వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. ప్రమాదాలకు కారకులైన ప్రభుత్వం, రవాణా శాఖపై కూడా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


