మూడు రోజులుగా సైదాబాద్‌లోని బాలసదనంలోనే అధికారుల బస
అక్కడున్న బాలురతో ఘటనకు సంబంధించిన సమాచారం సేకరణ
సాక్షి, హైదరాబాద్: సైదాబాద్ బాలసదనంలోని పిల్లలపై లైంగిక దాడుల ఘటన వెలుగు చూసిన నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ప్రత్యేక విచారణ ముమ్మరం చేసింది. బాలసదనంలో ఘటనను స్వయంగా పరిశీలించి విచారించేందుకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ అధికారుల బృందం రంగంలోకి దిగింది. మూడు రోజులుగా విచారణ ప్రక్రియను కొనసాగిస్తోంది.
అక్టోబర్ మొదటి వారంలో పదేళ్ల బాలుడు తీవ్ర అస్వస్థతకు గురి కాగా... చికిత్స నిమిత్తం బాలుడి తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లడంతో లైంగిక దాడి ఘటన వెలుగు చూసింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకు ఆదేశించింది. ఇందులో భాగంగా దర్యాప్తు బృందం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇసామ్ సింగ్, మరో అధికారి అవినాష్ కుమార్ సైదాబాద్ బాలసదనానికి చేరుకున్నారు.
మూడు రోజులుగా అక్కడే బస చేసిన అధికారులు వివిధ కోణాల్లో విచారణ చేపడుతున్నారు. బాలసదనంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిని వేరువేరుగా విచారించిన దర్యాప్తు అధికారులు... బుధవారం బాలసదనంలోని పిల్లలతో వేరువేరుగా ముచ్చటించారు. ఇంకా చాలా మంది పిల్లలపైనా ఈ తరహా దాడులు జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో ఎన్‌హెచ్‌ఆర్‌సీ దర్యాప్తు అధికారులు బాలురిని వేరువేరుగా విచారణ జరిపారు.
బాధిత పిల్లలను సైతం దర్యాప్తు అధికారులు ప్రత్యేకంగా కలిసి విచారించినట్లు తెలిసింది. మూడు రోజులపాటు విచారణ జరిపిన అధికారులు గురువారం ఢిల్లీకి వెళ్లిన తర్వాత విచారణ నివేదికను ఎన్‌హెచ్‌ఆర్‌సీకి అందించనున్నట్లు సమాచారం.
కంటితుడుపు చర్యలతో సరి...
బాలసదనంలోని పిల్లలపై లైంగిక దాడులు వెలుగుచూసిన వెంటనే రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కంటితుడుపు చర్యలతో సరిపెట్టింది. సైదాబాద్‌లో ఉన్న రెండు చిల్డ్రన్ హోంలతో పాటు స్పెషల్ హోంకు సంబంధించి పూర్తి స్థాయిలో పరిశీలించి నివేదిక సమరి్పంచాలని జువెనైల్ వెల్ఫేర్ శాఖ అధికారిని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. దాదాపు నెలరోజులు కావస్తున్నా ఈ విచారణ ప్రక్రియ ముందుకు సాగకపోవడం గమనార్హం.


