ముందు అసెంబ్లీకి రండి | CM Revanth Reddy Strong Counter to KCR Comments | Sakshi
Sakshi News home page

ముందు అసెంబ్లీకి రండి

Dec 22 2025 4:00 AM | Updated on Dec 22 2025 4:00 AM

CM Revanth Reddy Strong Counter to KCR Comments

ఆదివారం సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్‌ హోం కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా నదీ జలాల విషయంలో ఎవరేం చేశారో, ఎవరి హయాంలో ఏం జరిగిందో కూలంకశంగా మాట్లాడేందుకు వచ్చే నెల 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుందామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ కూడా వస్తే అన్ని విషయాలపై చర్చిద్దామని తాను ప్రతిపాదిస్తున్నానన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగిందో, కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో? తాను ముఖ్యమంత్రి అయ్యాక ఏం చేశానో? అన్ని విషయాలను మాట్లాడుకోవచ్చని చెప్పారు.

ప్రతిపక్ష నేతగా ఆయన ప్రజలకు ఉపయోగపడే సూచనలు చేస్తే ఆమోదించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్‌ హయాంలోనే కృష్ణా జలాల్లో తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగిందన్నారు. శాశ్వతంగా కృష్ణా జలాల హక్కులను ఏపీకి రాసిచ్చేసి పాల మూరు, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ప్రజలకు మరణశాసనం రాసింది కేసీఆరేనని ఆరోపించారు. ఆదివారం సాయంత్రం తన నివాసంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి విలేకరులతో ఇష్టాగోష్టి మాట్లాడిన రేవంత్‌రెడ్డి ఏమన్నారంటే..! 

ప్రజలు తీర్పు ఇస్తూనే ఉన్నారు 
‘కలుగులో ఉన్న ఎలుకకు పొగబెడితే బయటకు వచ్చినట్టు రెండేళ్ల తర్వాత కేసీఆర్‌ బయటకు వచ్చాడు. సంతోషం. ప్రజలిచి్చన తీర్పు కేసీఆర్‌కు కనువిప్పు కలిగించి స్రత్పవర్తన తెస్తుందని ఆశించాం. కానీ రెట్టించిన ఉత్సాహంతో చెప్పిన అబద్ధం చెప్పకుండా అబద్ధాలే పెట్టుబడిగా ఆయన 75 నిమిషాల ప్రసంగం సాగింది. బీఆర్‌ఎస్‌ చేసిన నేరాలు, ఘోరాలు దృష్టిలో పెట్టుకుని 2023 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ, ఆ తర్వాత జరిగిన పార్లమెంటు, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలు, ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారు. కరడుగట్టిన నేరగాళ్లకు కూడా కనువిప్పు కలుగుతుంది కానీ కేసీఆర్‌ మాత్రం ఏ మాత్రం జంకు లేకుండా రంకు మాటలు మాట్లాడుతున్నాడు. 

మూతి దగ్గర కాకుండా తోక దగ్గర 
ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడే కృష్ణా జలాల్లో తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగింది. 811 టీఎంసీల్లో 512 ఏపీకి, 299 టీఎంసీలు తెలంగాణకు అని సంతకం పెట్టింది ఎవరు? ఒక్కసారి కాదు పదేపదే సంతకాలు పెట్టి పాలమూరు, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ప్రజలకు మరణ శాసనం రాసిందే కేసీఆర్‌. 2021–22లో శాశ్వతంగా కృష్ణా జలాల హక్కులను కేసీఆర్‌ ఏపీకి రాసిచ్చారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా జూరాల దగ్గర ఒడిసిపట్టుకోవాల్సిన నీటిని శ్రీశైలంలో కలిపి ఏపీ జలదోపిడీకి రాజమార్గం ఏర్పాటు చేశాడు.

మూతి దగ్గర వదిలేసి తోక దగ్గర పట్టుకోవాలని చూశాడు. లిఫ్టులు, పంపులు, కాంట్రాక్టులు, కమిషన్ల కోసమే ఇదంతా చేశాడు. అందుకే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఒక్క ప్రాజెక్టు కూడా కృష్ణాపై పూర్తికాని పరిస్థితి. బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, నారాయణపేట– కొడంగల్, డిండి, ఎస్సెల్బీసీల్లో ఒక్క ప్రాజెక్టునయినా పదేళ్లలో పూర్తి చేశాడా? మేం వచి్చన తర్వాత రూ.6,800 కోట్ల విలువైన పనులను కృష్ణాపై సాగునీటి ప్రాజెక్టుల కోసం చేశాం.  

తేలు కుట్టిన దొంగలా.. 
మేం వచ్చిన తర్వాతే కృష్ణా జలాల్లో 71 శాతం వాటా అడిగాం. ఏపీకి 29 శాతం వాటా ఇవ్వాలని కొట్లాడుతున్నదే మేము. పైగా తానే నీళ్లకు నడక నేరి్పనట్టు ఏపీకి చెందిన సీఎం చంద్రబాబు నాయుడికి ప్రాజెక్టులు ఎలా కట్టాలో కూడా ఆయనే చెప్పాడు. అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడిన మాటలను ప్రజల ముందు పెడతాం. ట్రిబ్యునల్‌లో స్వయంగా మా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెళ్లి వాదనలు వినిపిస్తున్నాడు.

పదేపదే జలశక్తి మంత్రిని కలుస్తున్నారు. కేంద్రం చేయకపోతే అంతా ఎడారిగా మారిపోదు. తెలంగాణకు కృష్ణా జలాల విషయంలో చేసిన ద్రోహానికి కేసీఆర్‌ సమా«ధానం మాత్రమే కాదు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు కూడా చెప్పాలి. ఈ ద్రోహిని నిలదీద్దామని సభకు రమ్మంటే తేలు కుట్టిన దొంగలా తప్పించుకుంటున్నాడు. సంవత్సరంన్నర తర్వాత బయటకు వచ్చి అసలు ఊరుకునేదే లేదంటూ సుయోధనుడిలా ఏకపాత్రాభినయం చేస్తున్నాడు. 

అందుకే అసెంబ్లీకి రావడంలేదు.. 
అసెంబ్లీలో కృష్ణాకు ఒకరోజు, గోదావరి ఒకరోజు కేటాయించి చర్చ చేద్దామని నేను ప్రతిపాదిస్తున్నా... ఆయన్ను రమ్మనండి. లేదంటే రెండు రోజుల చొప్పున చర్చిద్దామన్నా ఓకే. ఆయన అబద్ధాలు చెపుతున్నాడు కాబట్టే అసెంబ్లీకి రావడం లేదు. అసెంబ్లీకి రండని అడుగుతున్నా.. రాకుండా కేసీఆర్‌ పారిపోవడంలో ఉద్దేశమేంటి? ఆయనకు అధికారం కోసం వ్యామోహం తప్ప తెలంగాణ ప్రజలపై అభిమానం లేదు. అందుకే జుగుప్సాకరమైన మాటలు మాట్లాడుతున్నాడు. సభలో ఆయన గౌరవ మర్యాదలకు భంగం కలిగించబోమని నేను హామీ ఇస్తున్నా. అలా ఎవరైనా భంగం కలిగించినా చర్యలు తీసుకోమని నేనే చెబుతా. 

ఆయన ఆరోగ్యంగా ఉండాలి 
ఆయన ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చాడో అందరికీ తెలుసు. కొడుకు, అల్లుడి పంచాయతీ తీర్చేందుకు వచ్చాడు. కొడుకు దగ్గరి నుంచి అల్లుడు పార్టీని గుంజుకుంటాడేమోనని, దేనికీ చెల్లనోడు అల్లుడి చేతిలో పార్టీ పెడతాడేమోనని, కోతుల పంచాయతీ పిల్లి తీర్చినట్టు వచ్చాడు. ఆయన చావు మేమెందుకు కోరుకుంటాం. అధికారం ఉన్నప్పుడే కొడుకు కుర్చీ కోసం ప్రయతి్నంచాడు. ప్రమాణ స్వీకారానికి కొత్త బట్టలు కూడా కుట్టించుకున్నాడు. ఇప్పుడు అల్లుడు సావు కోరుకుంటున్నాడు.

ఆయన పోతే అల్లుడికి పార్టీ వస్తదని అనుకుంటున్నాడు. నాకేమి వస్తుంది. కేసీఆర్‌ ఆరోగ్యంగా ఉండాలని, అసెంబ్లీకి వచ్చి అర్థవంతమైన చర్చ జరగాలని నేను కోరుకుంటున్నా. ఆయన కింద పడి కాలువిరిగితే మొదట పరామర్శించిందే నేను. అర్ధరాత్రి ఆంబులెన్సు పెట్టి ఆసుపత్రికి తీసుకొచ్చిందే నేను. కానీ ఆయన అల్లుడు, కొడుకే పోటీలుపడి ఆయన్ను ఫామ్‌హౌజ్‌లో నిర్బంధిస్తున్నారు. కేసీఆర్‌కు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రజలతో ఇబ్బంది లేదు. కుటుంబసభ్యులతోనే ప్రమాదం ఉంది. నన్ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్న మాటలు ఆయన వయసుకు తగ్గట్టు లేవు. ఆయన తమలపాకుతో కొడితే నేను తలుపుచెక్కతో కొట్టగలను.  

అల్లుడు కాపలా కాసుకుని ఉన్నాడు 
కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేయాలనుకుంటున్నది మేం కాదు. ఆయన కొడుకు, అల్లుడే. కేటీఆర్‌ ఐరన్‌లెగ్‌ అని చెప్పి పార్టీని గుంజుకుంటే ఉన్న పళంగా హరీశ్‌రావుకు రూ.5వేల కోట్ల ఆస్తి వస్తుంది. రూ.1,500 కోట్ల పార్టీ బ్యాంక్‌ బ్యాలెన్సు, రూ.3,500 కోట్ల విలువైన పార్టీ ఆస్తులు రాత్రికి రాత్రి ఆయన హస్తగతమవుతాయి. నేను చెప్పేది కనపడే ఆస్తుల గురించే. కనిపించని వజ్రాలు, వైఢూర్యాల గురించి కాదు. నేను కోటి మంది మహిళలకు సారె పెడితే కేటీఆర్‌ ఉన్న చెల్లిని ఇంటి నుంచి పంపించేశాడు. ప్రతి దగ్గర బాంబులు పెట్టారనడం ఫ్యాషన్‌ అయిపోయింది. 

అప్పులు చేసి గుల్ల చేశారు 
రూ.8 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని గుల్ల చేశాడు. 11.9 శాతం వడ్డీకి అప్పులు తెచ్చాడు. సంసారం చేసేటోడెవడైనా అంత వడ్డీకి అప్పులు తెస్తాడా? కేసీఆర్, ఆయన కుమారుడు కలిసి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను అత్యాచారం చేశారు. కేసీఆర్‌ ఒక ఆర్థిక ఉగ్రవాది. మేం వచ్చిన తర్వాత ఒక్కోక్కటి సరిదిద్దుతున్నాం. ఇప్పటివరకు రూ.26 వేల కోట్లు అప్పులను రీస్ట్రక్చర్‌ చేశాం. మరో 85వేల కోట్ల కోసం ప్రయతి్నస్తున్నాం. ప్రధాని మోదీ తన ఆరోగ్యం గురించి ఆరా తీయగానే కేసీఆర్‌ సంతోషపడుతున్నాడు. ఫార్ములా ఈ–రేస్‌ కేసులో అరవింద్‌ కుమార్‌ విచారణకు డీవోపీటీ అనుమతి ఇవ్వకపోవడానికి కారణం ఇదే’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement