breaking news
Krishna river water board
-
ముందు అసెంబ్లీకి రండి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల విషయంలో ఎవరేం చేశారో, ఎవరి హయాంలో ఏం జరిగిందో కూలంకశంగా మాట్లాడేందుకు వచ్చే నెల 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుందామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా వస్తే అన్ని విషయాలపై చర్చిద్దామని తాను ప్రతిపాదిస్తున్నానన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగిందో, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో? తాను ముఖ్యమంత్రి అయ్యాక ఏం చేశానో? అన్ని విషయాలను మాట్లాడుకోవచ్చని చెప్పారు.ప్రతిపక్ష నేతగా ఆయన ప్రజలకు ఉపయోగపడే సూచనలు చేస్తే ఆమోదించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ హయాంలోనే కృష్ణా జలాల్లో తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగిందన్నారు. శాశ్వతంగా కృష్ణా జలాల హక్కులను ఏపీకి రాసిచ్చేసి పాల మూరు, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ప్రజలకు మరణశాసనం రాసింది కేసీఆరేనని ఆరోపించారు. ఆదివారం సాయంత్రం తన నివాసంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి విలేకరులతో ఇష్టాగోష్టి మాట్లాడిన రేవంత్‌రెడ్డి ఏమన్నారంటే..! ప్రజలు తీర్పు ఇస్తూనే ఉన్నారు ‘కలుగులో ఉన్న ఎలుకకు పొగబెడితే బయటకు వచ్చినట్టు రెండేళ్ల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చాడు. సంతోషం. ప్రజలిచి్చన తీర్పు కేసీఆర్‌కు కనువిప్పు కలిగించి స్రత్పవర్తన తెస్తుందని ఆశించాం. కానీ రెట్టించిన ఉత్సాహంతో చెప్పిన అబద్ధం చెప్పకుండా అబద్ధాలే పెట్టుబడిగా ఆయన 75 నిమిషాల ప్రసంగం సాగింది. బీఆర్ఎస్ చేసిన నేరాలు, ఘోరాలు దృష్టిలో పెట్టుకుని 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ, ఆ తర్వాత జరిగిన పార్లమెంటు, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారు. కరడుగట్టిన నేరగాళ్లకు కూడా కనువిప్పు కలుగుతుంది కానీ కేసీఆర్ మాత్రం ఏ మాత్రం జంకు లేకుండా రంకు మాటలు మాట్లాడుతున్నాడు. మూతి దగ్గర కాకుండా తోక దగ్గర ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే కృష్ణా జలాల్లో తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగింది. 811 టీఎంసీల్లో 512 ఏపీకి, 299 టీఎంసీలు తెలంగాణకు అని సంతకం పెట్టింది ఎవరు? ఒక్కసారి కాదు పదేపదే సంతకాలు పెట్టి పాలమూరు, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ప్రజలకు మరణ శాసనం రాసిందే కేసీఆర్. 2021–22లో శాశ్వతంగా కృష్ణా జలాల హక్కులను కేసీఆర్ ఏపీకి రాసిచ్చారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా జూరాల దగ్గర ఒడిసిపట్టుకోవాల్సిన నీటిని శ్రీశైలంలో కలిపి ఏపీ జలదోపిడీకి రాజమార్గం ఏర్పాటు చేశాడు.మూతి దగ్గర వదిలేసి తోక దగ్గర పట్టుకోవాలని చూశాడు. లిఫ్టులు, పంపులు, కాంట్రాక్టులు, కమిషన్ల కోసమే ఇదంతా చేశాడు. అందుకే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఒక్క ప్రాజెక్టు కూడా కృష్ణాపై పూర్తికాని పరిస్థితి. బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, నారాయణపేట– కొడంగల్, డిండి, ఎస్సెల్బీసీల్లో ఒక్క ప్రాజెక్టునయినా పదేళ్లలో పూర్తి చేశాడా? మేం వచి్చన తర్వాత రూ.6,800 కోట్ల విలువైన పనులను కృష్ణాపై సాగునీటి ప్రాజెక్టుల కోసం చేశాం. తేలు కుట్టిన దొంగలా.. మేం వచ్చిన తర్వాతే కృష్ణా జలాల్లో 71 శాతం వాటా అడిగాం. ఏపీకి 29 శాతం వాటా ఇవ్వాలని కొట్లాడుతున్నదే మేము. పైగా తానే నీళ్లకు నడక నేరి్పనట్టు ఏపీకి చెందిన సీఎం చంద్రబాబు నాయుడికి ప్రాజెక్టులు ఎలా కట్టాలో కూడా ఆయనే చెప్పాడు. అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడిన మాటలను ప్రజల ముందు పెడతాం. ట్రిబ్యునల్‌లో స్వయంగా మా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెళ్లి వాదనలు వినిపిస్తున్నాడు.పదేపదే జలశక్తి మంత్రిని కలుస్తున్నారు. కేంద్రం చేయకపోతే అంతా ఎడారిగా మారిపోదు. తెలంగాణకు కృష్ణా జలాల విషయంలో చేసిన ద్రోహానికి కేసీఆర్ సమా«ధానం మాత్రమే కాదు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు కూడా చెప్పాలి. ఈ ద్రోహిని నిలదీద్దామని సభకు రమ్మంటే తేలు కుట్టిన దొంగలా తప్పించుకుంటున్నాడు. సంవత్సరంన్నర తర్వాత బయటకు వచ్చి అసలు ఊరుకునేదే లేదంటూ సుయోధనుడిలా ఏకపాత్రాభినయం చేస్తున్నాడు. అందుకే అసెంబ్లీకి రావడంలేదు.. అసెంబ్లీలో కృష్ణాకు ఒకరోజు, గోదావరి ఒకరోజు కేటాయించి చర్చ చేద్దామని నేను ప్రతిపాదిస్తున్నా... ఆయన్ను రమ్మనండి. లేదంటే రెండు రోజుల చొప్పున చర్చిద్దామన్నా ఓకే. ఆయన అబద్ధాలు చెపుతున్నాడు కాబట్టే అసెంబ్లీకి రావడం లేదు. అసెంబ్లీకి రండని అడుగుతున్నా.. రాకుండా కేసీఆర్ పారిపోవడంలో ఉద్దేశమేంటి? ఆయనకు అధికారం కోసం వ్యామోహం తప్ప తెలంగాణ ప్రజలపై అభిమానం లేదు. అందుకే జుగుప్సాకరమైన మాటలు మాట్లాడుతున్నాడు. సభలో ఆయన గౌరవ మర్యాదలకు భంగం కలిగించబోమని నేను హామీ ఇస్తున్నా. అలా ఎవరైనా భంగం కలిగించినా చర్యలు తీసుకోమని నేనే చెబుతా. ఆయన ఆరోగ్యంగా ఉండాలి ఆయన ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చాడో అందరికీ తెలుసు. కొడుకు, అల్లుడి పంచాయతీ తీర్చేందుకు వచ్చాడు. కొడుకు దగ్గరి నుంచి అల్లుడు పార్టీని గుంజుకుంటాడేమోనని, దేనికీ చెల్లనోడు అల్లుడి చేతిలో పార్టీ పెడతాడేమోనని, కోతుల పంచాయతీ పిల్లి తీర్చినట్టు వచ్చాడు. ఆయన చావు మేమెందుకు కోరుకుంటాం. అధికారం ఉన్నప్పుడే కొడుకు కుర్చీ కోసం ప్రయతి్నంచాడు. ప్రమాణ స్వీకారానికి కొత్త బట్టలు కూడా కుట్టించుకున్నాడు. ఇప్పుడు అల్లుడు సావు కోరుకుంటున్నాడు.ఆయన పోతే అల్లుడికి పార్టీ వస్తదని అనుకుంటున్నాడు. నాకేమి వస్తుంది. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని, అసెంబ్లీకి వచ్చి అర్థవంతమైన చర్చ జరగాలని నేను కోరుకుంటున్నా. ఆయన కింద పడి కాలువిరిగితే మొదట పరామర్శించిందే నేను. అర్ధరాత్రి ఆంబులెన్సు పెట్టి ఆసుపత్రికి తీసుకొచ్చిందే నేను. కానీ ఆయన అల్లుడు, కొడుకే పోటీలుపడి ఆయన్ను ఫామ్‌హౌజ్‌లో నిర్బంధిస్తున్నారు. కేసీఆర్‌కు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రజలతో ఇబ్బంది లేదు. కుటుంబసభ్యులతోనే ప్రమాదం ఉంది. నన్ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్న మాటలు ఆయన వయసుకు తగ్గట్టు లేవు. ఆయన తమలపాకుతో కొడితే నేను తలుపుచెక్కతో కొట్టగలను. అల్లుడు కాపలా కాసుకుని ఉన్నాడు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనుకుంటున్నది మేం కాదు. ఆయన కొడుకు, అల్లుడే. కేటీఆర్ ఐరన్‌లెగ్ అని చెప్పి పార్టీని గుంజుకుంటే ఉన్న పళంగా హరీశ్‌రావుకు రూ.5వేల కోట్ల ఆస్తి వస్తుంది. రూ.1,500 కోట్ల పార్టీ బ్యాంక్ బ్యాలెన్సు, రూ.3,500 కోట్ల విలువైన పార్టీ ఆస్తులు రాత్రికి రాత్రి ఆయన హస్తగతమవుతాయి. నేను చెప్పేది కనపడే ఆస్తుల గురించే. కనిపించని వజ్రాలు, వైఢూర్యాల గురించి కాదు. నేను కోటి మంది మహిళలకు సారె పెడితే కేటీఆర్ ఉన్న చెల్లిని ఇంటి నుంచి పంపించేశాడు. ప్రతి దగ్గర బాంబులు పెట్టారనడం ఫ్యాషన్ అయిపోయింది. అప్పులు చేసి గుల్ల చేశారు రూ.8 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని గుల్ల చేశాడు. 11.9 శాతం వడ్డీకి అప్పులు తెచ్చాడు. సంసారం చేసేటోడెవడైనా అంత వడ్డీకి అప్పులు తెస్తాడా? కేసీఆర్, ఆయన కుమారుడు కలిసి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను అత్యాచారం చేశారు. కేసీఆర్ ఒక ఆర్థిక ఉగ్రవాది. మేం వచ్చిన తర్వాత ఒక్కోక్కటి సరిదిద్దుతున్నాం. ఇప్పటివరకు రూ.26 వేల కోట్లు అప్పులను రీస్ట్రక్చర్ చేశాం. మరో 85వేల కోట్ల కోసం ప్రయతి్నస్తున్నాం. ప్రధాని మోదీ తన ఆరోగ్యం గురించి ఆరా తీయగానే కేసీఆర్ సంతోషపడుతున్నాడు. ఫార్ములా ఈ–రేస్ కేసులో అరవింద్ కుమార్ విచారణకు డీవోపీటీ అనుమతి ఇవ్వకపోవడానికి కారణం ఇదే’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
చంద్రబాబుకు వైఎస్ జగన్ లేఖ
తాడేపల్లి: కృష్ణా జలాల పరిరక్షణలో వైఫల్యంపై చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎండగట్టారు. ఈ మేరకు వైఎస్ జగన్..చంద్రబాబుకు లేఖ తొమ్మిది పేజీల లేఖ రాశారు. ఆ లేఖలో వైఎస్ జగన్ ఏమన్నారంటే?.. ‘ట్రిబ్యునల్‌లో రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా వాదనలు వినిపించాలి. KWDT–2 ఎదుట జరగబోయే వాదనల్లో రాష్ట్ర ప్రయోజనాలను సమర్థవంతంగా వినిపించాలి. పొరపాటు జరిగితే ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదిలో 763 టీఎంసీలను కేటాయించేందుకు ట్రిబ్యునల్ అంగీకరిస్తే ఏపీకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వం తమ వాదనలు వినిపించాలిరాయలసీమ ప్రాజెక్టులపై టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 1996లో చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అల్మట్టి ప్రాజెక్టు ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచే పనులు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు, రైతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆల్మట్టి ఎత్తు పెంపు వలన ఏపీ హక్కులకు ముప్పు ఏర్పడుతుంది. దీనిపై అప్పట్లో ఎన్ని ఆందోళనలు చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. ప్రజాభిప్రాయాన్ని రైతుల ఆందోళనలను ఖాతరు చేయలేదు. టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆల్మట్టి ఎత్తు పెంపునకు అనుమతి ఇచ్చింది. అంతేకాదు.. 2014లో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం కృష్ణా నదిపై ఏపీ హక్కులను తెలంగాణకు పూర్తిగా వదిలేసింది.ఇప్పుడు మళ్లీ చంద్రబాబు సీఎంగా ఉన్న తరుణంలోనే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్లిష్ట పరిస్థితిలో టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర హక్కులను సమర్థంగా కాపాడాలి. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 512 టీఎంసీల నికర నీటిలో ఒక్క టీఎంసీ తగ్గినా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. దీనికి చంద్రబాబు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి’ అని సూచించారు. -
ఏపీది వితండవాదం: హరీశ్
న్యూఢిల్లీ: కృష్ణా జలాల పంపిణీపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరలేదు. నీటి పంపిణీపై బుధవారం ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులు భేటీ స్పష్టత లేకుండానే ముగిసింది. సమావేశం అనంతరం తెలంగాణ నీటి పారుదలశాఖ మంత్రి హరీష్ రావు న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కృష్ణా జలాల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికీ వితండవాదం చేస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రాల అనుమతితోనే నదులను అనుసంధానం చేయాలన్నారు. నాగార్జున సాగర్ కుడి కాల్వ నిర్వహణ తమకే ఇవ్వాలని ఏపీ డిమాండ్ చేస్తోందని హరీశ్ అన్నారు. కృష్ణాబోర్డు కేవలం నీటి పంపిణీ చేస్తుందని మాత్రమే చట్టంలో ఉందని, ప్రాజెక్టుల నిర్వహణను బోర్డులకు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. చర్చల పేరుతో రెండు రోజుల సమయాన్ని ఏపీ సర్కార్ వృధా చేసిందన్నారు. ప్రస్తుత పరిస్థితి ఏపీ ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు. కృష్ణా జలాల పంపిణీపై ఇప్పటికీ స్పష్టత రాలేదని, రేపు ఉదయం మరోసారి సమావేశం కానున్నట్లు హరీశ్ రావు తెలిపారు. 'రాష్ట్రాల సమ్మతితోనే నదుల అనుసంధానం జరుగుతందని కేంద్రమంత్రి ఉమాభారతి స్పష్టం చేశారు. అనుసంధానం కోసం గోదావరి నదిపై రెండు, మూడు పాయింట్లు అనుకున్నారు. కానీ ఇప్పటికి చాలా మార్పులు, చేర్పులు జరిగాయి. పై రాష్ట్రాలు చాలావరకూ ప్రాజెక్టులు కట్టాయి. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి గోదావరి జలాలు అవసరం. ఆ తర్వాత కూడా నీటి లభ్యత ఉంటే ...నదుల అనుసంధానానికి అభ్యంతరం లేదు. కేంద్ర జలవనరుల శాఖ స్పెషల్ సెక్రటరీ నేతృత్వంలో రెండు రాష్ట్రాల మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశం అసమగ్రంగా, అస్పష్టంగా ముగిసింది. రెండు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినకూడదన్నదే మా అభిప్రాయం. రెండేళ్లుగా కృష్ణా రివర్ బోర్డు ఆదేశాలను అమలు చేస్తున్నాం. శ్రీశైలం నిర్వహణ ఏపీకి, నాగార్జున సాగర్ నిర్వహణ తెలంగాణకు తాత్కాలికంగా అప్పగించారు. అయినా కృష్ణా రివర్ బోర్డు ఆదేశాలనే అమలు చేస్తున్నారు. బోర్డు కేవలం రెగ్యులేట్ మాత్రమే చేస్తుందని పునర్విభజన చట్టం పేర్కొంది. ఇప్పటివరకూ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం పంపకాలు జరగలేదు. పంపకాల విషయం పెండింగ్‌లో ఉన్నప్పుడు కృష్ణా రివర్ బోర్డు ఎలా పని చేయగలదు. కాని ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ విచిత్ర వైఖరి ప్రదర్శిస్తోంది. ఏపీకి మూడు పంటలకు నీరు కావాలి, మాకు ఒక పంటకు కూడా వద్దా?.గోదావరిలో మాకు 90 టీఎంసీల హక్కు ఉంది. కేంద్రం మాకు ఇప్పటికీ అన్యాయం చేస్తూనే ఉంది. మాకు కర్ణాటక, మహారాష్ట్రతో సత్ సంబంధాలున్నాయి. అయినా... కృష్ణా రివర్ బోర్డు ఆదేశాలనే అమలు చేస్తున్నారు.' అని ఆయన మండిపడ్డారు. -
కృష్ణా వాటర్ బోర్డు సమావేశం
హైదరాబాద్ : కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు మరోసారి సమావేశమైంది. వాటర్ బోర్డు చైర్మన్ ఎస్కేజీ పండిత్ నేతృత్వంలో ఎర్రమంజిల్‌లోని జలసౌధలో గురువారం భేటీ అయ్యింది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ అధికారులు, సలహాదారులు హాజరయ్యారు. కాగా శ్రీశైలం జలాశయం నుంచి నీటి వినియోగ అంశంపై మధ్యేమార్గంలో వెళ్లాల్సిందిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు సూచించింది. అయితే ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవటంతో బోర్డు మళ్లీ సమావేశమైంది. -
మధ్యేమార్గం..!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కృష్ణా బోర్డు సూచన సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జలాశయం నుంచి నీటి వినియోగ అంశంపై మధ్యేమార్గంలో వెళ్లాల్సిందిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు సూచించింది. బుధవారమిక్కడ జలసౌధలో జరిగిన కృష్ణా బోర్డు సమావేశంలో ఈ మేరకు హితవు పలికింది. అయితే ఈ వివాదాన్ని మరింత జటిలం చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. శ్రీశైలం కేంద్రంలో విద్యుదుత్పత్తికి కనీస నీటిమట్టం 854 అడుగులు ఉండాలంటూ ఇప్పటివరకు వాదించిన ఏపీ సర్కారు.. కేసీ కెనాల్ సాగునీటి అవసరాల కోసం కనీస నీటిమట్టాన్ని మరికొంత పెంచాలంటూ కృష్ణా బోర్డు ముందు పంచాయతీ పెట్టింది. నిబంధనల ప్రకారం 834 అడుగుల వరకు నీటిని వినియోగించుకునే హక్కు తమకుందంటూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే గట్టి వాదన వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో బోర్డు సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. కనీస నీటిమట్టాన్ని పెంచాలని ఏపీ సర్కారు కోరగా... ఇది తెలంగాణను ఎడారిగా మార్చే కుట్రగా రాష్ర్ట ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఇప్పటికే ఉన్న జీవోలు తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయని, ఏపీ ప్రతిపాదనను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని పేర్కొన్నాయి. నాలుగు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాలు భిన్న వాదనలు వినిపించాయి. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో గురువారం పూర్తిస్థాయి బోర్డు సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. వర్కింగ్ గ్రూప్‌గా పేర్కొనే ఈ భేటీకి బోర్డు చైర్మన్ ఎస్కేజీ పండిత్, బోర్డు సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా, ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు మురళీధర్, వెంకటేశ్వర్రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మేట పెరుగుతోంది.. ఎత్తు పెంచాలి శ్రీశైలం, సాగర్ జలాల అంశాన్ని అధికారులు మొదట ప్రస్తావించారు. శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుత నీటి మట్టాలను సమీక్షించారు. గతంలో జారీ అయిన 69, 107, 233 జీవోలపై చర్చ జరిగింది. జీవో 107 ప్రకారం కనీస మట్టాన్ని 854 అడుగులుగా గుర్తించాలని ఏపీ వాదించింది. శ్రీశైలం దిగువన ప్రధాన కాల్వగా ఉన్న కేసీ కెనాల్లో 3 మీటర్ల మేర మేట వేసిందని, దీంతో నీటి ప్రవాహాలకు ఇబ్బందిగా ఉందని వివరించింది. ఈ దృష్ట్యా శ్రీశైలంలో కనీస నీటిమట్టాన్ని 854 అడుగుల నుంచి మరింత పెంచాలని కోరింది. ఎంత పెంచాలన్న దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దీనిపై తెలంగాణ అధికారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనట్లు తెలిసింది. 69, 107 జీవోలను తెలంగాణ ఉల్లంఘిస్తోందన్న ఏపీ వాదన సరికాదని, నిజానికి తర్వాత తెచ్చిన సవరణ జీవో 233 ప్రకారం పోతిరెడ్డిపాడు నీటి అవసరాలు తీరాక 834 అడుగుల వరకు నీటిని వాడుకోవచ్చునని వారు వాదించారు. పోతిరెడ్డిపాడు అవసరాలకు ఇప్పటికే నీటిని తరలించుకుపోయినందున తమకు 834 అడుగుల వరకు విద్యుదుత్పత్తి చేసుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు. విద్యుత్ పంపకాలకు సంబంధించి గతంలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 53కు చట్టబద్ధత లేదంటే, ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన 69, 107 జీవోలకూ చట్టబద్ధత ఉండదని తెలంగాణ అధికారులు తేల్చి చెప్పారు. ఇప్పటికే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 67 టీఎంసీల మేర నీటిని ఏపీ తరలించుకుపోయిందని, వాస్తవానికి ఆ రాష్ర్టం వాటా 34 టీఎంసీలేనని నొక్కి చెప్పారు. రోజుకో టీఎంసీ చొప్పున... కాగా, నిబంధనల మేరకు 834 అడుగుల వరకు నీటిని వినియోగించుకుంటామన్న తెలంగాణ వినతికి బోర్డు అభ్యంతరం తెలిపింది. వర్షాకాల సీజన్ పూర్తికాకముందే శ్రీశైలంలో కనీస నీటి మట్టం వరకు నీటిని వాడుకుంటే భ విష్యత్తులో సాగునీటి కొరతతో పాటు, విద్యుత్ సంక్షోభం తలెత్తే అవకాశమున్న దృష్ట్యా నీటి వినియోగంపై మధ్యేమార్గం అవలంబించాలని సూచించింది. శ్రీశైలంలో నవంబర్ 2 వరకు రోజుకో టీఎంసీ చొప్పున 3 టీఎంసీల నీటిని వాడుకొని విద్యుదుత్పత్తి చేసుకోవాలని పేర్కొంది. దీనివల్ల నీటి మట్టం కనీస స్థాయికి పడిపోదని, సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తెలిపింది. ఎస్ఆర్బీసీ తాగునీటి కష్టాలు కూడా తీరుతాయని పేర్కొంది. మూడు నాలుగు రోజుల అనంతరం శ్రీశైలంలో నిలిపివేసి, సాగర్‌లో విద్యుదుత్పత్తిని ప్రాంభించాలని సూచించింది. ఈ ఉత్పత్తి సైతం కష్ణా డెల్టాకు అవసరమైన రీతిలో సాగితే ఏపీకి సాగునీరు, తెలంగాణకు విద్యుత్ అందుతుందనే ప్రతిపాదనను తెచ్చింది. అయితే దీనిపై అధికారుల స్థాయిలో నిర్ణయం చెప్పలేమని, ప్రభుత్వంతో మాట్లాడి తమ వైఖరి చెబుతామని తెలంగాణ వర్గాలు స్పష్టం చే శాయి. మేం వాడుతోంది మా లెక్కలోకే.. శ్రీశైలం కింద తమకున్న నీటి లెక్కలను గణాంకాలతో సహా తెలంగాణ సర్కారు వివరించింది. శ్రీశైలంలో మొత్తంగా 97 టీఎంసీల నీటి వాటా ఉండగా.. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఎస్ఎల్బీసీ కింద తెలంగాణ వాడుకున్నది కేవలం 16.8 టీఎంసీలు మాత్రమేనని వెల్లడించింది. ఇక మొత్తం కృష్ణా జలాల్లో నికర జలాల కేటాయింపు 184.9 టీఎంసీలు కాగా, ఇందులో ప్రస్తుత సీజన్లో 109.3 టీఎంసీలు వాడుకున్నామని, ఇంకా 75.67 టీఎంసీలు వాడుకోవాల్సి ఉందని పేర్కొంది. మిగులు జలాల్లోనూ 77 టీఎంసీలకు గాను ఇప్పటికి 22 టీఎంసీలు వాడుకోగా.. మరో 53 టీఎంసీలు తమకు దక్కుతాయని కృష్ణా బోర్డుకు తెలిపింది. తమకు ఉన్న కేటాయింపుల మేరకే నీటిని వాడుకుంటున్నామని, ప్రస్తుతం వాడుతున్న నీటిని తమ ఖాతాలో చేర్చినా ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. అసలు బోర్డు పరిధి ఏంటి? బోర్డు పరిధి ఏంటన్న దానిపైనా కొద్దిసేపు చర్చ జరిగినట్లు తెలిసింది. కేవలం సాగునీటి ప్రాజెక్టులు మాత్రమే బోర్డు పరిధిలోకి వస్తాయని, అక్కడి నుంచి విద్యుదుత్పత్తి అంశం రాదని కొందరు లేవనెత్తినట్లుగా తెలిసింది. విద్యుత్ విషయం కేంద్ర, రాష్ట్ర పరిధిలోని ఉమ్మడి అంశమని, దీనిపై ఉండే వివాదాలు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ(సీఈఏ), రెగ్యులేటరీ కమిషన్ పరిధిలోకే వస్తాయని కొందరు అధికారులు అభిప్రాయపడ్డారు. నదీ జలాల బోర్డుకు దీంతో సంబంధమే లేదని ఈ భేటీ అనంతరం పేర్కొన్నారు.


