సర్వభ్రష్ట సర్కారు | KCR Fires On Congress Govt: Telangana | Sakshi
Sakshi News home page

సర్వభ్రష్ట సర్కారు

Dec 22 2025 2:24 AM | Updated on Dec 22 2025 2:24 AM

KCR Fires On Congress Govt: Telangana

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఫైర్‌

అబద్ధపు హామీలతో ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చింది 

నదుల అనుసంధానం పేరిట గోదావరి జల దోపిడీ జరుగుతున్నా పట్టించుకోవడం లేదు 

పాలమూరు ఎత్తిపోతలకు అన్యాయం జరుగుతున్నా స్పందించడం లేదు 

రెండేళ్లుగా ‘పాలమూరు’లో తట్టెడు మట్టి తీయకుండా ఎవరు అడ్డుకుంటున్నారు?  

చంద్రబాబు ఒత్తిడితోనే ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్రం వాపస్‌ పంపింది 

ఈ ప్రభుత్వానికి రియల్‌ ఎస్టేట్‌ దందా, కమీషన్లు కొట్టడం తప్ప వేరే పనిలేదా? 

సరిపడా సమయం ఇచ్చాం.. తెలంగాణ హక్కులకు ఒక్క నొక్కు పడినా సహించం 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టేందుకు త్వరలో కార్యాచరణ..భారీ ప్రజా ఉద్యమం 

జిల్లాల్లో బహిరంగ సభలు.. నేను స్వయంగా హాజరవుతా..

గ్లోబల్‌ సమ్మిట్‌లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ ప్రజలను ఎంతకాలం వంచిస్తారు? మేము ప్రజల ఆస్తుల విలువ పెంచితే ప్రస్తుతం భూముల ధరలు కుప్పకూలాయి.  

సాక్షి, హైదరాబాద్‌: ‘క్రమ పద్ధతిలో ముందుకు సాగుతున్న రాష్ట్రంలో ప్రజలను అబద్ధపు హామీలతో మోసగించి కాంగ్రెస్‌ అధికారంలోకి వచి్చంది. మాయమాటలతో అర్రాజ్‌ పాటలు పాడి చాంతాడంత హామీలు ఇవ్వడంతో ప్రజలు టెంప్ట్‌ అయ్యా రు. వంద శాతం సమ్మిళిత అభివృద్ధితో ముందుకు సాగుతున్న తెలంగాణలో బాండు పేపర్లు, గ్యారంటీ కార్డులు అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలకు శఠగోపం పెట్టారు. ఇది సర్వభ్రష్ట ప్రభుత్వం. నదుల అనుసంధానం పేరిట గోదావరి జలదోపిడీ, పాలమూరు ఎత్తిపోతలకు అన్యాయం జరుగుతున్నా స్పందించడం లేదు. కిరికిరి మాటలతో, కారు కూతలతో ప్రభుత్వం నడుపుతామంటే కుదరదు.

మాది తెలంగాణ తెచి్చన పార్టీ. ప్రధాన ప్రతిపక్షంగా మా విధి మేము నిర్వర్తించాలి. సర్కారుకు సరిపడినంత సమయం ఇచ్చాం. ఇవాళ్టి వరకు వేరు, రేపటి నుంచి వేరే.. తోలు తీస్తాం.. అందుకోసం నేను రంగంలోకి దిగుతున్నా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు భారీ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాం. మూడు నాలుగు రోజుల్లో ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లా నేతలతో సమావేశమై గ్రామ గ్రామాన డప్పు కొట్టి కార్యాచరణ ప్రకటిస్తాం.

ఆయా జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించి ప్రభుత్వ నిష్క్రియా పరత్వాన్ని ఎండగడ™తాం. కవులు, కళాకారులను తట్టి లేపి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ప్రశ్నిస్తాం. ఈ సభలకు నేను స్వయంగా హాజరవుతా..’ అని భారత్‌ రాష్ట్ర సమితి అధ్యక్షులు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గం, శాసనసభా పక్షం, పార్లమెంటరీ పార్టీ, ఇతర కీలక నేతలతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను రెండేళ్లుగా గమనిస్తున్నాం.. 
    ‘పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో తట్టెడు మట్టి తీయకుండా రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న ని్రష్కియా పరత్వం, కేంద్రం వ్యతిరేకిస్తున్న తీరును రెండేళ్లుగా గమనిస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడేది లేదు. తెలంగాణ ప్రజల కోసమే పుట్టిన బీఆర్‌ఎస్‌..తెలంగాణ హక్కులకు ఒక్క నొక్కు పడినా, ఒక్క చుక్క నష్టం జరిగినా సహించేది లేదు.    

తెలంగాణకు శనిలా బీజేపీ 
    కేంద్రంలో ఎన్‌డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఒత్తిడితో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను వెనక్కి పంపారు. పర్యావరణ అనుమతులతో పాటు ఇతర ప్రధాన అనుమతులు సాధించినా బీజేపీ దిగజారి తెలంగాణకు శనిలా మారింది. మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టు డీపీఆర్‌ను వెనక్కి పంపి ఆగం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందన లేకుండా పెదవులు మూసుకుంది.

మైనర్‌ ఇరిగేషన్‌ నష్టాలు, ఏపీ పట్టిసీమ ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాల తరలింపుతో కృష్ణాలో తెలంగాణకు దక్కిన 45 టీఎంసీలను కలుపుకొని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 90.81 టీఎంసీలు కేటాయించాం. కానీ నీటిపారుదల శాఖ మంత్రి 45 టీఎంసీలు చాలని లేఖ రాశారు. గోదావరి జలాల తరలింపుతో కృష్ణాలో ఏపీ వదులుకున్న జలాలను ఎగువన కర్ణాటక, మహారాష్ట్ర వాడుకుంటుంటే తెలంగాణ ప్రభుత్వం నిద్రపోతోంది. రెండేళ్లుగా పాలమూరు ప్రాజెక్టులో తట్టెడు మట్టెడు తీయకుండా ఎవరు అడ్డుకుంటున్నారు? ఈ ప్రభుత్వానికి రియల్‌ ఎస్టేట్‌ దందా, కమీషన్లు కొట్టడం తప్ప వేరే పనిలేదా?..’ అని కేసీఆర్‌ మండిపడ్డారు. 

మేం పెండింగు ప్రాజెక్టులను రన్నింగ్‌ ప్రాజెక్టులుగా మార్చాం.. 
    ‘సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, టీడీపీ పాలనలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కోలుకోలేని రీతిలో దెబ్బతింది. నాటి సీఎం చంద్రబాబు జిల్లాను దత్తత తీసుకున్నా జూరాలలో ముంపునకు గురైన కర్ణాటక భూమికి రూ.13 కోట్లు పరిహారం ఇవ్వలేదు. గోదావరి నదిపై దేవునూరు, ఇచ్చంపల్లి తదితర ప్రాజెక్టులకు ఉమ్మడి ఏపీలో అన్యాయం చేసిన రీతిలోనే కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న మహబూబ్‌నగర్‌ జిల్లాకు నష్టం చేశారు. 17 టీఎంసీలతో మంజూరైన జూరాల ప్రాజెక్టు దశాబ్దాల తరబడి కనీసం ఫౌండేషన్‌కు నోచుకోలేదు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం తర్వాత.. చంద్రబాబు మోకాళ్ల మీద పరుగెత్తి పరిహారం చెల్లించడంతో జూరాల ప్రాజెక్టు ఆయకట్టు సాగులోకి వచి్చంది.

రాజోలిబండ మళ్లింపు పథకం కోసం ఆలంపూర్, గద్వాల వరకు పాదయాత్ర చేశా. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 308 కిలోమీటర్ల మేర కృష్ణా ప్రవహిస్తున్నా నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి తదితర పథకాలను పెండింగులో పెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే పెండింగు ప్రాజెక్టులను పూర్తి చేసి రన్నింగ్‌ ప్రాజెక్టులుగా మార్చాం. పాలమూరు ఎత్తిపోతల పథకానికి 170కి పైగా టీఎంసీలు తీసుకోవాలనే వ్యూహంతో తొలుత 90.81 టీఎంసీలు కేటాయించాం. అనేక అవాంతరాలు ఎదురైనా అనుమతులు సాధించాం. రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి 90 శాతం పనులు పూర్తి చేశాం..’ అని బీఆర్‌ఎస్‌ అధినేత వెల్లడించారు. 

హైప్‌ క్రియేట్‌ చేయడంలో గురువు చంద్రబాబు 
    ‘బిజినెస్‌ మీట్‌ల పేరిట హైప్‌ క్రియేట్‌ చేయడంలో గురువు చంద్రబాబు. ఏపీలో చంద్రబాబు హోటల్‌లో పనిచేసే వంట మనుషులతో ఎంఓయూలపై సంతకాలు పెట్టించారు. ఆయన చెప్పిన లెక్కలు నిజమైతే ఈ పాటికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేవి. ఒప్పందాలు నిజమైతే కనీసం రూ.10 వేల కోట్లయినా రావాలి కదా. గతంలో నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొనేందుకు భోపాల్‌కు వెళ్లిన సందర్భంలో ప్రధాని మోదీ సమక్షంలో కుదిరిన రూ.14 లక్షల కోట్ల ఎంఓయూలు బోగస్‌ అని ఆ రాష్ట్ర మంత్రి చెప్పారు. పెట్టుబడులపై అబద్ధపు ప్రకటనలు, ఒప్పందాలతో ప్రజలను మోసం చేయడం ఎందుకు?..’ అని కేసీఆర్‌ ప్రశ్నించారు. 

ఫ్యూచర్‌ సిటీ పేరిట రియల్‌ ఎస్టేట్‌ దందా 
    ‘ఫార్మా రంగానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని కాలుష్య రహిత ఫార్మాసిటీ ఏర్పాటు కోసం ముచ్చర్లలో మేం 14 వేల ఎకరాలు సేకరించాం. పర్యావరణ అనుమతులు కూడా సాధించి ముందుకు సాగుతున్న క్రమంలో ప్రభుత్వం మారింది. కానీ ఫ్యూచర్‌ సిటీ పేరిట భూములను అమ్ముకునేందుకు రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ దందాకు తెరలేపారు. గురుకుల పాఠశాల విద్యార్థుల ప్రాణాలను కాపాడలేని ప్రభుత్వం ఫార్మాసిటీ భూములను అమ్ముకునేందుకు ఉత్సాహం చూపుతోంది.

వంతారాకు 3 వేల ఎకరాలు, జూపార్కు తరలింపు భూముల అమ్మకం కోసమేనా? గ్లోబల్‌ సమ్మిట్‌లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ ప్రజలను ఎంత కాలం వంచిస్తారు? యాప్‌ ద్వారా యూరియా అంటూ రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారు. మేము ప్రజల ఆస్తుల విలువ పెంచితే ప్రస్తుతం భూముల ధరలు కుప్పకూలాయి. అడ్డమైన హామీలు ఇచ్చి రైతులు, పేదలు, విద్యార్థులు, రిటైర్డ్‌ ఉద్యోగులను ఏడిపిస్తున్నారు. సందర్భం ఏదైనా కేసీఆర్‌ చనిపోవాలి అంటూ మాట్లాడటం కరెక్టేనా?..’ అని కేసీఆర్‌ నిలదీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement