హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. జనవరి 2వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నామని, కృష్ణా జాలాలపై ఒక రోజు, గోదావరి జలాలపై మరో రోజు చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈరోజు( ఆదివారం, డిసంబర్ 21 వ తేదీ) కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించారు.
మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. తెలంగాణకు ద్రోహం చేసింది కేసీఆరేనన్నారు. కేసీఆర్ హయాంలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయలేదని, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఆయనే దెబ్బ తీశారన్నారు. కేసీఆర్ వస్తే ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులను చూపిస్తామన్నారు. కృష్ణా జలాల్లో 36 శాతం వాటా అంగీకరించింది కేసీఆర్ మాత్రమేనని, 71 శాతం వాటా కోసం తాము పోరాడుతున్నామన్నారు.
కాగా, తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తుందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ఉద్ఘాటించారు. ఈరోజు( ఆదివారం, డిసంబర్ 21వ తేదీ) బీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశం తెలంగాణ భవన్‌లో జరిగింది. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం ఇదే విషయాన్ని కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. తాము నిర్వహించిన సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించామన్నారు.
ఇందులో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న ద్రోహాన్ని ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. దాదాపు 8 నెలల తర్వాత మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్ మాట్లాడుతూ.. కృష్ణా జలాల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీపడింది. ఈ ప్రభుత్వం 45 టీఎంసీలకే కేంద్రం దగ్గర అంగీకరించింది. దీన్ని నిరసిస్తూ జిల్లా, మండల స్థాయిలో నిరసనలు తెలపాలని నిర్నయించాం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపైనా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాం. దీనిపైనే ప్రధానంగా చర్చించాం.
రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న ద్రోహం గురించి చర్చించాం. మహబూబ్‌నగర్ జిల్లాలో 308 కి.మీ మేర కృష్ణా నది ప్రవహిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లా వివక్షకు గురైంంది. పాలమూరు గురించి గరెటడు నీళ్లు అడిగే వాడే లేడు. ఏపీ ఏర్పాటుతో మహబూబ్‌నగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. పాలప్రతిపాదిత ప్రాజెట్టులు మార్చొద్దని ఎస్‌ఆర్‌సీ స్పష్టంగా చెప్పింది.
గతంలో చంద్రబాబు మహబూబ్‌నగర్ జిల్లాను దత్తత తీసుకున్నారు. ఆయన ఇష్టమొచ్చినట్లు పునాది రాళ్లు వేశారు. పాలమూరు ప్రాజెక్టు అనేది ఎత్తిపోతల ప్రాజెక్టు కాదు. గతంలోనే నీటి కేటాయింపులు జరిగాయి. అయినా పాలమూరు జిల్లాలో విపరీతమైన కరువు. కేంద్రం, రాష్ట్రం కలిసి అన్యాయం చేశాయి’ అని కేసీఆర్ విమర్శించారు


