
ప్రతికూల వాతావరణ మార్పులు వ్యవసాయానికి, ముఖ్యంగా వ్యవసాయాధార దేశమైన మనకు, పెద్ద సవాలుగా మారింది. గడచిన 16 నెలలు గతమెన్నడూ ఎరుగని రీతిలో విపరీత వాతావరణ పరిస్థితులు ముఖ్యంగా పగలు / రాత్రి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయి. ఈ ఫలితంగా అనేక పంటలు సాగులో సవాళ్లు పెరిగిపోయాయి. ఈ పూర్వరంగంలో విపరీత వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలబడి, మంచి దిగుబడులను ఇచ్చే విత్తనాలు (క్లైమెట్ రిసైలియంట్ సీడ్స్) మన రైతులకు అందించటం వారి జీవనోపాధి/ ఆదాయ భద్రతకు, దేశానికి ఆహార భద్రతకు అత్యంత కీలకంగా నిలిచాయి.
అటువంటి అపురూప దేశీ వంగడాలు, 71 రకాల పంటలకు సంబంధించిన, 887 మన దేశంలోని 15 రాష్ట్రాల్లో ఇప్పటికీ రైతుల దగ్గర ఉన్నాయని న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సిఎస్‌ఇ) నిర్వహించిన అధ్యయనం తేల్చింది. భేషైన పాత పంటల వంగడాలు అందుబాటులో ఉన్నాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది. కరువును, అధిక ఉష్ణోగ్రతలను, చీడపీడలను, నీటి ముంపును, పెనుగాలులను, చౌడును తట్టుకొనే గుణాలు ఈ దేశీ వంగడాలకు పుష్కలంగా ఉన్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది.
విత్తన సంరక్షకులు, సామాజిక విత్తన బ్యాంకులు (కమ్యూనిటీ సీడ్ బ్యాంక్‌లు– సిబిఎస్‌లు) వీటిని ప్రతి ఏటా సాగు చేస్తూ పరిరక్షిస్తున్నాయని సిఎస్‌ఎ అధ్యయనంలో తేలింది. క్లైమెట్ ఛేంజ్‌ని ఎదుర్కొనే క్రమంలో ప్రభుత్వం కమ్యూనిటీ సీడ్ బ్యాంక్‌లను పూర్తిస్థాయిలో ప్రోత్సహిస్తే ప్రకృతి సేద్యానికి కూడా దోహదమవుతుందని సిఎస్‌ఎ తెలిపింది. దేశీ వంగడాలు ఇప్పటికీ ఎప్పటికీ ఎంత ప్రాణవసరమో తెలియజెప్పడానికి ఈ అధ్యయనం వెలుగులోకి తెచ్చిన అపురూప సమాచారంతో కూడిన కథనం..


విపరీత వాతావరణ పరిస్థితుల్ని దీటుగా తట్టుకొని మంచి దిగుబడులనిచ్చే వంగడాలు అని అనగానే జున్యుమార్పిడి, జన్యుసవరణ వంటి అత్యాధునిక ప్రజనన (బ్రీడింగ్) పద్ధతుల్లో తయారు చేస్తున్న సరికొత్త వంగడాలే మనల్ని ఆదకోగలవు అన్న అభి్రపాయం కలుగుతుంది. అయితే, వాతావరణ మార్పుల్ని దీటుగా తట్టుకునే అపురూప దేశీ వంగడాలు (పాత పంటలు) చాలానే మన రైతుల దగ్గర అనాదిగా సాగులో ఉన్నాయని భారతీయ సుసంపన్న వ్యవసాయక వారసత్వ పటిమను ఎరిగిన వారు చెబుతున్నారు. దేశీ విత్తనాలు కొల్లలుగా ఉన్నప్పటికీ, వాటిలో ఆధారపడదగిన గణాంకాలతో కూడిన ఆధారాలనున్న పాత పంటలు ఎన్ని అనేది ఖచ్చితంగా తెలీదు.
ఈ లోటు తీర్చటం కోసం న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సిఎస్‌ఇ) తాజాగా ఓ అధ్యయనం చేసి మంచి పని చేసింది. 71 రకాల పంటలకు సంబంధించిన 887 దేశీ వంగడాలు భేషైన పాత పంటల వంగడాలు అందుబాటులో ఉన్నాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది. అయితే, నిజానికి వాతావరణ ప్రతికూలతల్లోనూ దిగుబడినిస్తున్న పాత పంటల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని, తాము సేకరించగలిగింది కేవలం 15 రాష్ట్రాల్లో కొన్ని సంస్థలు, కొందరు విత్తన సంరక్షకుల వద్ద గల సమాచారాన్ని మాత్రమేనని సిఎస్‌ఇ ప్రకటించింది.

కమ్యూనిటీ సీడ్ బ్యాంక్ అంటే?
వాతావరణ మార్పు నేపథ్యంలో, ఆహార భద్రత మరియు సార్వభౌమత్వాన్ని ఆధారం చేసుకునే జీవవైవిధ్యం వేగంగా నష్టపోవడాన్ని మనం చూస్తున్నాం. తరతరాలుగా సమాజాలను పోషించిన సాంప్రదాయ పంట రకాలు మన పోలాల నుంచి, మన ఆహారం నుంచి క్రమంగా కనుమరుగవుతున్నాయి. వాతావరణ మార్పుల ముప్పు ఉన్న ప్రపంచంలో వ్యవసాయానికి, రైతులకు వెన్నుదన్నుగా నిలవడానికి అవసరమైన విత్తనాలను రక్షించడంలో కమ్యూనిటీ సీడ్ బ్యాంకులు (సిబిఎస్‌లు) లేదా సామాజిక విత్తన బ్యాంకులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
సామాజిక విత్తన బ్యాంకులు అనేవి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఒక రకమైన వికేంద్రీకృత జన్యు బ్యాంకులు. స్థానిక రైతు సంఘాలు, స్వయం సహాయక బృందాలు, లాభాపేక్షలేని సంస్థలు, మహిళలు వీటిని నిర్వహిస్తున్నారు. దేశీయ విత్తనాలను, విపరీత వాతావరణ ప్రభావాలను దీటుగా తట్టుకొని నిలిచే విత్తనాలను అనాదిగా ఏటేటా రైతుల ద్వారా సాగు చేయిస్తూ, అవి కాలగర్భంలో కలసిపోకుండా పరిరక్షించటం సామాజిక విత్తన బ్యాంకుల ప్రాథమిక ఉద్దేశ్యం. ఈ విత్తనాలను పరిరక్షించటంతో పాటు వాటి ఉపయోగాలు, ఔషధ గుణాల గురించిన సంప్రదాయ విజ్ఞానాన్ని కూడా సంరక్షించడం వీటి లక్ష్యం.
ఉదాహరణకు, మన దేశంలో కరువు పరిస్థితుల్లో, ఉప్పు నీటిలో పెరిగే వరి రకాలు ఉన్నాయి. మనకు అధిక వేడిని తట్టుకునే కూరగాయల రకాలు ఉన్నాయి. ఈ వంగడాలను సంరక్షించడంలో, వాటిని రైతులకు అందుబాటులో ఉంచడంలో సామాజిక విత్తన బ్యాంకులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. అయితే, వాటికి ఇంత ప్రాముఖ్యత ఉన్నప్పటికీ, వాటిపై అవగాహన లేకపోవడం, ప్రభుత్వ విధానాల మద్దతు పరిమితంగా ఉండటం, ఆర్థిక సవాళ్ల కారణంగా అవి తగినంత గుర్తింపు పోందటం లేదు.
దేశంలోని వివిధ రాష్ట్రాలలో సామాజిక విత్తన బ్యాంకుల్లో అందుబాటులో ఉన్న అపారమైన వైవిధ్యాన్ని మ్యాప్ చేయడానికి, డాక్యుమెంట్ చేయడానికి సిఎస్‌ఇ చేసిన ఒక ప్రయత్నమే ఈ నివేదిక. శుభవార్త ఏమిటంటే, మనకు ఇప్పటికీ వ్యవసాయక సమాజాలు సంరక్షిస్తున్న సాంప్రదాయ పాత పంట రకాలు విస్తృత శ్రేణిలో ఉన్నాయి. వీటిలో ధాన్యాలు, పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాలు, కూరగాయలు, నూనె గింజలు, తదితర రకాల పంటల విత్తనాలు ఉన్నాయి. ఈ అపురూప పాత పంట విత్తనాలను, వాటిని సంరక్షించే సంఘాలను మనం కాపాడుకోవాలి.