‘నానో’ మ్యాజిక్‌ తక్కువ ఎరువు  ఎక్కువ దిగుబడి! | Nanofertilizers are a new generation of fertilizers that utilize advanced nanotechnology | Sakshi
Sakshi News home page

‘నానో’ మ్యాజిక్‌ తక్కువ ఎరువు  ఎక్కువ దిగుబడి!

Nov 18 2025 4:08 AM | Updated on Nov 18 2025 4:08 AM

Nanofertilizers are a new generation of fertilizers that utilize advanced nanotechnology

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రోజ్మేరీ పంటపై అతి సూక్ష్మ ఎరువుల తొలి ప్రయోగం విజయవంతం

నానో–ఫెర్టిలైజర్‌ (అతి సూక్ష్మ లేదా నానో రసాయనిక ఎరువుల) సాంకేతికతను అభివృద్ధి చేసిన హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పరిశోధకులు

పంట మొక్కల మొదళ్ల దగ్గర వేసే సాధారణ రసాయనిక ఎరువుల్లో 30 శాతమే పంటలకు ఉపయోగపడుతుంటే, 70% ఎరువులు నేల పాలవుతున్నాయి. రైతుల డబ్బు వృథా కావటంతో పాటు ఇవి నేలను, నీటిని, గాలిని కలుషితం చేస్తున్నాయి. అయితే, దీన్ని సమూలంగా మార్చేసే అవకాశం ఉందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 

నేలపై వేసే యూరియా వంటి ఎన్‌పీకే (రసాయనిక) ఎరువులనే అతి సూక్ష్మ కణాల ఎన్‌పీకే పొడిగా మార్చి, నేలపై వెయ్యకుండా, నీటిలో కలిపి పిచికారీ చేస్తే.. ప్రామాణిక మోతాదులో కేవలం 20–30% నానో ఎరువులతోనే అధిక దిగుబడులు సాధించవచ్చు. 

80–70% ఎరువులను నికరంగా ఆదాయ చెయ్యవచ్చు. ఎరువుల ఖర్చును తగ్గించుకోవటంతో పాటు పనిలో పనిగా పర్యావరణ కాలుష్యాన్ని, నేల ఆరోగ్యాన్ని, భూతాపాన్ని కూడా తగ్గించుకోవచ్చు. అయితే, అతి సూక్ష్మ రసాయనిక ఎరువులతో దీర్ఘకాలంలో దుష్ఫలితాలేమీ లేవని నిర్ధారించే పరీక్షలు ఇంకా చెయ్యాల్సి ఉంది. ఆ తర్వాతే ఈ టెక్నాలజీ రైతులకు అందుబాటులోకి వస్తుందని ఈ పరిశోధనలో కీలకపాత్ర పోషిస్తున్న ప్రొ. శ్రీకాంత్‌ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు.

‘నానో ఫెర్టిలైజర్‌ లేదా అతి సూక్ష్మ రసాయనిక ఎరువులు’ అనగానే సీసాల్లో నింపి అమ్ము­తున్న నానో ద్రవ రూప ఎరు­వులు చప్పున గుర్తొస్తాయి. అయితే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది వాటి గురించి కా­దు. మామూలుగా మన రైతులు గుప్పిళ్లతో పొలాల్లో వెదజల్లే తెల్లని యూరియా, ఫాస్పరస్, డీఏపీ వంటి గుళికల రసాయనిక ఎరువుల గురించే. గుళికల రూపంలో ఉండే వీటిని అతి సూక్ష్మ కణాల పొడిగా మార్చితే అవి ‘నానో ఎరువులు’ అవుతాయి. 

ఈ పొడిని నీటితో కలిపి పంటలపై పిచికారీ చేస్తే.. వ్యవసాయ శాస్త్రవేత్తలు పంటలకు సిఫారసు చేసే రసాయనిక ఎరువుల మోతాదులో 20–30% అతిసూక్ష్మ ఎరువులతోనే సాధారణం కన్నా అధిక దిగుబడి సాధించవచ్చని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పరిశోధకులు రుజువు చేశారు. 

ఎన్‌పీకే స్థూల ఎరువులతో పాటు ఐరన్, జింక్‌ తదితర సూక్ష్మపోషక ఘనరూప ఎరువులను సైతం పొడిగా మార్చి, నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేసి సత్ఫలితాలు సాధించవచ్చు అంటున్నారు. స్కూల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీకి చెందిన ప్రొఫెసర్‌ వీవీఎస్‌ఎస్‌ శ్రీకాంత్‌ తదితర పరిశోధకుల బృందం నానో–ఎరువుల రూపకల్పన, తయారీపై పనిచేసింది. మొక్కల ఎదుగుదల తీరుపై ప్లాంట్‌ సైన్సెస్‌ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ పొదిలె అప్పారావు బృందం అధ్యయనం చేసింది. 

అతి సూక్ష్మ ఎరువుల ప్రయోజనాలు 3:
∙ఎరువుల మోతాదులో 20–30% చాలు
∙80–70% తగ్గనున్న ఎరువుల ఖర్చు 
∙నేల, నీరు, గాలి కాలుష్యానికి చెక్‌!

రోజ్మేరీపై నెలకోసారి పిచికారీ
రోజ్మేరీ (రోస్మరినస్‌ అఫిసినాలిస్‌) ప్రపంచవ్యాప్తంగా విస్తృ­తంగా వాడుకలో ఉన్న విలువైన సుగంధ నూనె  పంట. రోజ్మేరీ నూనెను ఆహారం, సౌందర్య సాధనాలు, ఔష­ధ పరిశ్రమల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. అయితే, సా­ధారణంగా అధికంగా రసాయనిక ఎరువుల వాడకంతో అధిక ఖర్చుతో పాటు పర్యావరణానికి హాని కలుగుతోంది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పరిశోధకులు ప్ర­త్యేక డిజైన్‌తో రూపొందించిన యంత్రంలో సాధారణ ఎన్‌పీకే ఎరువులను వేసి, నానో ఎరువుల పొడిగా మార్చారు. 

ఎన్‌పీకే ఎరువులతో పాటు ఇనుము, జింక్, మాంగనీస్, రాగి సహా కీలకమైన సూక్ష్మ పోషకాలను కూడా అతి సూ­క్ష్మ పొడిగా మార్చి వాడారు. గ్రీన్‌హౌస్‌లో కుండీల్లో పెరిగే రోజ్మేరీ మొక్కలపై 3 నెలల పంట కాలంలో నెలకోసారి పిచికారీ చేశారు. సాధారణ ఎరువుల గుళికలను నేలపై వేసినప్పటితో పోల్చితే, పిచికారీ చేసిన నానో పొడిలోని పోషకాలను మొక్కలు ఆకుల ద్వారా చాలా మెరుగ్గా ఉపయోగించుకున్నట్లు గుర్తించారు. 

రోజ్మేరీ పంట సాగులో సాధారణంగా హెక్టారుకు ఏడాదిలో 100–300 కిలోల ఎన్‌పీకే ఎరువులు వాడతారు. అయితే, రోజ్మేరీ మొక్కలకు ప్రామాణిక ఎరువుల మోతాదులో 20–30% పరిమాణంలోనే నానో ఎరువుల పొడిని వాడారు. అయినా మొక్కలు, వేర్ల పెరుగుదల మెరుగ్గా ఉంది. అతి సూక్ష్మ రూపంలోని రసాయనిక ఎరువుల కణాలను ఆకులు సులువుగా గ్రహించటం వల్ల సమర్థవంతంగా పోషక శోషణ జరిగింది. జీవక్రియ మెరుగ్గా జరిగింది.

 ఫలితంగా అధిక నూనె దిగుబడి వచ్చింది. నూనె నాణ్యత, సుగంధ స్థాయి అధికంగా వచ్చింది. ఈ పరిశోధన ఫలితాలు ‘ఇండస్ట్రియల్‌ క్రాప్స్‌–ప్రొడక్ట్స్‌’ శాస్త్రీయ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమయ్యాయి. ఈ విధానాన్ని మార్కెట్‌లో అధిక విలువ కలిగిన అనేక ఔషధ, సుగంధ పంటలకు కూడా అన్వయించవచ్చని పరిశోధకులు విశ్వసిస్తున్నారు. 

మీటరులో 100 కోట్ల వంతు!
సాధారణంగా రైతులు వాడే డీఏపీ, ఎన్‌పీకే వంటి రసాయనిక ఎరువుల గుళికలు మైక్రోమీటర్ల (మీటరులో పది లక్షల వంతు) సైజులో ఉంటాయి. ఇఫ్‌కో నుంచి సా«­దా­రణ 19:19:19 ఎన్‌పీకే, మైక్రో–న్యూట్రియంట్‌ మిక్స్‌ (ఉత్కర్ష్‌ కాంబి–2)లను కొనుగోలు చేశారు. వీటిని హై–ఎనర్జీ షేకర్‌ మిల్లులో వేసి నానో ఎరువుల పొడిని తయారు చేశారు. నానో ఎరువుల కణాలు మీటరులో 100 కోట్ల వంతు సైజులో అతి సూక్ష్మంగా ఉంటాయి. నానో ఎరువుల బయో ఎవైలబిలిటీ (జీవ లభ్యత) ఎక్కువ.

 నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేసినప్పుడు పత్ర రంధ్రాల ద్వారా ఈ పోషకాలు నేరుగా మొక్క సులువుగా, సమర్థవంతంగా తీసుకోగలుగుతుంది. నేలలో వేసిన సాధారణ ఎరువుల్లో పోషకాలను వేర్ల ద్వారా గ్రహించగలిగే దానికన్నా, పిచికారీ చేసిన నానో ఎరువుల పోషకాలను చాలా సులువుగా, మెరుగ్గా పంట మొక్కలు తీసుకోగలుగుతాయి. వ్యవసాయ, ఉద్యాన శాస్త్రవేత్తలు సిఫారసు చేసే మోతాదులో 20 నుంచి 30% అతి సూక్ష్మ ఎరువులతోనే అధిక దిగుబడి తీయటం సాధ్యమవుతుందని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు.                 

దీర్ఘకాలిక ప్రభావాలపై పరీక్షలు చెయ్యాల్సి ఉంది
వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించే ప్రామాణిక రసాయనిక ఎరువుల పరిమాణంలో 20–30% నానో ఎరువులు æ వాడితే అధిక దిగుబడులు సాధించవచ్చు. అతి సూక్ష్మ కణాలతో కూడి ఉన్నందున నానో ఎరువులు తక్కువ మోతాదుతోనే అధిక ఫలితాన్ని ఇస్తాయి. నేల, నీటి వ్యవస్థలపై ఒత్తిడిని తగ్గిస్తాయి. సాధారణ రసాయనిక ఎరువులను ఉపయోగించి నానో ఎరువులను తయారు చేశాం. మా యూనివర్సిటీ ప్రయోగశాలలో నియంత్రిత వాతావరణంలో కుండీల్లో రోజ్మేరీ మొక్కలపై ప్రయోగాత్మకంగా నానో ఎరువులు వాడాం.  

దాంతో పాటు రోజ్మేరీ నూనె దిగబడితో పాటు నాణ్యత కూడా పెరిగింది. అయితే, రైతులకు ఈ సాంకేతికత అందించడానికి ముందు మరికొన్ని పరీక్షలు చెయ్యాల్సి ఉంది. నానో ఎరువుల వల్ల దీర్ఘకాలిక పర్యావరణ, ఆరోగ్య ప్రభావాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవడానికి అంతర్జాతీయ మార్గదర్శకాలు, కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం కఠినమైన పరీక్షలు ఇంకా చెయ్యాల్సి ఉంది. నానోటెక్నాలజీ అనూహ్యంగా ఎటు వంటి హానీ చెయ్యదని, వ్యవసాయానికి నిజంగా ప్రయోజనం చేకూరుస్తుందని ఆధార సహితంగా నిర్ధారించుకోవటానికి ఈ పరీక్షలు ముఖ్యం. ఆ తదనంతరం నానో ఎరువుల సాంకేతికతను రైతుల వద్దకు తీసుకువెళ్తాం. 
– ప్రొఫెసర్‌ వీవీఎస్‌ఎస్‌ శ్రీకాంత్, స్కూల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ,యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌
 
– పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement