breaking news
useful
-
‘నానో’ మ్యాజిక్ తక్కువ ఎరువు ఎక్కువ దిగుబడి!
పంట మొక్కల మొదళ్ల దగ్గర వేసే సాధారణ రసాయనిక ఎరువుల్లో 30 శాతమే పంటలకు ఉపయోగపడుతుంటే, 70% ఎరువులు నేల పాలవుతున్నాయి. రైతుల డబ్బు వృథా కావటంతో పాటు ఇవి నేలను, నీటిని, గాలిని కలుషితం చేస్తున్నాయి. అయితే, దీన్ని సమూలంగా మార్చేసే అవకాశం ఉందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. నేలపై వేసే యూరియా వంటి ఎన్పీకే (రసాయనిక) ఎరువులనే అతి సూక్ష్మ కణాల ఎన్పీకే పొడిగా మార్చి, నేలపై వెయ్యకుండా, నీటిలో కలిపి పిచికారీ చేస్తే.. ప్రామాణిక మోతాదులో కేవలం 20–30% నానో ఎరువులతోనే అధిక దిగుబడులు సాధించవచ్చు. 80–70% ఎరువులను నికరంగా ఆదాయ చెయ్యవచ్చు. ఎరువుల ఖర్చును తగ్గించుకోవటంతో పాటు పనిలో పనిగా పర్యావరణ కాలుష్యాన్ని, నేల ఆరోగ్యాన్ని, భూతాపాన్ని కూడా తగ్గించుకోవచ్చు. అయితే, అతి సూక్ష్మ రసాయనిక ఎరువులతో దీర్ఘకాలంలో దుష్ఫలితాలేమీ లేవని నిర్ధారించే పరీక్షలు ఇంకా చెయ్యాల్సి ఉంది. ఆ తర్వాతే ఈ టెక్నాలజీ రైతులకు అందుబాటులోకి వస్తుందని ఈ పరిశోధనలో కీలకపాత్ర పోషిస్తున్న ప్రొ. శ్రీకాంత్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు.‘నానో ఫెర్టిలైజర్ లేదా అతి సూక్ష్మ రసాయనిక ఎరువులు’ అనగానే సీసాల్లో నింపి అమ్ముతున్న నానో ద్రవ రూప ఎరువులు చప్పున గుర్తొస్తాయి. అయితే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది వాటి గురించి కాదు. మామూలుగా మన రైతులు గుప్పిళ్లతో పొలాల్లో వెదజల్లే తెల్లని యూరియా, ఫాస్పరస్, డీఏపీ వంటి గుళికల రసాయనిక ఎరువుల గురించే. గుళికల రూపంలో ఉండే వీటిని అతి సూక్ష్మ కణాల పొడిగా మార్చితే అవి ‘నానో ఎరువులు’ అవుతాయి. ఈ పొడిని నీటితో కలిపి పంటలపై పిచికారీ చేస్తే.. వ్యవసాయ శాస్త్రవేత్తలు పంటలకు సిఫారసు చేసే రసాయనిక ఎరువుల మోతాదులో 20–30% అతిసూక్ష్మ ఎరువులతోనే సాధారణం కన్నా అధిక దిగుబడి సాధించవచ్చని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధకులు రుజువు చేశారు. ఎన్పీకే స్థూల ఎరువులతో పాటు ఐరన్, జింక్ తదితర సూక్ష్మపోషక ఘనరూప ఎరువులను సైతం పొడిగా మార్చి, నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేసి సత్ఫలితాలు సాధించవచ్చు అంటున్నారు. స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీకి చెందిన ప్రొఫెసర్ వీవీఎస్ఎస్ శ్రీకాంత్ తదితర పరిశోధకుల బృందం నానో–ఎరువుల రూపకల్పన, తయారీపై పనిచేసింది. మొక్కల ఎదుగుదల తీరుపై ప్లాంట్ సైన్సెస్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ పొదిలె అప్పారావు బృందం అధ్యయనం చేసింది. అతి సూక్ష్మ ఎరువుల ప్రయోజనాలు 3:∙ఎరువుల మోతాదులో 20–30% చాలు∙80–70% తగ్గనున్న ఎరువుల ఖర్చు ∙నేల, నీరు, గాలి కాలుష్యానికి చెక్!రోజ్మేరీపై నెలకోసారి పిచికారీరోజ్మేరీ (రోస్మరినస్ అఫిసినాలిస్) ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వాడుకలో ఉన్న విలువైన సుగంధ నూనె పంట. రోజ్మేరీ నూనెను ఆహారం, సౌందర్య సాధనాలు, ఔషధ పరిశ్రమల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. అయితే, సాధారణంగా అధికంగా రసాయనిక ఎరువుల వాడకంతో అధిక ఖర్చుతో పాటు పర్యావరణానికి హాని కలుగుతోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రత్యేక డిజైన్‌తో రూపొందించిన యంత్రంలో సాధారణ ఎన్పీకే ఎరువులను వేసి, నానో ఎరువుల పొడిగా మార్చారు. ఎన్పీకే ఎరువులతో పాటు ఇనుము, జింక్, మాంగనీస్, రాగి సహా కీలకమైన సూక్ష్మ పోషకాలను కూడా అతి సూక్ష్మ పొడిగా మార్చి వాడారు. గ్రీన్హౌస్లో కుండీల్లో పెరిగే రోజ్మేరీ మొక్కలపై 3 నెలల పంట కాలంలో నెలకోసారి పిచికారీ చేశారు. సాధారణ ఎరువుల గుళికలను నేలపై వేసినప్పటితో పోల్చితే, పిచికారీ చేసిన నానో పొడిలోని పోషకాలను మొక్కలు ఆకుల ద్వారా చాలా మెరుగ్గా ఉపయోగించుకున్నట్లు గుర్తించారు. రోజ్మేరీ పంట సాగులో సాధారణంగా హెక్టారుకు ఏడాదిలో 100–300 కిలోల ఎన్పీకే ఎరువులు వాడతారు. అయితే, రోజ్మేరీ మొక్కలకు ప్రామాణిక ఎరువుల మోతాదులో 20–30% పరిమాణంలోనే నానో ఎరువుల పొడిని వాడారు. అయినా మొక్కలు, వేర్ల పెరుగుదల మెరుగ్గా ఉంది. అతి సూక్ష్మ రూపంలోని రసాయనిక ఎరువుల కణాలను ఆకులు సులువుగా గ్రహించటం వల్ల సమర్థవంతంగా పోషక శోషణ జరిగింది. జీవక్రియ మెరుగ్గా జరిగింది. ఫలితంగా అధిక నూనె దిగుబడి వచ్చింది. నూనె నాణ్యత, సుగంధ స్థాయి అధికంగా వచ్చింది. ఈ పరిశోధన ఫలితాలు ‘ఇండస్ట్రియల్ క్రాప్స్–ప్రొడక్ట్స్’ శాస్త్రీయ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమయ్యాయి. ఈ విధానాన్ని మార్కెట్లో అధిక విలువ కలిగిన అనేక ఔషధ, సుగంధ పంటలకు కూడా అన్వయించవచ్చని పరిశోధకులు విశ్వసిస్తున్నారు. మీటరులో 100 కోట్ల వంతు!సాధారణంగా రైతులు వాడే డీఏపీ, ఎన్పీకే వంటి రసాయనిక ఎరువుల గుళికలు మైక్రోమీటర్ల (మీటరులో పది లక్షల వంతు) సైజులో ఉంటాయి. ఇఫ్కో నుంచి సా«దారణ 19:19:19 ఎన్పీకే, మైక్రో–న్యూట్రియంట్ మిక్స్ (ఉత్కర్ష్ కాంబి–2)లను కొనుగోలు చేశారు. వీటిని హై–ఎనర్జీ షేకర్ మిల్లులో వేసి నానో ఎరువుల పొడిని తయారు చేశారు. నానో ఎరువుల కణాలు మీటరులో 100 కోట్ల వంతు సైజులో అతి సూక్ష్మంగా ఉంటాయి. నానో ఎరువుల బయో ఎవైలబిలిటీ (జీవ లభ్యత) ఎక్కువ. నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేసినప్పుడు పత్ర రంధ్రాల ద్వారా ఈ పోషకాలు నేరుగా మొక్క సులువుగా, సమర్థవంతంగా తీసుకోగలుగుతుంది. నేలలో వేసిన సాధారణ ఎరువుల్లో పోషకాలను వేర్ల ద్వారా గ్రహించగలిగే దానికన్నా, పిచికారీ చేసిన నానో ఎరువుల పోషకాలను చాలా సులువుగా, మెరుగ్గా పంట మొక్కలు తీసుకోగలుగుతాయి. వ్యవసాయ, ఉద్యాన శాస్త్రవేత్తలు సిఫారసు చేసే మోతాదులో 20 నుంచి 30% అతి సూక్ష్మ ఎరువులతోనే అధిక దిగుబడి తీయటం సాధ్యమవుతుందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. దీర్ఘకాలిక ప్రభావాలపై పరీక్షలు చెయ్యాల్సి ఉందివ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించే ప్రామాణిక రసాయనిక ఎరువుల పరిమాణంలో 20–30% నానో ఎరువులు æ వాడితే అధిక దిగుబడులు సాధించవచ్చు. అతి సూక్ష్మ కణాలతో కూడి ఉన్నందున నానో ఎరువులు తక్కువ మోతాదుతోనే అధిక ఫలితాన్ని ఇస్తాయి. నేల, నీటి వ్యవస్థలపై ఒత్తిడిని తగ్గిస్తాయి. సాధారణ రసాయనిక ఎరువులను ఉపయోగించి నానో ఎరువులను తయారు చేశాం. మా యూనివర్సిటీ ప్రయోగశాలలో నియంత్రిత వాతావరణంలో కుండీల్లో రోజ్మేరీ మొక్కలపై ప్రయోగాత్మకంగా నానో ఎరువులు వాడాం. దాంతో పాటు రోజ్మేరీ నూనె దిగబడితో పాటు నాణ్యత కూడా పెరిగింది. అయితే, రైతులకు ఈ సాంకేతికత అందించడానికి ముందు మరికొన్ని పరీక్షలు చెయ్యాల్సి ఉంది. నానో ఎరువుల వల్ల దీర్ఘకాలిక పర్యావరణ, ఆరోగ్య ప్రభావాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవడానికి అంతర్జాతీయ మార్గదర్శకాలు, కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం కఠినమైన పరీక్షలు ఇంకా చెయ్యాల్సి ఉంది. నానోటెక్నాలజీ అనూహ్యంగా ఎటు వంటి హానీ చెయ్యదని, వ్యవసాయానికి నిజంగా ప్రయోజనం చేకూరుస్తుందని ఆధార సహితంగా నిర్ధారించుకోవటానికి ఈ పరీక్షలు ముఖ్యం. ఆ తదనంతరం నానో ఎరువుల సాంకేతికతను రైతుల వద్దకు తీసుకువెళ్తాం. – ప్రొఫెసర్ వీవీఎస్ఎస్ శ్రీకాంత్, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ,యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి -
రెడీ...సెట్...ప్లే; వికాసం నుంచి విజ్ఞానం వరకు
జ్ఞాపక శక్తికి పదునుపెట్టుకోవడానికి, పదసంపదను పెంచుకోవడానికి, సమస్యల పరిష్కారం విషయంలో బహుముఖ ప్రజ్ఞను సొంతం చేసుకోవడానికి రకరకాల డిజిటల్ బ్రెయిన్ గేమ్స్‌పై యువతరం ఆసక్తి ప్రదర్శిస్తుంది... బెంగళూరుకు చెందిన సహజకు చిన్న చిన్న రచనలు చేయడం అంటే ఇష్టం. భవిష్యత్‌లో రచయిత్రిగా పేరు తెచ్చుకోవాలనేది తన కోరిక. ఒక పుస్తకం ఆదరణ పొందాలంటే కాన్సెప్ట్‌తో పాటు భాష కూడా బాగుండాలి అనేది పద్దెనిమిది సంవత్సరాల సహజకు తెలియని విషయమేమీ కాదు. అందుకే తన పదసంపదను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. దీని కోసం ‘వొకాబులరీ బిల్డర్’ అనే గేమ్ యాప్‌ను సాధనంగా ఎంచుకుంది. కాల్పనిక రచనల కోసం మాత్రమే కాదు, ఆకట్టుకునే భాషలో ఇ–మెయిల్స్ రాయడానికి, రకరకాల విషయాలపై వ్యాసాలు రాయడానికి యువతరం ‘వొకాబులరీ బిల్డర్’ను ఉపయోగిస్తోంది. ‘సూపర్‌బెటర్’ అనేది రకరకాల సమస్యలను ఎదుర్కోవడానికి ధైర్యాన్ని ఇచ్చి, నైపుణ్యాలు పెంపొందించే ఆట. ‘ఎవ్రీవన్ హ్యాజ్ హీరోయిక్ పొటెన్షియల్’ అనేది ఈ ఆట నినాదం. ‘నువ్వు నీ గురించి అనుకున్నదానికంటే బలవంతుడివి...అండగా నిలిచే ఆత్మీయులు నీకు బలమైన సైన్యమై ఉన్నారు...ఎందరికో నువ్వు రోలోమోడల్వి...ఇలాంటి సానుకూల ఆలోచనల్లో నుంచి సమస్యలను జయించే శక్తి పుడుతుంది’ అంటోంది ‘సూపర్‌బెటర్’ను రూపొందించిన జేన్మెక్ గోనిగల్. జేమ్మెక్ ఒకప్పుడు డిప్రెషన్ బారిన పడి అందులోంచి బయటపడింది. తాను కుంగుబాటు చీకటి నుంచి బయటపడిన విధానాన్ని ఒక ఆటగా మలిచి దీని గురించి తన బ్లాగ్‌లో రాసుకుంది. కొద్దికాలంలోనే బ్లాగ్‌లో నుంచి ‘సూపర్‌బెటర్’ రూపంలో డిజిటల్ ఆటగా మారింది. న్యూరోసైంటిస్ట్ల సలహాల ఆధారంగా రూపొందించిన గేమ్... లుమినోసిటీ. ఈ గేమ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ‘మీరు ఎలాంటి స్కిల్స్ కోరుకుంటున్నారు?’ అని అడుగుతుంది. కోరుకునే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కొత్తగా ఆలోచించడానికి, ఒక సమస్యకు భిన్నమైన పరిష్కారాలు ఆలోచించడానికి ఉపకరించే ఇండి పజిల్ గేమ్ మాన్యుమెంట్ వ్యాలీ. ఈ గేమ్ యాప్ యాపిల్ డిజైన్, పాకెట్ గేమర్ ‘గోల్డ్’ అవార్డ్‌లను గెలుచుకుంది. ‘మాన్యుమెంట్ వ్యాలీ’ ప్రత్యేకత రిలాక్సింగ్ సౌండ్ ట్రాకింగ్, ఆకర్షణీయమైన డిజైన్. సుడోకు ప్రేమికులను ‘గుడ్ సుడోకు’ ఆకట్టుకుంటోంది. ‘పజిల్ ప్రేమికులకు ఇదొక ప్రేమలేఖ’ అంటోంది కంపెనీ. ఇక ఫన్మెథడ్ వీడియో గేమ్ ‘బ్లాక్‌బాక్స్’లో డజన్ల కొద్దీ మినీ గేమ్స్ ఉంటాయి. ‘ఎలివేట్’లో ప్రత్యేకమైన వర్కవుట్ క్యాలెండర్ ఉంటుంది. ‘ఫన్ అండ్ క్లిక్’ పద్ధతిలో దీన్ని రూపొందించారు... ఇలా చెప్పుకుంటూ పోతే యువతరాన్ని ఆకట్టుకుంటున్న బ్రెయిన్ ట్రైనింగ్ గేమ్స్ ఎన్నో ఉన్నాయి. ‘బస్సు కోసం ఎదురుచూసే క్రమంలో టైమ్ వృథా అయ్యేది. ఇప్పుడు మాత్రం రకరకాల బ్రెయిన్ జిమ్ గేమ్స్ ఆడుతున్నాను. కొత్త ఉత్సాహం వస్తోంది’ అంటున్నాడు ముంబైకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి సాకేత్. ‘మా తాతయ్యకు సుడోకులాంటి పజిల్స్‌ను సాల్వ్ చేయడం అంటే ఇష్టం. ఆయన కాలక్షేపం కోసం పజిల్స్‌ను సాల్వ్ చేస్తున్నారనుకునేదాన్ని. పజిల్స్ సాల్వ్ చేసే ప్రక్రియ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని తెలుసుకున్నాక వినోదంతో కూడిన బ్రెయిన్ ట్రైనింగ్ గేమ్స్‌పై ఆసక్తి పెరిగింది’ అంటోంది చెన్నైకి చెందిన భార్గవి. ‘మన జీవితమే పెద్ద పజిల్. చావు నుంచి పుట్టుక వరకు రకరకాల పజిల్స్‌ను పరిష్కరిస్తూనే ఉండాలి’ అనేది తాత్వికత ధ్వనించే మాట అయితే కావచ్చుగానీ రోజువారి జీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి. వ్యక్తిత్వ వికాసానికి డిజిటల్ బ్రెయిన్ గేమ్స్‌ను బలమైన మాధ్యమంగా ఉపయోగించుకుంటోంది యువతరం. -
మంచి మాట: మన ఆలోచనలే మనం
మనిషిని మనిషిగా నిలబెట్టగల్గినవి ఆలోచనలే. మన సంకల్ప వికల్పాలకు మన మనస్సే ఆధారం. అది సాత్వికమైతే మన ఆలోచన ఇతరులకు ఉపయోగకరంగా ఉంటుంది. రాజసమైతే తమకనుకూలంగా ఉంటుంది. తామసికమైతే ఇతరుల విషయంలో ఇబ్బందికరంగా మారుతుంది. అందుకే మనస్సు మీద అదుపు ఉండాలని చెప్తారు. మనస్సు వశంలో ఉన్నప్పుడే, ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు అదుపులో ఉంటాయి. ఎప్పుడైతే మనస్సుతో పాటు ఇతర ఇంద్రియాల మీద పట్టు సాధించగల్గుతాడో, అప్పుడే మనిషి ఒక చక్కని ఆలోచనాపరుడిగా నిలబడగల్గుతాడు. ఆలోచించే దానికంటే ఎక్కువగా ఆలోచించడం వల్ల, ఒక్కోసారి మనం మన స్థాయి కంటే మించిపోతామో ఏమో అనిపిస్తుంది. జీవితం ఒక పద్ధతిలో సాగాలంటే అందుకు మన ఆలోచనా సరళి దోహదకారి అవుతుంది. అసలు ఆలోచించడ మెందుకనే వారు కూడా ఉండవచ్చు. కానీ ఆలోచించకుండా ఏ మనిషీ ఉండజాలడు. మన సంకల్పం సక్రమ స్థితిలో ఆవిర్భవించినప్పుడు, మన ఆలోచన చక్కగా కొనసాగుతుంది. ఎప్పుడైతే మన ఆలోచన సరిగా సాగుతుందో అప్పుడు ఏ విషయంలోనైనా ఒక నిర్ణయానికి రాగలుగుతాం. సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు ఒకచోట చెప్పిన మాట ఆలోచనాత్మకమైంది. ‘‘ఎదుటి వారిని విమర్శించే ముందు మనం వారి స్థానంలో ఉండి ఆలోచించాలి’’ అనడంలో మనల్ని మనం చక్కదిద్దుకునే ఏర్పాటు మాత్రమే కాదు, ఎదుటి వారి దృష్టిలో పలుచన కాని వారమై కూడా ఉండాలన్న ఉపదేశం తేటతెల్లమవుతుంది. సంకల్పించడం, ఆలోచించడం అనేవి మనిషికి గొప్ప వరాలు. వాటిని సాధించాలంటే జీవితాన్ని క్రమశిక్షణ మార్గంలో నడిపించాలి. ఈ క్రమశిక్షణ పుట్టుకతోనే రావాలని అనుకుంటారు కాని అది ఒకరిని ఆదర్శంగా తీసుకున్నపుడే సాధ్యమవుతుంది. ఆ ఒక్కరు తల్లిదండ్రులలో ఒకరు కావచ్చు, గురువు కావచ్చు, స్నేహితుడు కూడా కావచ్చు. క్రమశిక్షణతో కూడిన ఆలోచన మనిషిని మహోన్నత శిఖరాలకు అధిరోహింపజేస్తుంది. ఒక సదాలోచన బుద్ధున్ని సత్యాన్వేషకున్ని చేసింది. ఒక సదాలోచన అంబేద్కరును రాజ్యాంగ నిర్మాతను చేసింది. ఒక సదాలోచన వివేకానందుని సన్యాసిని చేసింది. ఒక సదాలోచన దయానందుణ్ణి మనిషిని చేసింది. ఆలోచనకు ప్రతిరూపంగానే మనిషి భాసిస్తాడు. కనుకనే మనిషిని మేధావి అని పిలుస్తాం. ‘హెయిన్’ అనే పాశ్చాత్య మనస్తత్వ శాస్త్రవేత్త ‘‘మంచి ఆలోచనలు చేసేవారే మంచి పనులు చేస్తుంటారు’’ అని సెలవిచ్చాడు. ఇది ముమ్మాటికీ నిజం. మంచి ఆలోచన మంచి పనికి దారి తీస్తుంది. మంచిపని మంచి ఫలితాన్ని ఇస్తుంది. ‘‘జీవితంలో గొప్పగా ఎదగాలంటే సానుకూలంగా ఆలోచించడం నేర్చుకోవా’’ లన్న బెన్నిసన్ మాటలు గమనింపదగ్గవి. ఉన్నతమైన ఆలోచనలే ఉన్నతమైన స్థానంలో నిలబెడతాయి. గొప్ప పనులు చేయాలంటే మొదట గొప్పగా ఆలోచించక తప్పదు. చరిత్రలో నిలబడ్డ మహా పురుషులందరూ గొప్పగా ఆలోచించినవారే. మంచి స్వభావం మనిషికి అలంకారమైనప్పుడు మంచి ఆలోచన అతనికి కిరీటంగా భాసిస్తుంది. ‘యద్భావం తద్భవతి’ అనే మాట ఒకటుంది. ఏది అనుకుంటే అది అవుతుందని దాని అర్థం. నిజానికి అందరు అనుకున్నది అవుతుందా? ఎవరైతే పరిశుద్ధమైన మనస్సుతో సంకల్పించి, కార్య రంగంలోకి దూకుతారో వారికే విజయం సంప్రాప్తమవుతుంది. కొందరు అదేపనిగా ఆలోచిస్తుంటారు. ప్రతి దానికి ఆందోళన చెందుతుంటారు. మనస్సు కకావికలం కాగా, విచారానికి లోనవుతారు. కాని జరిగిన వాటిని గూర్చి, జరగబోయే వాటిని గూర్చి పండితులు ఆలోచించరు. లోకంలో జరిగినవి, జరగబోయేవి మనల్ని ప్రభావితుల్ని చేస్తాయి. కాని బుద్ధిశాలురు జరుగుతున్న విషయాలను మాత్రమే పట్టించుకుంటారు. వారు వర్తమానంలో జీవిస్తారు. వాస్ తవికతను ఆవిష్కరిస్తారు. పరిస్థితులను బట్టి వ్యవహరిస్తారు. కాని సామాన్యులు తద్భిన్నంగా ఆలోచిస్తూ జీవితాలను దుఃఖమయం చేసుకుంటారు. మనస్సును నిగ్రహించుకున్నప్పుడు ఆలోచనలు ఆగిపోతాయి. అందుకే మన పెద్దలు ఆలోచనల్ని గుర్రాలతోను, మనస్సును పగ్గాలతోను పోల్చి చెప్పారు. అప్పుడు శరీరం రథంగాను, బుద్ధి సారధి గాను మారిపోయి, మనిషి అనుకున్న గమ్యం చేరడానికి వీలు కలుగుతుంది. మనిషిని గమ్యం వైపు ప్రయాణింపజేసే ఆలోచనలే నిజమైన ఆలోచనలు. అందుకు మొదట మనిషి లక్ష్య శుద్ధి కల్గిన వాడు కావాలి. ఆ లక్ష్యాన్ని చేరడానికి జీవితంలో, అతనికి ఆలోచనల కంటే మించి సాయపడేవి మరేవీ ఉండవని గట్టిగా చెప్పవచ్చు. – ఆచార్య మసన చెన్నప్ప -
‘జల్’ఫోన్..!
మొబైల్‌తో రింగిస్తే నడిచే విద్యుత్ మోటార్ సత్తుపల్లిలో ఆసక్తిగా పరిశీలించిన రైతాంగం సత్తుపల్లి: ఇంట్లో కూర్చొని..మొబైల్ ఫోన్లో మీటా నొక్కితే..టిక్కెట్ల బుకింగ్, బ్యాంక్‌సేవలు, ఆన్లైన్ సౌకర్యాలే కాదు..ఇకపై చేలకాడ ఉన్న కరెంట్ మోటార్లను కూడా నడిపించొచ్చంట. సత్తుపల్లిలో మోటార్‌కు ప్రత్యేక పరికరం అమర్చి..సెల్‌ఫోన్‌తో రింగిచ్చి దానిని ఆన్‌చేసే విధానం వివరించారు. హైదరాబాద్ నుంచి తెప్పించిన ఈ పరికరాన్ని జేడీఈ కె.జీవన్‌కుమార్ పరీక్షించారు. ఆసక్తికరంగా ఉన్న ఈ ‘మొబైల్ మోటార్’ విశేషాలేంటంటే.. హైదరాబాద్‌కు చెందిన విన్ఫినెట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కిసాన్‌రాజా పేరుతో మొబైల్ మోటార్ కంట్రోలర్‌ను రూపొందించింది. సత్తుపల్లి విద్యుత్‌శాఖ ఏడీఈ కె.జీవన్‌కుమార్‌కు స్నేహితులైన ఈ సంస్థ నిర్వాహకులు దిన్నెపు విజయభాస్కర్‌రెడ్డి గురువారం ఇక్కడికి తెచ్చారు. సత్తుపల్లి మండలం సదాశివునిపేటలో ప్రయోగాత్మకంగా వ్యవసాయ విద్యుత్ మోటారుకు అనుసంధానం చేసి డెమో చేయగా రైతులు ఆసక్తిగా తిలకించారు. కంపెనీ ప్రతినిధి విక్రమ్‌రెడ్డి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఏడీఈ జీవన్‌కుమార్, ఏఈలు ప్రభాకర్, అంకారావు, పైడయ్య, సుబ్రమణ్యం, సర్పంచ్ మందపాటి రాజేంద్రప్రసాద్‌రెడ్డి, ఎంపీటీసీ వినుకొండ కృష్ణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు చల్లగుళ్ల నర్సింహారావు, రైతులు పాల్గొన్నారు. మోటార్ వద్ద సిమ్ పెట్టే.. రింగిస్తే నీళ్లు పోసే.. - విద్యుత్ మోటర్‌కు కిసాన్‌రాజా పరికరాన్ని అమర్చారు. - అందులో సిమ్‌ను పెట్టి దానికి అనుసంధానంగా సంబంధిత రైతు సెల్‌ఫోన్‌తో అనుసంధానం చేశారు. - ఆ తర్వాత సెల్‌ఫోన్‌తో ఆ నంబర్‌కు రింగివ్వగా..వెంటనే విద్యుత్ మోటార్ ఆన్ అయి నీళ్లు పోసింది. - విద్యుత్ ఓల్టేజీ హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు, విద్యుత్ తీగలు తెగినప్పుడు, బోరులో నీళ్లు మోటారుకు అందనప్పుడు సెల్‌కు మెసేజ్ వస్తుంది. - తద్వారా మోటారు కాలిపోకుండా జాగ్రత్త పడే అవకాశం లభిస్తుంది. - విద్యుత్ సరఫరా ఉందా.. లేదా..? మోటారు నడుస్తుందా.. లేదా..? అనే సమాచారం కూడా సెల్‌కు మెసేజ్ రానుంది. - మోటార్లు, స్టార్టర్ల దొంగతనం జరిగినప్పుడు హెచ్చరిస్తూ ఎస్ఎంఎస్ రైతు మొబైల్‌కు వస్తుంది. - ఇప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 2500 విద్యుత్‌మోటార్లకు ఈ సిమ్ సిస్టం అమర్చినట్లు కంపెనీ ప్రతినిధి విక్రమ్‌రెడ్డి వివరించారు. -
మెట్టకు ప్రాణం
మండలాల్లో ఓ మోస్తారు వర్షం –అత్యధికంగా పోచంపల్లిలో 69.2 మిల్లీ మీటర్లు నల్లగొండ అగ్రికల్చర్ : అల్పపీడన ద్రోణి కారణంగా జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 46 మండలాలలో ఓ మోస్తారు వర్షం కురిసింది. దీంతో మెట్ట పంటలకు జీవం పోసినట్లు కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అత్యధికంగా పోచంపల్లి మండలంలో 69.2 మిల్లీ మీటర్లు కురిసింది. నార్కెట్‌పల్లిలో 65.8, రామన్నపేటలో 65.7, కనగల్‌లో 63.0, మునుగోడులో 58.4, చండూరులో 55.0, వలిగొండలో 54.2, గుర్రంపోడులో 50.0, అనుములలో 49.0, చిట్యాలలో 45.4, ఆలేరులో 44.6, చౌటుప్పల్‌లో 41.6, యాదగిరిగుట్టలో 39.0, శాలిగౌరారంలో 36.4, తుర్కపల్లిలో 35.8, కేతేపల్లిలో 35.4, పీఏ పల్లిలో 33.0, నల్లగొండలో 31.0, నూతన్‌కల్‌లో 30.4, నకిరేకల్‌లో 29.4, గుండాలలో 26.4 నారాయణపురంలో 25.6, తిరుమలగిరిలో 25.4, రాజాపేటలో 24.6, బీబీనగర్‌లో 24.0, కట్టంగూరులో 23.6, బీరామారంలో 23.4 మిల్లీ మీటర్లు వర్షం కురిసింది. పెద్దవూరలో 22.2, నాంపల్లిలో 21.0, ఆ్మతకూరులో 20.8, మోత్కూరులో 18.2, చింతపల్లిలో 16.2, .జాజిరెడ్డిగూడెంలో 16.2, భువనగిరిలో 12.4, మునగాలలో 10.2, కోదాడలో 8.0, తిప్పర్తిలో 7.4, దేవరకొండలో 7.0, తుంగతూర్తిలో 6.0, హుజూర్‌నగర్‌లో 5.8, సూర్యాపేటలో 4.8, చిలుకూరులో 4.2, మర్రిగూడలో 3.8 ఆత్మకూరుఎస్లో 3.6, మేళ్లచెరువులో 1.8, మఠంపల్లిలో 0.6 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. మొత్తం 1295.4 మి. మీటర్ల వర్షం కురిసింది. సగటున వర్షంపాతం 22.0 మిల్లీ మీటర్లు నమోదైంది.


