ట్రావెల్
బికనీర్
ఎడారి అంటే నిశ్శబ్దం అనుకుంటాం. కానీ బికనీర్‌లో ఎడారి కరకరలాడుతుంది. నూనెలో వేగుతున్న భుజియా చప్పుడు, పాపడ్ విరిచినప్పుడు వచ్చే శబ్దం.. అదే ఇక్కడి సంగీతం.
రాజస్థాన్ లోని ఒక పురతాన రాజ వంశానికి చెందిన ఒక డిష్ ఇక్కడి సంస్కృతిగా మార్చింది. 1877 లో బికనీర్ మహారాజా డుంగర్ సింగ్ కిచె¯Œ లో మొదలైన ఒక చిన్న ప్రయోగం, ఇవాళ ప్రపంచం మొత్తం ఆస్వాదించే స్నాక్‌గా మారింది.
మొదట్లో టేస్టీగా ఉండే భుజియాను రాజుల కోసం మాత్రమే వండేవారు. ఇది మోత్ దాల్ (బొబ్బర్లు), శనగపిండి, బికనీర్ ఎడారిలో లభించే మిర్చీం ఈ మూడింటి కలయిక.
బికనీర్ ఓల్డ్ స్ట్రీట్స్‌లోకి వెళ్తే ఇది ఒక ఊరు కాదు, ఇది పెద్ద కిచెన్ అని అర్థం అవుతుంది. ఉదయం ఆరు గంటలకే భుజియా బజార్‌లో కడాయిలు మంటలపై సెట్ అయిపోతాయి. చేతి యంత్రం నుండి బంగారు తీగల్లా జారుతున్న భుజియా, తరువాత వచ్చే ఘాటైన వాసన ఇవన్నీ బికేనేర్ వెళ్లి ఫీల్ అవ్వాల్సిన ఇమోషన్స్.
ఒకే వీధిలో ఒక ఇంట్లో భుజియా, మరో ఇంట్లో పాపడ్లు సిద్ధం అవుతుంటాయి. ఇక్కడి పాపడ్ సాధారణ పాపడ్ కాదు. చేతితో సాగదీసిన పెద్ద పాపడ్, ఎడారి గాలి తగిలి మరింత గట్టిపడుతుంది.
రుచి వెనుక మనుషులు..
మొదట్లో భుజియా అనేది ఇంట్లో ఆడవాళ్లు చేసే లావుపాటి చిరుతిండి మాత్రమే. హల్దీరామ్ అని పిలిచే గంగా బిషన్ అగర్వాల్ అనే వ్యక్తి తన అత్త దగ్గర టేస్టీ భుజియా మేకింగ్‌ను నేర్చుకున్నారు. తరువాత లావుపాటి భుజియాను నోట్లో కరకరలాడే నాజూకు భుజియాగా మార్చాడు.
1937లో బికనీర్‌లో అత్త నేర్పిన రెసిపీతో మొదలైన చిన్న కొట్టే హల్దీరామ్. ఇవాళ అది భారత దేశంలో మెక్‌డొనాల్డ్స్‌ను దాటేసిన బ్రాండ్‌గా ఎదిగింది. హల్దీరామ్ వేసిన మార్గంలోనే భికారామ్ చాంద్ మాల్, బికాజీ. ఇలా బికా పేరుతో వచ్చే చాలా సంస్థలు హల్దీరామ్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రువులు స్థాపించినవే. వీటిలో పలు సంస్థలు స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ కూడా అయ్యాయి.
వీళ్లలో చాలా మంది ఒకే కుటుంబం వాళ్లే కాబట్టి, హల్దీరామ్ పేరు ఎవరిది అని కోర్టులో ఇప్పటికీ గొడవలు నడుస్తున్నాయి. బ్రాండ్లు వేరైనా, రుచి మాత్రం ఒకటే అదే బికనీర్ మట్టి రుచి.
బికనీర్‌లో ప్రారంభమైన స్నాక్స్ ఫెస్టివల్ కేవలం భుజియా, పాపడ్ వరకే పరిమితం అవ్వలేదు. తరువాత స్వీట్స్ కూడా ΄్యాకేజ్ చేసి అమ్మడం మొదలుపెట్టారు. తెల్లగా ఉండే బెంగాల్ రసగుల్లా మెత్తగా ఉంటే, బికనీర్ రసగుల్లా కాస్త కమిలిన రంగులో, పాల ఘాటుతో, నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా ఉంటుంది.
ఇక్కడి లోకల్ ఫ్లేవర్ ఎంజాయ్ చేయాలి అంటే సాయంత్రం కోటా గేట్ దగ్గర కచోరీ తినాలి. వేడి కచోరీ మీద ఒక పిడికెడు భుజియా చల్లి ఇస్తారు. అదే బికనీర్ స్టైల్.
బికనీర్ స్నాక్స్ కేపిటల్ ఎందుకు అయింది?
ఎడారిలో నీరు తక్కువ, కూరగాయలు తక్కువ. అందుకే ఇక్కడి వాళ్లు నిల్వ ఉండే రుచులను కనిపెట్టారు. భుజియా నెలల తరబడి చెడిపోదు. పాపడ్ ఏడాది పాటు ఉంటుంది. లేని దాని గురించి ఆలోచించి బాధ పడుకుండా ఉన్నదాని నుంచి అద్భుతాలు చేయడమే బికనీర్ స్పెషాలిటీ. అందుకే దీనికి ఇటీవలే జీఐ ట్యాగ్ వచ్చింది. అసలు బికనీరీ భుజియా అంటే బికనీర్ లో చేసిందే.
బికనీర్ భుజియా ప్రయాణం తెలుసుకున్న అక్కడికి వెళ్లాలి అనిపించడంలో తప్పేం లేదు. వెళ్లొచ్చు కూడా. హైదరాబాద్ నుండి జైపూర్ మీదుగా బికనీర్ వెళ్లి రెండు రోజుల్లో లోకల్ ఫ్లేవర్ ఎక్స్΄్లోర్ చేయవచ్చు. ఈ రెండు రోజుల ట్రిప్ అనేది అక్కడి కట్టడాలు, నిర్మాణాలు చూడటానికి కాదు. అలాగే నచ్చింది తినడానికి మాత్రమే కాదు..ఒక రుచి ఎలా బతుకుతుందో చూడడానికి ఈ ట్రిప్ ΄్లాన్ చేయాలి.
ఇదీ చదవండి: ట్రావెల్.. కూర్గ్ కాఫీ ఒక్కసారి తాగితే.. సిటీ కాఫీ నచ్చదట!


