పర్యటన
ది సీషెల్స్
ఇక్కడ సముద్రం ఎక్కువగా హడావుడి చేయదు.
అలల సవ్వడి, చల్లగా తనువును మీటే గాలి, తెల్లని ఇసుక మధ్య నెమ్మదిగా సాగే జీవితం...
సీషెల్స్‌లో సమయం కాస్త నెమ్మదిగా నడుస్తున్నట్టే అనిపిస్తుంది. దీనినే ఐలాండ్ టైమింగ్ అని కూడా అంటారు.
ఆఫ్రికా తూర్పు తీరానికి దూరంగా, హిందూ మహాసముద్రం మధ్యలో ఉన్న సీషెల్స్ 115 దీవులతో కూడిన ద్వీప దేశం.
మాహె, ప్రాలిన్, లా డిగ్యూ వంటి దీవులు ఈ యాత్రలో ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి.
ప్రకృతి, సముద్రం, గ్రానైట్ శిలలు, పచ్చని అడవులు, క్రియోల్ సంస్కృతి కలిసి ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని క్రియేట్ చేశాయి.
అందుకే సీషెల్స్ యాత్ర కేవలం బీచ్ హాలిడేగా మిగిలిపోదు. ఒక కంప్లీట్ డెస్టినేషన్ అనుభూతిని మదినిండా నింపుతుంది..
సీషెల్స్ అసలు ప్రయాణం అనేది మాహె దీవి నుంచే మొదలవుతుంది. సీషెల్స్ రాజధాని విక్టోరియా ఇక్కడే ఉంది. చిన్న నగరమైన విక్టోరియాలో లోకల్ మార్కెట్, సీఫుడ్ , క్రియోల్ కల్చర్ స్థానికులు జీవన విధానాన్ని గమనించవచ్చు. నగరం నుంచి కొంచెం దూరం వెళ్తే పచ్చని కొండలు, సముద్రం మధ్యలో కనిపించే చిన్న దీవులు ప్రయాణికులను తప్పకుండా ఆకర్షిస్తాయి.
ప్రాలిన్ దీవిలో వాల్లీ డి మే ప్రకృతి ప్రియులను ఆకట్టుకుంటుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు ΄÷ందిన ఈ అడవిలో కొకో డి మెర్ పామ్ చెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అడవి మధ్య నడుస్తుంటే చుట్టూ ఉన్న నిశ్శబ్దం, పక్షుల సవ్వడితో కలిసి మరో ప్రపంచంలో ఉన్న అనుభూతిని కలిగిస్తుంది.

లా డిగ్యూ అనే ప్రాంతంలో స్లో టూరిజాన్ని అనుభూతి చెందవచ్చు. ఇక్కడ ఎక్కువ హడావిడి ఉండదు. చాలా మంది సైకిళ్లపై తిరుగుతూ ఉంటారు. పది గంటలకు కలుస్తా అన్న వ్యక్తి ఇక్కడ పదిన్నరకు కలిసినా ఎవరూ ఏమీ అనుకోరు. ఐలాండ్ టైమింగ్స్, అక్కడి లైఫ్‌స్టైల్‌లో టైమ్ కన్నా ప్రశాంతతే ఇంపార్టెంట్ అనుకుంటారు.
ఇక సీషెల్స్‌కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన వ్యూస్ అంటే వైట్ శాండ్, భారీ గ్రానైట్ రాళ్లు చూడాలి అనుకుంటే అన్సే సోర్స్ డీ ఆర్జెంట్ అనే ప్రాంతానికి వెళ్లాల్సిందే.
ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నుంచి సీషెల్స్‌కు డైరక్ట్ విమానాలు లేదు. ఈ ప్రయాణం మాహెలోని సీషెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు సాగుతుంది. మేఘాల పైనుంచి హిందూ మహాసముద్రం వైపు సాగుతూ, చివరికి నీలి సముద్రం మధ్యలో ఉన్న దీవి కనిపించే క్షణం ఈ యాత్రకు అందమైన ఆరంభంలా అనిపిస్తుంది.
తక్కువ ధరకు లభించే టికెట్ కొంటే రెండు విమానాలు మార్చాల్సి ఉంటుంది. ఈ కనెక్టింగ్ ఫ్లైట్స్‌లో సుమారు 25 గంటల వరకు జర్నీ చేయాల్సి ఉంటుంది. అదే ఫాస్టెస్ట్ టికెట్ కొంటే 10 గంటల్లోనే నేరుగా చేరుకోవచ్చు.
విజయవాడ నుంచి వచ్చేవారు హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ క్యాచ్ చేయవచ్చు. మాహె నుంచి ప్రాలిన్‌కు ఫెర్రీ లేదా డొమెస్టిక్ ఫ్లైట్, ప్రాలిన్ నుంచి లా డిగ్యూకు ఫెర్రీ ప్రయాణం ఈ యాత్రను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. సముద్రం మధ్య సాగే ఈ చిన్న ప్రయాణాలు కూడా సీషెల్స్ అనుభవంలో భాగమే.

ఏం చూడాలి?
సీషెల్స్‌లో చూడాల్సింది కేవలం బీచ్ మాత్రమే కాదు. మాహె కొండలపై నుంచి కనిపించే సముద్రం, ప్రాలిన్ అడవుల్లోని కొకో డి మెర్ చెట్లు, లా డిగ్యూ గ్రానైట్ శిలల మధ్య మెరిసే బ్లూ వాటర్‌ంఇవన్నీ థ్రిల్లింగ్ కలిగిస్తాయి.
సముద్రంలో స్నార్కెలింగ్ చేస్తుంటే నీటి కింద కదిలే చేపల గుంపులు, పగడపు దిబ్బలు ఇవన్నీ చూస్తే మనం మరో ప్రపంచంలో ఉన్న ఫీలింగ్ కలిగేలా చేస్తాయి.
లా డిగ్యూలో సైకిల్‌పై నెమ్మదిగా సముద్రపు గాలిని ఫీల్ అవ్వడం తప్పకుండా సీషెల్స్ ఐకానిక్ ఎక్స్‌పీరియెన్‌్సగా మిగిలిపోతుంది. సాయంత్రం బీచ్ పక్కన కూర్చుని సన్‌సెట్‌ను చూడటం, నైట్‌లో స్టార్ గేజ్ చేయడం ఇలాంటి చిన్న చిన్న సరదాలే జర్నీలో హైలైట్‌గా నిలిచిపోతాయి.
ఎక్కడ ఉండాలి?
రాజధాని విక్టోరియా ఉండే మాహె ఐల్యాండ్ ప్రాంతం చుట్టూ సముద్రానికి దగ్గరగా ఉండే హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు, రిసార్టులు కనిపిస్తాయి. మార్నింగ్ బాల్కనీ తలుపు తెరిచినప్పుడు ముందుగా సముద్రం కనిపించడం ఒక స్పెషల్ ఎక్స్‌పీరియెన్‌్సగా మిగిలిపోతుంది..

ప్రాలిన్‌లో పచ్చని చెట్ల మధ్య ఉండే రిసార్టులు, విల్లాలు ప్రకతికి మరింత దగ్గర చేస్తాయి. లా డిగ్యూలో చిన్న గెస్ట్‌హౌస్‌లు, స్థానిక శైలిలో ఉండే వసతులు దీవి నిదానమైన జీవన విధానాన్ని మరింత దగ్గరగా పరిచయం చేస్తాయి.
ఆసక్తికరమైన విషయాలు..
- సీషెల్స్‌లో మొత్తం 115 దీవులు ఉన్నాయి. వాటిలో మాహె అతిపెద్ద దీవి.
- విక్టోరియా సీషెల్స్ రాజధాని. ఇది మాహె దీవిలో ఉంది.
- కొకో డి మెర్ పామ్ చెట్టు సీషెల్స్‌కు ప్రత్యేక గుర్తింపు. దీని విత్తనం ప్రపంచంలోనే అతిపెద్ద విత్తనాల్లో ఒకటి. దీని బరుకు 30 కిలోల వరకు ఉంటుంది.
- అల్డబ్రా జెయింట్ టార్టాయిస్ సీషెల్స్‌కు చెందిన ప్రత్యేక వన్యజీవుల్లో ఒకటి.
- సీషెల్స్ రూపీ స్థానిక కరెన్సీ. పర్యాటక ప్రాంతాల్లో యూరో, అమెరికన్ డాలర్ వంటి కరెన్సీలను కూడా అనేక చోట్ల స్వీకరిస్తారు.
ఏం తినాలి?
సీషెల్స్‌లో ఫుడ్ అక్కడి ఐలాండ్ కల్చర్‌ను రిప్రెజెంట్ చేస్తుంది. క్రియోల్ వంటకాల్లో ఫ్రెంచ్, ఆఫ్రికన్, భారతీయ టచ్ కనిపిస్తుంది. ఫ్రెష్ ఫిష్ కర్రీ, గ్రిల్డ్ ఫిష్, కొబ్బరితో తయారు చేసే వంటకాలు ట్రై చేయవచ్చు..

ఇక్కడి పాపులర్ డిషెస్‌లో ఆక్టోపస్ కర్రీ కూడా ఒకటి. ఇలాంటి ఎక్స్‌పరిమెంట్ ఫుడ్ ఎవాయిడ్ చేయకూడదు అనుకుంటే స్కిప్ చేయండి. కావాలంటే మీరు అరటి పండు, కొబ్బరి పాలు వంటి పదార్థాలతో తయారు చేసే లడోబ్ స్వీట్ ట్రై చేయవచ్చు. లేదంటే బీచ్ పక్కనే ఉన్న లోకల్ రెస్టారెంట్‌లో చేపలతో చేసిన వెరైటీలు ట్రై చేయవచ్చు.
యాత్ర, బడ్జెట్ వివరాలు?
సీషెల్స్‌లో ఐదు రోజులు ట్రిప్ ΄్లాన్ చేస్తే బడ్జెట్ అనేది మీ స్టే అండ్ ఫ్లై చార్జీలను బట్టి మారుతుంది. హైదరాబాద్ నుంచి రిటర్న్ ఫ్లైట్ టికెట్ అనేది సీజన్, ఎయిర్‌లైన్‌్స, బుకింగ్ సమయాన్ని బట్టి సుమారు రూ.70 వేల నుంచి రూ.1 లక్షా 15 వేల వరకు ఉంటుంది.
అక్కడ హోటల్స్ కూడా చాలా కాస్ట్లీ. బేసిక్ గెస్ట్ హౌస్ లేదా సెల్ఫ్ కేటరింగ్ అపార్ట్‌మెంట్ కి రోజుకి కనీసం రూ.8 వేల నుంచి రూ.12 వేలు అవుతుంది. స్టాండర్డ్ 3 స్టార్ హోటల్స్ కి రూ.15 వేల నుంచి రూ.25 వేలు, ప్రీమియం రిసార్ట్ కి రోజుకి రూ.40 వేల నుంచి మొదలై రూ.6 లక్షల వరకు కూడా ఉంటుంది.ఫుడ్ కోసం రోజుకి సగటున రూ.5 వేలు బడ్జెట్ పెట్టుకోవాలి. మొత్తంగా ఐదు రోజుల ట్రిప్ కి ఒక్కొక్కరికి బడ్జెట్ విధానంలో రూ.1.6 లక్షల నుంచి రూ.2 లక్షలు, స్టాండర్డ్ వసతులతో రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చవుతుంది. ప్రీమియం రిసార్టులు, ప్రైవేట్ ట్రాన్‌్సపోర్టేషన్, వాటర్ యాక్టివిటీస్ కలిపితే బడ్జెట్ రూ.3.5 లక్షలు దాటుతుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ ప్రయాణ ఖర్చు దీనికి అదనం.
వీసా..
భారతీయ పాస్‌పోర్ట్‌దారులకు సీషెల్స్‌లో వీసా అవసరం లేదు. అయితే ప్రయాణానికి ముందు సీషెల్స్ ట్రావెల్ ఆథరైజేషన్ తీసుకోవాలి. పాస్‌పోర్ట్, స్టే, రిటర్న్ టికెట్, ట్రావెల్ డీటెయిల్స్ వంటి వివరాలు అందించాల్సిన అవసరం పడొచ్చు. ట్రావెల్ ఆథరైజేషన్ ఫీజు, ప్రవేశ నిబంధనలు వంటి వివరాలను ప్రయాణానికి ముందు అధికారిక వనరుల్లో పరిశీలించాలి.
– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు
ఇదీ చదవండి: పర్యాటకంతో కాసుల వర్షం.. టాప్–10 దేశాలు ఇవే!


