చేతిలో కట్టెలు | Standing alone brings the strength of solitude | Sakshi
Sakshi News home page

చేతిలో కట్టెలు

Sep 28 2026 1:06 AM | Updated on Sep 28 2026 1:06 AM

Standing alone brings the strength of solitude

ఆధ్యాత్మికథ

ఒక ఊర్లో చెరుకు వ్యాపారి ఒకరు ఉండేవాడు. అతడికి డబ్బు సంపాదన  తప్ప మరేదీ ముఖ్యం కాదు.  ఊర్లో వాళ్ళని, బంధువులను దగ్గరకు చేరిస్తే సొత్తంతా తినిపోతారని ఆలోచించేవాడు. ‘వీళ్ళతో నాకేం పని ఉంటుంది?’ అన్నట్లుగా వ్యవహరించేవాడు. ‘అందరూ మోసగాళ్ళే. ఎవ్వరినీ నమ్మడానికి వీల్లేదు’ అని అందరినీ దూరం పెట్టేవాడు.

అలాంటి వ్యాపారి ఒకసారి తన వ్యాపార రీత్యా దూర దేశానికి వెళ్ళాల్సి వచ్చింది. ఒక గుర్రపు బండి మాట్లాడుకున్నాడు. చాలా ఊర్లు దాటి ఓ ఏటి గట్టుపైన వెళ్తూ ఉంటే దారిలో ఒక ఊరు కనిపించింది.  చాలామంది రైతులు పొలాల్లో వేగంగా నడిచి పోతూ ఉన్నారు. వారి ముఖాలన్నీ గంభీరంగా ఉన్నాయి. వారందరి చేతుల్లోనూ  కట్టెలున్నాయి. వారిని చూసిన గుర్రపు బండి రౌతు బండిని పక్కకు ఆపాడు. గబుక్కున  బండినుంచి దిగి నడిచి వెళ్తున్న రైతులకు నమస్కరించాడు. వారు పొలం దాటి ఊర్లోకి వెళ్ళిపోయేవరకు చేతులు కట్టుకుని నిలబడ్డాడు. వారు ఊరికి చేరారని  గుర్తించాక  రౌతు, తను నిలబడి  ఉన్న  నేలకి దండం పెట్టాడు.

బండిలో కూర్చుని అంతా చూస్తున్న వ్యాపారి ఆశ్చర్యపోయాడు. ‘వారి నడక చూస్తే వేగంగా ఉంది. వారు గొడవకు పోతున్నట్లుగా అనిపిస్తోంది. అందులోనూ వారి చేతిలో కట్టెలున్నాయి. అలాంటి రైతులకు నువ్వెందుకు నమస్కరించావు? అంతే కాదు, వారెళ్లిపోయాక ఈ నేలకు  ఎందుకు దండం పెట్టావు?’ అని ఎగతాళిగా అడిగాడు.

చిన్నగా రౌతు ‘‘పుడితే ఇలాంటి ఊర్లలో పుట్టాలనిపిస్తుంది నాకు. ఊరిలో ఎవ్వరు చనిపోయినా ఇంటికొకరు శ్మశానం దగ్గరకు వెళ్తారు. అక్కడికి వెళ్ళే   ప్రతి ఒక్కరూ ఒక కట్టె తీసుకెళ్తారు. చనిపోయిన వాళ్ళలో ధనికులూ ఉంటారు, పేద వాళ్ళూ ఉంటారు. ఎవరు చనిపోయినా శవ దహనం మాత్రం గొప్పగా జరగాలన్నది వారి ఆశయం. అందుకే వాళ్ళందరూ మనిషికొక కట్టె ఎత్తుకుని వెళ్తున్నారు. ఆ ఊరి వారి సహదయతకు, కట్టుబాటుకు నమస్కరించాను. అలాంటి మంచి మనుషులు తిరుగులాడుతున్న ఈ నేల గొప్పదని భావించి నేలకీ దండం పెట్టాను. ఒంటిగా ఉంటే ఒంటరి బలం, తోడుంటే కొండంత  బలం కదా ’’ అని చెప్పాడు.

‘ఈ ప్రపంచంలో అందరూ చెడ్డవాళ్ళు కాదు. మనుషుల్లో ఇంకా మంచితనం మిగిలి ఉంది. అందుకే  సమాజం ఇంకా ఒక క్రమపద్ధతిలో నడుస్తోంది. ఏ కాలమైనా మనిషికి మనిషే సహాయపడగలడు’  అని వ్యాపారి అర్థం చేసుకున్నాడు.  తన వారినందరినీ ఆదరిద్దామని, చేతనైనంత సహాయం చేద్దామని నిర్ణయం తీసుకున్నాడు.

– ఆర్‌.సి.కృష్ణస్వామి రాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement