కర్మఫలం...  కర్తవ్య బలం | Karma of action, the strength of duty | Sakshi
Sakshi News home page

కర్మఫలం...  కర్తవ్య బలం

Jun 29 2026 5:54 AM | Updated on Jun 29 2026 5:54 AM

Karma of action, the strength of duty

మంచిమాట

అంకితభావంతో కూడిన ఆచరణనే కర్తవ్యం అంటారు. జీవితంలో ఏ రంగంలో ఉన్నా తన వంతు బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించడమే అసలైన యజ్ఞం. కర్తవ్యం కేవలం భారం కాదు; అది ఆత్మ వికాసానికి లభించిన పవిత్ర అవకాశం. గాలివానలోనూ దీపం ఆరిపోకుండా కాపాడుకున్నట్లు, ప్రతికూల పరిస్థితుల్లోనూ కర్తవ్యాన్ని వీడకూడదు. పదును లేని కత్తి యుద్ధానికి పనికిరానట్లు, నిబద్ధత లేని పని ఫలితాన్ని ఇవ్వలేదు.

 ఉదాహరణకు, ఒక నిరుపేద విద్యార్థి తన పేదరికాన్ని సాకుగా చూపకుండా, కష్టపడి చదివి విజయం సాధించడం ఉన్నతమైన కర్మ నిర్వహణ. శ్రమ నీ ఆయుధమైతే, విజయం నీ బానిసవుతుంది. పనిని ప్రేమించేవాడికి అలసట ఉండదు, లక్ష్యం పట్ల స్పష్టత ఉన్నవాడికి అపజయం ఎదురుకాదు. సంకల్పం దృఢంగా ఉంటే మార్గం సుగమమవుతుంది. నిరంతర సాధన ఉంటేనే రాయి రత్నంగా మారుతుంది.

కర్మ చేయడం మన హక్కు, కానీ ఫలితంపై అధికారం ప్రకృతికి లోబడి ఉంటుంది. ఫలితాన్ని ఆశించి చేసే పని మనిషిని బానిసగా మారుస్తుంది; ఫలితాన్ని సమర్పణ భావంతో వదిలేసే వ్యక్తిని కర్మ యోగిగా తీర్చిదిద్దుతుంది. తన నీటిని తాను తాగని నదిలా, తన పండ్లను తాను ఆరగించని వృక్షంలా మన కర్మలు లోక హితం కోరాలి. ఆశలు సంకెళ్ళయితే, ఆశయం రెక్కల వంటిది. నేటి పోటీ ప్రపంచంలో కేవలం స్వార్థ ప్రయోజనం కోసమే పరుగెత్తడం వల్లనే మానసిక అశాంతి పెరుగుతోంది. విల్లు నుంచి విడిచిన బాణం లక్ష్యం వైపే వెళ్ళాలి కానీ వెనక్కి చూడకూడదు. త్యాగంలో ఉన్న ఆనందం భోగంలో లభించదు. ప్రతిఫలం ఆశించని సేవ పరమాత్మకు చేరువయ్యే రాజమార్గం. ఫలితాపేక్ష లేని క్రియే మనిషిని బంధనాల నుండి విముక్తుడిని చేస్తుంది.

ఏది ధర్మబద్ధమైన కర్మ అని గుర్తించడమే వివేకం. వివేకం లేని క్రియ అంధకారంలో ప్రయాణం వంటిది. జ్ఞానంతో కూడిన ఆచరణే కర్మ కౌశలం. బాహ్య ప్రపంచంలో మనం చేసే పనుల కన్నా, మన అంతరంగంలో ఉన్న సంకల్పం గొప్పది. నిప్పును తాకితే చేయి కాలడం ఎంత సహజమో, దుష్కర్మ చేస్తే దుఃఖం కలగడం అంతే అనివార్యం. పాల నుండి నీటిని వేరు చేసే హంసలా, మనం చేసే పనులలోని మంచి చెడులను వివేకంతో వేరు చేయాలి. బురదలో ఉన్నా పవిత్రతను కాపాడుకునే పద్మంలా, సంక్లిష్ట పరిస్థితుల్లోనూ ధర్మబద్ధంగా వ్యవహరించడమే మనీషి లక్షణం. 

కర్మ సిద్ధాంతం శిక్ష కాదు; అది మనల్ని మనం సరిదిద్దుకునే గొప్ప శిక్షణ. గతం మన చేతుల్లో లేదు, కానీ వర్తమానంలో మనం చేసే సత్కర్మలు సుందరమైన భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తాయి. అహంకారం వీడినప్పుడే ఆత్మ దర్శనం సాధ్యమవుతుంది. స్వార్థం వీడిన కర్మయే మోక్ష మార్గం. ప్రతి క్షణం ఒక నూతన అవకాశం. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేద్దాం, నిష్కామ బుద్ధితో కర్మలను ఆచరిద్దాం.

సనాతన ధర్మం కర్మ సిద్ధాంతంపై ఆధారపడి ఉంది. మానవ జన్మ ఒక అద్భుత కర్మభూమి. ఇక్కడ ప్రతి చేష్ట, ప్రతి ఆలోచన విశ్వంలో ఒకానొక శక్తిమంతమైన తరంగాన్ని సృష్టిస్తుంది. విత్తినవాడే ఫలాన్ని అనుభవించాలనేది ప్రకృతి అమోఘమైన నియమం. కర్మల వెనుక ఉన్న ఉద్దేశం, వివేకం మనిషి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. బంధనాల నుండి విముక్తి పొందాలన్నా, ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నా కర్మఫల రహస్యం తెలియడం అత్యంత ఆవశ్యకం.

సేవే పరమార్థంగా, త్యాగమే మార్గంగా సాగే జీవనం ధన్యమవుతుంది. వ్యక్తిలోని కర్మశక్తి విశ్వశ్రేయస్సుకై అంకితం కావాలి. కర్మ యోగంతో అంతరంగాన్ని శుద్ధి చేసుకుందాం. భారతీయుల కర్మ సాధన జగత్తుకు వెలుగు కావాలి. మనిషి మారాలి, మనీషిగా ఎదగాలి, జగత్తు పునీతం కావాలి, లోకం సుఖపడాలి.


వివేకం లేని బలం ప్రమాదకరం, బలం లేని వివేకం నిష్ప్రయోజనం. చిత్తశుద్ధి లేని శివపూజ ఫలితాన్నివ్వదు. వెలుగు లేని కన్ను ప్రపంచాన్ని చూడలేనట్లు, వివేకం లేని మేధస్సు సరైన నిర్ణయం తీసుకోలేదు.

– కె. భాస్కర్‌ గుప్తా, వ్యక్తిత్వ వికాస నిపుణులు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement