పరిమిత కోరికల నుండి పరమ శాంతి వైపు | Liberation of the mind from conditions is true emancipation | Sakshi
Sakshi News home page

పరిమిత కోరికల నుండి పరమ శాంతి వైపు

Sep 28 2026 12:57 AM | Updated on Sep 28 2026 12:57 AM

Liberation of the mind from conditions is true emancipation

మంచిమాట

ఆధ్యాత్మిక పరిభాషలో ‘ముక్తి’ లేదా ’మోక్షం’ అంటే ప్రపంచాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు. అది జనన మరణ చక్రం నుండి, మనస్సులోని అజ్ఞాన బంధాల నుండి పొందే పరమ శాంతి. లౌకికమైన భోగాలు తాత్కాలిక సుఖాన్ని ఇస్తాయి. కానీ అంతిమంగా దుఃఖానికి కారణమవుతాయి. 

ముక్తి ఎప్పటికీ తరగని ఆనందాన్ని అందిస్తుంది. కోరికలు, రాగద్వేషాలు అనే సంకెళ్ల నుండి మనసును స్వేచ్ఛగా ఉంచడమే నిజమైన ముక్తి.  రాజయోగం. దేవుడు మనకు ఏది ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాడు; కానీ మనమే చిన్న చిన్న కోరికలతో సంతృప్తి పడిపోతున్నాం.

ఓ రాజు ఓసారి చెరసాలని సందర్శించాడు. అక్కడున్న ఖైదీల యోగక్షేమాలు ఆప్యాయంగా విచారించి వాళ్ళు కోరింది ఏదైనా ఇస్తానని చెప్పాడు. ఒకరు వేడినీళ్ళనీ, మంచాన్నీ, చెప్పులనీ, మంచి దుస్తులనీ, చక్కటి ఆహారాన్ని ఇలా తలొకటి కోరుకున్నారు. అంతేకాని, ఎవరూ తనకి స్వతంత్రం కావాలని కోరుకోలేదు. మనమంతా కూడా ఆ ఖైదీల్లాంటి వాళ్ళమే. దేవుడిని సంపద, ప్రమోషన్, పిల్లలకి  ఉద్యోగం, ఆరోగ్యం లాంటివి కోరుకుంటాం తప్ప, పరమ శాంతిని ఇచ్చే ఆనందకరమైన ముక్తిని కోరుకోం.

ఏది తాత్కాలికమో, ఏది శాశ్వతమో గుర్తించే శక్తిని పెంపొందించుకోవాలి. ‘భగవంతుడా! నాకు ఈ వస్తువు ఇవ్వు, ఆ పదవి ఇవ్వు‘ అని అడిగే స్థాయి నుండి ‘నాకు నీపై భక్తిని, పరమ శాంతిని, ముక్తిని ప్రసాదించు‘ అని అడిగే స్థాయికి మనసు ఎదగాలి.  రోజూ కొద్దిసేపు ధ్యానం ద్వారా మనసును అంతర్ముఖం చేసి, లౌకిక తాపత్రయాల నుండి విముక్తి పొందడానికి ప్రయత్నించాలి. రాజు ముందర నిలబడిన ఖైదీకి స్వేచ్ఛ కంటే దుస్తులు ఏవిధంగా అల్పమైనదో, పరమాత్మ సమక్షంలో ముక్తి కంటే లౌకిక సంపదలు అంతే అల్పమైనవి. కాబట్టి, తాత్కాలిక సౌఖ్యాలనే కంబళులను, దోమతెరలను కోరుకోవడం మాని, పరమ శాంతిని ఇచ్చే ఆనందకరమైన అంతిమ ముక్తిని కోరుకోవడమే మానవ జన్మకు సార్థకత.
 
ప్రమోషన్‌ వస్తే సంతోషపడతాం, కానీ కొద్ది రోజులకే మరో కొత్త బాధ్యత లేదా ఒత్తిడి మొదలవుతుంది. పిల్లలకు మంచి ఉద్యోగం వస్తే ఒక నిశ్చింత వస్తుంది, కానీ వారి భవిష్యత్తు గురించి మరో కొత్త ఆందోళన మొదలవుతుంది. అంటే, మనం కోరుకునే లౌకిక విజయాలన్నీ ఒక సమస్యను తీర్చి మరొక తాత్కాలిక ఊరటను మాత్రమే ఇస్తాయి. అనారోగ్యం భయ పెడుతుంది. మంచి ఆరోగ్యాన్ని కోరుకోవడం తప్పేం కాదు, కానీ శరీరం అనిత్యమైనది. శరీరం ఎంత ఆరోగ్యంగా ఉన్నా, మనస్సులో శాంతి లేకపోతే ఆ ఆరోగ్యం కూడా మనకు ఆనందాన్ని ఇవ్వలేదు. 

‘ఇది ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను’ అనే షరతుల నుంచి మనస్సు విముక్తి పొందడమే ముక్తి. లౌకిక ఆశలు మనల్ని ‘అసంతృప్తి, ప్రయాస, తాత్కాలిక ఉపశమనం’ అనే చక్రంలో తిప్పుతూనే ఉంటాయి. ముక్తి అనేది ఏ వస్తువుపైనా, ఏ వ్యక్తిపైనా, ఏ పరిస్థితిపైనా ఆధారపడని శాశ్వత అంతర్శాంతి. లౌకిక బాధ్యతలను నెరవేరుస్తూనే మన కోరికల దిశను మార్చుకోవచ్చు. పిల్లల చదువు, ఉద్యోగం, ఆరోగ్యం కోసం ప్రయత్నించడం మన బాధ్యత. కానీ దాని ఫలితంతోనే నా జీవిత ఆనందం ముడిపడి ఉందనే మోహాన్ని తగ్గించుకోవడం, బయటి ప్రపంచంలో ఎంత ఎదిగినా, అంతరంగంలో ప్రశాంతత లేకపోతే అదంతా శూన్యమని గుర్తించడమే ఆధ్యాత్మిక ఎదుగుదలకు మొదటి మెట్టు.

మనకు కావలసింది తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చే ‘వేడినీళ్లూ  మంచమూ’ కాదు. ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంచే అంతర్గత స్వతంత్రత.

– తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement