ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీల్లో 62 ఏళ్ల వరకు పెంపునకు సూత్రప్రాయంగా ఆమోదం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం–2014లో 9, 10 షెడ్యూళ్లలో చేర్చిన సంస్థల్లో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలుపుతూ ఆర్థిక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ పదవీ విరమణ పెంపునకు పలు షరతులు విధించింది. పదవీ విరమణ వయస్సు పెంపు 2022 జనవరి 1 నుంచి వర్తిస్తుందని తెలిపింది.
ఇప్పటికే 60 ఏళ్లకు పదవీ విరమణ చేసిన వారిని తిరిగి 62 ఏళ్ల వరకు విధుల్లోకి తీసుకోవాలని, అయితే పదవీ విరమణ, తిరిగి చేరే మధ్య కాలాన్ని ఉద్యోగేతర కాలంగా పరిగణించి ఎలాంటి జీతం చెల్లించరని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సంస్థల ఆర్థిక పరిస్థితులు, అవసరం ఆధారంగానే పదవీ విరమణ వయస్సు పెంపుపై నిర్ణయం తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రిటైర్మెంట్‌పై ఆ సంస్థలు అనుసరించాల్సిన మార్గదర్శకాలు ఇవీ..
» 60 సంవత్సరాలు నిండిన తర్వాత పదవీ విరమణ చేసిన ఉద్యోగులను, 62 సంవత్సరాల వరకు తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. ఇందుకు అనుగుణంగా ఆ సంస్థలు/సొసైటీలు/కార్పొరేషన్లు నిబంధనల్లో అవసరమైన సవరణలు చేయాలి.
» కోర్టు ఉత్తర్వుల ఆధారంగా 62 సంవత్సరాల వయస్సు వరకు సర్వీసులో కొనసాగిన ఉద్యోగి, తత్ఫలితంగా వచ్చే అన్ని ప్రయోజనాలతో పాటు క్రమబద్ధమైన సర్వీసును అందించినట్లుగా పరిగణించబడతారు. అటువంటి సంస్థల నిబంధనల ప్రకారం వర్తించే పింఛను ప్రయోజనాలు ఏవైనా ఉంటే, వాటిని తదనుగుణంగా ప్రాసెస్ చేయాలి.
» ఇప్పటికే పదవీ విరమణ చేసిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకుంటే పదవీ విరమణ తేదీ నుండి తిరిగి విధుల్లోకి తీసుకున్న తేదీ వరకు ఉన్న కాలాన్ని ఉద్యోగేతర కాలంగా పరిగణించాలి. ఈ కాలంలో ఎలాంటి జీతం చెల్లించరు.
» అయితే, వార్షిక గ్రేడ్ ఇంక్రిమెంట్ విడుదల కోసం ఉద్యోగేతర కాలాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఇంక్రిమెంట్ ప్రయోజనం తిరిగి విధుల్లోకి తీసుకున్న తేదీ నుంచి మాత్రమే వర్తిస్తుంది. సీనియారిటీ, పదోన్నతులు మొదలైన వాటి కోసం ఈ కాలాన్ని లెక్కించాలి. పింఛను అర్హత గల సంస్థల్లో ఈ కాలంలో పొందుతున్న పింఛన్‌ను కొనసాగించవచ్చు.
» తిరిగి విధుల్లో చేరిన ఉద్యోగులు పదవీ విరమణ తరువాత పొందిన పింఛను ప్రయోజనాలను, గ్రాట్యుటీ, ఆర్జిత సెలవుల నగదును తిరిగిసంస్థలకు చెల్లించాలి.
» 60 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ చేసి, తిరిగి విధుల్లో చేరడానికి ఆసక్తి లేని ఉద్యోగుల రిటైర్మెంట్‌ను నిబంధనల ప్రకారం అనుమతించవచ్చు.
» రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీల్లో ఉద్యోగుల అవసరం వాస్తవికత, ఈ సొసైటీల పనితీరు అంచనా ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. బడ్జెట్ అవసరాల కోసం ఆర్థిక శాఖ ఆమోదం పొందాలి.


