‘ఎంతమందిని వెన్నుపోటు పొడుస్తావ్‌ చంద్రబాబూ?’ | Botsa Satyanarayana Slams Chandrababu Govt Over Alleged DSC Scam | Sakshi
Sakshi News home page

‘ఎంతమందిని వెన్నుపోటు పొడుస్తావ్‌ చంద్రబాబూ?’

Aug 17 2026 2:50 PM | Updated on Aug 17 2026 2:59 PM

Botsa Satyanarayana Slams Chandrababu Govt Over Alleged DSC Scam

సాక్షి,తాడేపల్లి: డీఎస్సీ అక్రమాలపై వెన్నుపోటు పార్టీ నేతలు సమాధానం చెప్పకుండా పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఏపీ మండలి సమావేశాల నేపథ్యంలో బొత్స మీడియాతో మాట్లాడారు.

‘డీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ జరగాలి. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలన్నదే మా డిమాండ్. అందుకు కూటమి నేతలు సమాధానం చెప్పడం లేదు. కౌన్సిల్‌లో మేము చర్చకు రావాలని కోరాం. కానీ తప్పు చేసిన ప్రభుత్వం చర్చకు రాకుండా తోక ముడిచింది. చర్చకు రాకుండా సవాల్ చేయటం ఎందుకు?. డీఎస్సీ కమిషనర్‌గా ఇతర అధికారిని ఎందుకు నియమించ లేదు?

అధికారులు లేక రాష్ట్రం ఏమైనా గొడ్డుపోయిందా?.కృష్ణా జిల్లా టాపర్ నవీన్‌కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు?. అతను ఎందుకు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది?. స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయన్నది వాస్తవం. ఉద్యోగాలను అమ్ముకున్నట్టు వచ్చిన ఆడియో, వీడియో టేపులపై విచారణ ఏదీ?. వాళ్లను పట్టుకుని పూర్తి స్థాయిలో విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వచ్చేవి కదా?.

అందుకే మేము సీబిఐతో విచారణ చేయమని అడిగాం. గ్రూప్1 మీద కూడా సీబీఐతో విచారణ చేయించుకోండి. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎంతమందిని వెన్నుపోటు పొడుస్తారు చంద్రబాబూ?.లక్షా 30 వేల ఉద్యోగాలను ఎలాంటి అక్రమాలు లేకుండా ఒకేసారి మా హయాంలో ఇచ్చాం. చంద్రబాబు 16 వేల పోస్టులకు అక్రమాలు చేశారు.

ఈ మొత్తం వ్యవహారాలపై సీబిఐతో విచారణ చేయాల్సిందే. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే. ప్రభుత్వం బెదిరించడం వల్లే డీఎస్సీ టీచర్లు కర్నూలు, విజయవాడలో ర్యాలీ చేశారు. ర్యాలీలకు రాకపోతే ఉద్యోగం తొలగిస్తామని బెదిరించారు. డీఎస్సీ అక్రమాలను రాజకీయ కోణంలో చూడవద్దు. అర్హులందరికీ న్యాయం జరగాలి. అక్రమాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నదే మా డిమాండ్’అని స్పష్టం చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement