మొక్కల పెంపకం ఇక ఈజీ.. ఈ చిట్టి గాడ్జెట్లు ఉంటే చాలు! | Mini Gardening Gadgets For Easy Plant Care | Sakshi
Sakshi News home page

మొక్కల పెంపకం ఇక ఈజీ.. ఈ చిట్టి గాడ్జెట్లు ఉంటే చాలు!

Sep 27 2026 2:38 PM | Updated on Sep 27 2026 3:28 PM

Mini Gardening Gadgets For Easy Plant Care

ఫండే

టెక్‌ టమారం

మొక్కలు నాటడం ఈజీనే.. కానీ వాటిని పెంచడం మాత్రం కాస్త కష్టమే! కుండీలు కదపడం నుంచి నీళ్లు పోయడం వరకు.. గార్డెనింగ్‌లో ఈ చిన్న గాడ్జెట్లు ఉంటే పని సింపుల్‌! రూ.200 నుంచి అందుబాటులో ఉన్న ఈ మినీ గార్డెనింగ్‌ గాడ్జెట్లు ఏంటో చూద్దాం..

మినీ మెషిన్లు... మెనీ ప్లాంటేషన్లు
మొక్కలు నాటేయడం సులభమే కానీ, వాటిని పెంచడమే చాలా కష్టం. ఏ మొక్కకు ఏం కావాలో అర్థం చేసుకునేలోపే, ఒక్కోసారి మొక్క మన నుంచి చేజారిపోతుంది. అందుకే, మొక్కల పెంపకాన్ని కాస్త సింపుల్‌గా, కాస్త స్మార్ట్‌గా మార్చే ఈ చిట్టి గార్డెనింగ్‌ గాడ్జెట్లు!

కుండీలతో ఖుషీ ఖుషీ!
పెద్ద పెద్ద కుండీలను కాస్త కదిలించాలంటే ముందు మొక్కను చూసి, తర్వాత మన నడుమును చూసుకోవాల్సిందే! వాటిని మార్చాలంటే ఎత్తడం, లాగడం, తోయడం వంటి పనులతో చాలా అలసిపోతాం. ఇప్పుడు ఈ కష్టానికే ఈ ప్లాంట్‌ స్టాండ్‌ విత్‌ వీల్స్‌ చెక్‌ పెట్టేస్తుంది. కుండీని స్టాండ్‌పై పెట్టేసి, కావాల్సిన చోటికి సులభంగా తీసుకెళ్లొచ్చు.

నాలుగు చక్రాలు 360 డిగ్రీలు తిరగడంతో దిశ మార్చడం కూడా ఈజీ. వీటి బలమైన నిర్మాణంతో బరువైన కుండీలను కూడా మోయగలదు. అంతేకాదు, స్టాండ్‌ కింద అదనపు నీటిని సేకరించడానికి ఒక ట్రే కూడా ఉంటుంది. దీంతో నేల మీద నీళ్లు కారే సమస్య కూడా తగ్గుతుంది. ఇంట్లో, బాల్కనీలో, బయట తోటలో– ఎక్కడైనా వాడుకోవచ్చు. ధర సైజ్, డిజైన్‌ బట్టి  రూ.400 నుంచి మొదలు.

పూలతో నీటి ఆహారం! 
మొక్కలు మనతో కలిసి ప్రయాణించలేవు. కానీ, ‘నాకు  నీళ్లు ఎవరు పోస్తారు?’ అని మొక్క పడే టెన్షన్‌  మాత్రం తోడొస్తుంది! అందుకే, మొక్కలకు రోజూ నీళ్లు పోయడం మర్చిపోయే వాళ్లకు లేదా ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లేవాళ్లకు ఈ ట్యులిప్‌ సెల్ఫ్‌ వాటరింగ్‌ స్పైక్స్‌ బాగా పనిచేస్తాయి.

పూల ఆకారంలో ఉండే దీని పైభాగంలో నీళ్లు నింపి, కింద స్పైక్‌ను మట్టిలో పెట్టేస్తే చాలు. రిజర్వాయర్‌లోని నీరు క్రమంగా వేర్లవైపు చేరుతూ మట్టిలో తేమను నిలబెడుతుంది. చిన్న కుండీలు, టేబుల్‌టాప్‌ మొక్కలు, ఇంటి మొక్కలు, బాల్కనీ గార్డెన్‌ – ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నాలుగు పీసుల ప్యాక్‌ ధర రూ.500 మాత్రమే!

మొక్కకు సేఫ్టీ బెల్ట్‌!
మొక్క పెరుగుతూ ఏ వైపు అంటే ఆ వైపు వంగిపోతూ మీ మాట వినట్లేదా! అందుకని తాడు, వైర్, ప్లాస్టిక్‌ టైలు అంటూ ఇంట్లో దొరికినవన్నీ మొక్కకు కట్టి, కష్టపడకండి. ఈ రీయూజబుల్‌ ప్లాంట్‌ టై టేప్‌ వాడండి. కావాల్సినంత పొడవు కట్‌ చేసుకుని మొక్క చుట్టూ చుట్టి టక్కున అంటించేయొచ్చు.

ముడులు వేయాల్సిన అవసరం లేదు, బిగుతుగా కట్టి కాండాన్ని ఇబ్బంది పెట్టాల్సిన పనీ లేదు. మృదువైన పదార్థంతో తయారవటంతో మొక్కలకు సురక్షితంగా సపోర్ట్‌ ఇస్తుంది. గాలి, వాన, ఎండలోనూ పట్టును నిలబెట్టుకుంటుంది. మనీ ప్లాంట్, తీగజాతి మొక్కలు, చిన్న మొక్కలు, మొలకలు– ఇలా రకరకాల మొక్కలకు ఉపయోగించొచ్చు. అవసరం తీరాక తీసేసి మళ్లీ వాడుకోవచ్చు కూడా! ధర రూ.200 మాత్రమే!

ఇదీ చదవండి: ప్లస్‌ సైజ్‌ బాడీనా? ఈ స్టైల్‌ టిప్స్‌ పాటిస్తే లుక్‌ అదిరిపోవాల్సిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement