ఫండే
అగడం బగడం
వింతలు విశేషాలు
నగర వీధుల్లో చిందులాడే అడుగుల చప్పుడు... రాత్రివేళల రంగుల వెలుగులు... వాటికి మృదువైన సాక్సోఫోన్ స్వరం తోడైతే? ఆ అనుభూతే వేరు! సంగీతానికి హద్దులు లేవని చాటుతూ, జాజ్ స్వరాలతో తైపీ నగరాన్ని ముంచెత్తేందుకు సిద్ధమవుతోంది 2026 తైపీ జాజ్ ఫెస్టివల్. సెప్టెంబర్ 4న ప్రారంభమై అక్టోబర్ 11 వరకు జరిగే ఈ వేడుకలను తిలకించేందుకు ఇప్పటికే ప్రపంచం నలుమూలలకు చెందిన పర్యాటకులు తైపీ నగరానికి క్యూ కట్టారు.
ఈ ఏడాది 20వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటున్న ఈ తైపీ జాజ్ ఫెస్టివల్‌కి ఒక ప్రత్యేకత ఉంది. ఈసారి సంగీతాన్ని కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా నగర జీవనశైలిలో భాగంగా పరిచయం చేస్తోంది. జాజ్ సంగీతాన్ని వినడానికి ప్రత్యేకంగా ఒక హాలుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, నగర వీధుల్లో నడుస్తూ, పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తూ, విశ్రాంతి తీసుకుంటూ కూడా సంగీతాన్ని ఆస్వాదించేలా ఈ వేడుకను రూపొందిస్తున్నారు. జాజ్ క్లబ్బుల నుంచి సాంస్కృతిక ప్రదేశాల వరకు; చిన్న వేదికల నుంచి భారీ బహిరంగ ప్రదర్శనల వరకు; నగరాన్నే ఒక సంగీత వేదికగా మార్చేసింది ఈ జాజ్ ఫెస్టివల్. అందుకే ఈసారి తైపీ నగరం కేవలం సందర్శనకే కాదు, మ్యూజిక్‌ను కూడా వినిపించేస్తుంది.
ఎన్నో సంగీత వేదికలు
ఈ ఫెస్టివల్‌లో భాగంగా 12 జాజ్ వేదికల్లో 19 ఇండోర్ ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. చిన్న వేదికలపై కళాకారులు ప్రేక్షకులకు దగ్గరగా ప్రదర్శనలు ఇవ్వడం వల్ల సంగీతాన్ని మరింత ఆత్మీయంగా ఆస్వాదించే అవకాశం ఉంటుంది. ఫెస్టివల్‌లోని ఆసక్తికరమైన కార్యక్రమాల్లో సెప్టెంబర్ 26న ట్రెజర్ హిల్ ఆర్టిస్ట్ విలేజ్‌లో జరిగే ప్రత్యేక ప్రదర్శన ఒకటి. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో తైవాన్ కు చెందిన తొలి పూర్తి స్థాయి స్కా సంగీత బృందంగా గుర్తింపు పొందిన ‘స్కారకియో’ ఉత్సాహభరితమైన సంగీతంతో ప్రేక్షకులను అలరించనుంది.
ఒకవైపు వేగవంతమైన స్కా సంగీతం; మరోవైపు మృదువైన జాజ్, ఫ్రెంచ్ గీతాల సౌందర్యం. ఒకే వేదికపై ఇంత భిన్నమైన సంగీత ప్రపంచాలను పరిచయం చేయడం ఈ కార్యక్రమం ప్రత్యేకత. ఇందులో భాగంగా తైపీలోని ఐదు ప్రముఖ పర్యాటక, సాంస్కృతిక ప్రదేశాల్లో 12 ప్రత్యేక సంగీత ప్రదర్శనలు జరుగుతు న్నాయి. అంటే, సంగీతాన్ని వినడమే కాదు, నగర సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ జాజ్‌లో మునిగిపోయే అవకాశం అన్నమాట!
సంగీతమే కాదు!
తైపీ జాజ్ ఫెస్టివల్ లక్ష్యం కేవలం పెద్ద కచేరీలు నిర్వహించడం మాత్రమే కాదు. జాజ్ సంగీతాన్ని ప్రజల రోజూవారీ జీవితంలో ఒక ఆహ్లాదకరమైన భాగంగా మార్చడం కూడా ఈ వేడుక ఉద్దేశం. 2007 నుంచి కొనసాగుతున్న ఈ ఉత్సవం.. తైపీ నగర జీవనశైలిని జాజ్ సంగీతంలోని స్వేచ్ఛా భావంతో కలుపుతోంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కళాకారులు తమ సంగీతంతో తైపీకి అంతర్జాతీయ జాజ్ రంగును తీసుకువస్తున్నారు.
మూడు రోజులు ప్రత్యేక ఆకర్షణ
ఈ ఫెస్టివల్‌కు ప్రత్యేక ఆకర్షణ.. అక్టోబర్ 9 నుంచి 11 వరకు తైపీ మ్యూజిక్ సెంటర్‌లో మూడు రోజుల పాటు జరిగే బహిరంగ సంగీత వేడుక. ఈ ప్రధాన వేదికపై తైవాన్ కు చెందిన ప్రముఖ కళాకారులతో పాటు అంతర్జాతీయ జాజ్ బృందాలు కూడా ప్రదర్శనలు ఇవ్వనున్నాయి. మొత్తం 11 సంగీత బృందాలు తమ ప్రతిభను ప్రదర్శించనున్నాయి. అనుభవజ్ఞులైన కళాకారులతో పాటు కొత్త తరానికి చెందిన సంగీతకారులు ఒకే వేదికపై కనిపించనుండటం ఈ వేడుకకు మరింత ప్రత్యేకత తీసుకురానుంది.
ఇదీ చదవండి: ఈ వారం కథ: చీమ బ్రతుకేనా?


