దుర్వాసుడి కోపానికి భార్య భస్మం.. ఆమె పేరుతో పుట్టిన చెట్టు ఇదే! | Durvasa Kandali Story Thilatharpanapuri Pitru Paksha | Sakshi
Sakshi News home page

దుర్వాసుడి కోపానికి భార్య భస్మం.. ఆమె పేరుతో పుట్టిన చెట్టు ఇదే!

Sep 27 2026 12:17 PM | Updated on Sep 27 2026 12:17 PM

Durvasa Kandali Story Thilatharpanapuri Pitru Paksha

ఫండే

భక్త విజయం

ఒకానొకప్పుడు దుర్వాసుడు గంధమాదన పర్వతంపైనున్న వనంలో తపస్సు చేసుకుంటున్నాడు.
ఆయన తపస్సు చేసుకుంటున్న కాలంలోనే ఒకనాడు బలిచక్రవర్తి మనవడైన సాహసికుడు, అప్సరస తిలోత్తమ తగిన ఏకాంతం కోసం వెదుకులాడుతూ అక్కడకు వచ్చారు. నిశ్చలంగా తపోనిష్ఠలో కూర్చున్న దుర్వాసుడిని వారు గమనించినా, అతడిని పట్టించుకోకుండా, అతడి ఎదుటనే వారు యథేచ్ఛగా సరస సల్లాపాలకు దిగారు.

వారి మాటలకు, వారు చేసే శబ్దాలకు దుర్వాసుడి ఏకాగ్రతకు భంగం కలిగింది. ఆయన కళ్లు తెరిచి చూశాడు. తన ఎదుటనే సల్లాపాలు సాగిస్తున్న తిలోత్తమా సాహసికులు కనిపించారు. అసలే ముక్కోపి అయిన దుర్వాసుడు వారి చేష్టలకు మండిపడ్డాడు.
‘దుర్మార్గులారా! తపోనిష్ఠలో ఉన్న నా ఎదుటనే మీరు నిర్లజ్జగా సల్లాపాలకు దిగారు. మీరు భూలోకంలో రాక్షసులై జన్మిస్తారు’ అని శపించాడు.
దుర్వాసుడి ఆగ్రహానికి తిలోత్తమా సాహసికులు భయంతో వణికిపోయారు.
‘మహర్షీ! మా అపరాధానికి మన్నించు. శాపోపశమనం నువ్వే అనుగ్రహించు’ అని ప్రార్థించారు.

‘సాహసికుడికి బలరాముడి చేతిలో హతమయ్యాక శాప విమోచనం కలుగుతుంది. శ్రీకృష్ణుడి తనయుడితో కొంతకాలం జీవనం సాగించిన తర్వాత తిలోత్తమకు శాప విమోచనం కలుగుతుంది’ అని పలికాడు దుర్వాసుడు.
తిలోత్తమా సాహసికుల కారణంగా తపోభంగం కలిగిన దుర్వాసుడికి తిరిగి ఏకాగ్రత కుదరలేదు. ఆయన మనస్సులో సంసార వాంఛ కలిగింది. దాంతో తపోనిష్ఠను విరమించుకున్నాడు. తనకు తగిన వధువును చూసుకుని, సంసారాశ్రమంలోకి ప్రవేశించాలని తలచాడు. ఔర్వ మహర్షి కుమార్తె కందళి వివాహానికి తగిన వయసులో ఉందని విన్నాడు. వెంటనే ఔర్వ మహర్షి ఆశ్రమానికి వెళ్లాడు. ‘మహర్షీ! నీ కుమార్తె వివాహానికి సిద్ధంగా ఉందని తెలుసుకున్నాను. నీకు అభ్యంతరం లేకుంటే, ఆమెను నేను వివాహం చేసుకుంటాను’ అని చెప్పాడు.

‘దుర్వాసా! నా కుమార్తె కందళి అతిగారాబం వల్ల అవివేకిగా, కోపిష్టిగా తయారైంది. ఆమెను భరించడం కష్టం. అయినా నువ్వు ఆమెను పెళ్లాడతానంటే నాకు అభ్యంతరమేమీ లేదు’ అన్నాడు ఔర్వుడు.
దుర్వాసుడు కందళిని వివాహం చేసుకోవడానికి తన సమ్మతి తెలిపాడు. ఔర్వుడు వారికి శాస్త్రోక్తంగా వివాహం జరిపించాడు.

వివాహం తర్వాత దుర్వాసుడు భార్యను వెంటబెట్టుకుని తన ఆశ్రమానికి చేరుకున్నాడు. తన తపో మహిమతో ఆశ్రమంలో అన్ని భోగాలను కల్పించాడు. ఎన్ని భోగాలు కల్పించినా, కందళి తన ధోరణిని మార్చుకోలేదు. గయ్యాళితనంతో భర్తను నిత్యం దేనికో దానికి సాధించసాగింది. భరించినంత కాలం భరించిన దుర్వాసుడు తుదకు సహనం కోల్పోయాడు. ఒకనాడు ధ్యానం చేసుకుంటున్న దుర్వాసుడిని కందళి నిందించడం మొదలుపెట్టింది. ఒక్కసారిగా కళ్లు తెరిచి ఆమెను తీక్షణంగా చూశాడు. ఆమె అక్కడికక్కడే భస్మీపటలమైపోయింది.

వెంటనే ఆమె భస్మమైన చోటకు ఎగువగా ఆకాశంలో ఒక సుందరి రూపం కనిపించింది. ‘స్వామీ! నా దోషాన్ని క్షమించు. నన్ను అనుగ్రహించు’ అని పలికి అదృశ్యమైపోయింది.

ఆ దృశ్యాన్ని చూసిన దుర్వాసుడు తన భార్య కందళి పేరు భూమ్మీద శాశ్వతంగా నిలిచి ఉండేలా ‘కదళి’ వృక్షజాతిని సృష్టించాడు. దుర్వాసుడి భార్య పేరు కదళీ వృక్షాల ద్వారా చిరస్థాయిగా నిలిచిపోయింది.
ఇదంతా జరిగిన కొన్నాళ్లకు ఔర్వుడు దుర్వాసుడి ఆశ్రమానికి వచ్చాడు. ఆశ్రమంలో తన కుమార్తె కందళి కనిపించలేదు. ఆయన దివ్యదృష్టితో జరిగినదంతా తెలుసుకున్నాడు. దుర్వాసుడిపై మండిపడ్డాడు.

‘ఓరీ! నువ్వు అన్నీ తెలుసుకుని నా కుమార్తెను వివాహం చేసుకుని, ఆమెను భస్మీపటలం చేసి, నన్ను తీవ్రంగా అవమానించావు. దీనికి ఫలితంగా నువ్వు భవిష్యత్తులో అంబరీషుడి చేతిలో అవమానం పొంది మిగుల దుఃఖాన్ని అనుభవించగలవు’ అని శపించి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఔర్వుడి శాపానికి దుర్వాసుడు కొంత చింతించాడు. అయినా జరిగేది జరగక మానదు అని తనను తాను సమాధానపరచుకుని, తిరిగి తపస్సు చేసుకోవడానికి బయలుదేరాడు.
- సాంఖ్యాయన

పురావిశేషం..
ఈ ఏడాది పితృపక్షంగా పేరుపొందిన మహాలయపక్షం నేటితో మొదలవుతోంది. పితృతర్పణాలకు ప్రసిద్ధి పొందిన క్షేత్రం తమిళనాడులోని తిలతర్పణపురి. ఈ క్షేత్రంలోని ప్రధాన దైవం ముక్తీశ్వర స్వామి. అమ్మవారు స్వర్ణవల్లి. శైవక్షేత్రమైన ఈ ప్రదేశంలో పితృదేవతలకు తిలతండులాలతో తర్పణాలు విడిచిపెడితే వారికి ఉత్తమగతులు కలుగుతాయని భక్తుల విశ్వాసం.

త్రేతాయుగంలో శ్రీరాముడు తన తండ్రి దశరథుడికి ఇక్కడే పిండప్రదానం చేశాడని, అలాగే, ద్వాపరయుగంలో పాండవులు కూడా తమ పితృదేవతలకు ఇదేచోట పిండప్రదానం చేశారని స్థలపురాణం చెబుతోంది. ఈ క్షేత్రంలో మరెక్కడా లేని విధంగా నరముఖ గణపతి ఆలయం ఉండటం విశేషం. ఆదివినాయకుడిగా పేరుపొందిన ఇక్కడి వినాయకుడు గజముఖంతో కాకుండా, మానవముఖంతో దర్శనమిస్తాడు.

ఇదీ చదవండి: ఒకే నగరం.. ఎన్నో మ్యూజిక్‌ వేదికలు! ఎందుకంత స్పెషల్‌?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement