ఫండే
హెల్త్
మానవ శరీర చరిత్రలో మొదట ఈ ‘ఏనుగు’ను ప్రాచీన ఈజిప్టులో (కీ.పూ. 1479–1458) గుర్తించారు. ‘అటి’ అనే పేరు గల ఈజిప్జు రాణి కాలు ఏనుగు కాలుగా మారటాన్ని చూసి రాజ వైద్యులు దిమ్మెర పోయారు.
ఆ తర్వాత క్రీ.పూ. 6వ శతాబ్దపు భారతదేశ ప్రసిద్ధ ఆయుర్వేద గ్రంథం ‘సుశ్రుత సంహిత’లో ఈ ఏనుగు కాలుతో పాటుగా ఏనుగు చేయి ప్రస్తావన కూడా ఉన్నట్లు వైద్య ప్రపంచం దృష్టికి వచ్చింది.
అనంతరం గ్రీసులో, క్రీ.పూ. 5 వ శతాబ్దపు వైద్యుడు ‘హిపోక్రటీస్’ ఏనుగు కాళ్ల వ్యాధిపై తొలినాళ్ల పరిశోధనలు జరిపారు.
17వ శతాబ్దంలో నాటికి అధునికులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో వీటిపై పరిశోధనలు విస్తృతంగా జరిగాయి.
తాజాగా సింగపూర్ వైద్య పరిశోధకులు ఏనుగు కాలును లేదా ఏనుగు చేతులను తిరిగి మానవ కాళ్లుగా, చేతులుగా మార్చే నివారణోపాయాన్ని కనిపెట్టే దిశగా కొంత విజయం సాధించారు.
సాధారణంగా, కాన్సర్ చికిత్స పొందిన రోగులను కూడా వేధించే ఆ ఏనుగు కాలు వాధ్యే... ‘లింఫడీమా’! చేతులు, కాళ్లలో కూడా తీవ్రమైన వాపును కలిగించే ఈ సమస్యకు ఇప్పటివరకు మందుగానీ, శాశ్వత నివారణ గానీ లేదు. అయితే ఆహార పదార్థాలలో వాడే ఒక చవకైన ప్రత్యామ్నాయం దీనికి పరిష్కారంగా కనిపిస్తున్న విషయాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కణజాలాలలో పేరుకుపోయే కొలెస్ట్రాల్‌ను తొలగించడం ద్వారా ఈ లింఫడీమా వాపును తగ్గించవచ్చని వారి పరిశోధనలో తేలింది. ఈ కొత్త ఆవిష్కరణ బాధితుల జీవితాల్లో సరికొత్త ఆశలను చిగురింపజేస్తోంది.
ఆపిల్ జ్యూస్, పెరుగు, రెడ్ వైన్‌లలో రుచిని పెంచడానికి వాడే ఫుడ్ ఆడిటివ్స్... లింఫడీమాను – అంటే చేతులు, కాళ్లలో వచ్చే తీవ్రమైన వాపును నయం చేసేందుకు ఉపయోగపడ తాయన్న ఈ పరిశోధ వివరాలు ‘నేచర్’ జర్నల్‌లో ప్రచురితం అయ్యాయి. ఆ వివరాల ప్రకారం, సైక్లోడెక్స్‌ట్రిన్స్ అని పిలిచే కాంపౌండ్లు (ఆడిటివ్‌ల రసాయన మూలకాలకు) లింఫడీమా వాపును తగ్గించగల గుణం ఉంది.
జంతువులపై జరిపిన అధ్యయనాల ఆధారంగా తేలిన ఈ విషయాలు, ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధితో బాధపడుతున్న 14 కోట్ల నుంచి 25 కోట్ల మంది బాధితుల జీవితాలను మార్చే అవకాశం ఉంది. వీరిలో అధిక శాతం మందికి క్యాన్సర్ చికిత్స కారణంగానే ‘లింఫడీమా’ సమస్యలు వచ్చినట్లు పలు అధ్యయనాలను బట్టి తెలుస్తోంది.
దుస్తులు ధరించటమూ కష్టమే!
రొమ్ము క్యాన్సర్ చికిత్సలో భాగంగా లింఫ్ నోడ్స్‌ను తొలగించడానికి సర్జరీ చేసిన, లేదా రేడియోథెరపీ ఇచ్చిన... ప్రతి ఐదుగురిలో ఒకరికి చేతిలో లింఫడీమా వాపు వచ్చే అవకాశం ఉంది. లింఫ్ నోడ్స్ అనేవి శరీరం అంతటా ఉండే చిక్కుడు గింజ ఆకారపు నిర్మాణాలు. కణజాలాల నుండి వచ్చే వ్యర్థ ద్రవాన్ని (లింఫ్ ఫ్లూయిడ్) ఇవి వడకడతాయి. ఈ ద్రవం రక్తంలో కలవడానికి ముందే లింఫ్ నోడ్స్ దానిని శుభ్రపరుస్తాయి. రొమ్ము, తల లేదా మెడ భాగాల్లో క్యాన్సర్ కణాలు ఏర్పడినప్పుడు, అవి ఊపిరితిత్తుల వంటి ఇతర అవయవాలకు వ్యాపించే ముందు మొదట ఈ లింఫ్ నోడ్స్‌కే చేరుకుంటాయి.
క్యాన్సర్ వ్యాపించకుండా ఉండటానికి ఈ లింఫ్ నోడ్స్‌ను సర్జరీ ద్వారా తొలగించడం లేదా రేడియోథెరపీ ఇవ్వడం వల్ల లింఫ్ వ్యవస్థ దెబ్బతిని మూసుకుపోతుంది. దీనివల్ల లింఫ్ ద్రవం పేరుకుపోయి తీవ్రమైన వాపు వస్తుంది. ఎంతలా అంటే... బట్టలు వేసుకోవడం లేదా బీరువాలోంచి సరిపోయే దుస్తులు వెతుక్కోవడం వంటి చిన్న చిన్న పనులు కూడా చాలా కష్టంగా మారతాయి.
లింఫడీమా రోగుల జీవిత నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అంతేకాదు, దీనికి ప్రస్తుతం ఉన్న చికిత్సా మార్గాలు చాలా పరిమితంగా ఉన్నాయి. వాటిలో కొన్ని:
కంప్రెషన్ దుస్తులు: బాధితులు మొదట ఈ ప్రత్యేకమైన బిగుతు దుస్తులను వాడాల్సి ఉంటుంది. కానీ వీటిని ప్రతిరోజూ వేసుకోవడం వల్ల చర్మం దురద, ఇరిటేషన్ వచ్చి కదలడం కూడా కష్టమవుతుంది.
మసాజ్: చేతులతో చేసుకునే ఈ మసాజ్‌తో మంచి ఫలితం ఉండాలంటే క్రమం తప్పకుండా చేస్తూనే ఉండాలి.
సర్జరీ: దెబ్బతిన్న లింఫ్ నాళాలను సరిచేసే సర్జరీ అందుబాటులో ఉన్నప్పటికీ, దీనికి దాదాపు 12 నుండి 25 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. అంతేకాకుండా సర్జరీ తర్వాత కూడా ఇతర చికిత్సలు అవసరమవుతాయి.
లైపోసక్షన్: కిరణాలు లేదా శబ్ద తరంగాల ద్వారా కొవ్వును, ద్రవాన్ని కరిగించి బయటకు తీసే ఈ పద్ధతి కూడా అత్యంత ఖరీదైనది.
చవకైన ప్రత్యామ్నాయం
ఈ క్రమంలోనే ఇప్పుడు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ శాస్త్రవేత్తలు లింఫడీమాకు అతి తక్కువ ఖర్చుతో కూడిన ఆచరణాత్మక పరిష్కారాన్ని కనుగొన్నారు. కార్బోహైడ్రేట్స్ నుండి తయారయ్యే సెక్లోడెక్స్‌ట్రిన్ అనే పదార్థంపై దృష్టి పెట్టారు. ఆహార పదార్థాల్లోని అసహ్యకరమైన వాసనలను తమ కణాల నిర్మాణంలో బంధించే ప్రత్యేక గుణం సెక్లోడెక్స్‌ట్రిన్‌కు ఉంది. అందుకే ఆహార, పానీయాల పరిశ్రమలలో రుచిని, వాసనను పెంచడానికి దీనిని ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు.
లింఫడీమా చరిత్ర
లింఫడీమా (కాళ్లూ చేతుల వాపు) ఆనవాళ్లు చరిత్రలో వేల సంవత్సరాల క్రితమే కనిపించాయి. శోషరస (లింఫాటిక్) వ్యవస్థ గురించి వైద్యులకు పూర్తిగా తెలియకముందే ఈ వ్యాధి ఆనవాళ్లను గుర్తించారు.
పురాతన చిత్రాలు (క్రీ.పూ. 1500 ప్రాంతం)
ఈ వ్యాధికి సంబంధించిన తొలి ఆధారాలు ఈజిప్టులోని రాతి చెక్కడాల్లో కనిపించాయి. పుంట్ దేశపు రాణి ‘అటి’ (రాణిగారి పేరు అటి) కాళ్లు విపరీతంగా వాచిపోవడం ఈ చెక్కడాల్లో చూడవచ్చు.
పురాతన వైద్య గ్రంథాలు
(క్రీ.పూ. 6వ – 5వ శతాబ్దం)
భారతదేశం (సుశ్రుత సంహిత): సుశ్రుతుడు ఈ వ్యాధిని ‘శ్లీపద’ (ఏనుగు కాలు) అని పిలిచాడు. శరీరంలోని ద్రవాల అసమతుల్యత వల్లే ఈ వాపు వస్తుందని వివరించాడు. హిపోక్రటీస్ ఈ వాపును ‘ఎలిఫెంటియాసిస్’ అని వర్ణించాడు. కాళ్లలోని గ్రంథులు, నరాల గురించి కూడా రాశాడు.
రోమన్, పర్షియన్ వైద్యం
(క్రీ.శ. 2వ – 9వ శతాబ్దం)
ప్రసిద్ధ వైద్యుడు గాలెన్ (రోమ్): వాపులున్న కాళ్లకు ప్రత్యేకమైన మసాజ్, వ్యాయామాలు అవసరమని చెప్పాడు. పర్షియన్ వైద్యులు ఈ సమస్యను ‘దా అల్–ఫిల్’ (ఏనుగు వ్యాధి) అని పిలిచారు.
ఆధునిక వైద్య పరిశోధన (17వ శతాబ్దం)
శరీరంలో లింఫ్ ద్రవం ప్రవహించే నరాలు మూసుకుపోవడం వల్లే ఈ నీటి వాపు వస్తుందని 17వ శతాబ్దంలో శాస్త్రవేత్తలు కనిపెట్టారు.
శోషరస వ్యవస్థ అంటే?
మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి, శరీర ద్రవాల సమతుల్యతను కాపాడటానికి పనిచేసే ఒక ముఖ్యమైన వ్యవస్థ. ఇది రక్త ప్రసరణ వ్యవస్థతో కలిసి పనిచేస్తుంది.
ప్రధాన భాగాలు
శోషరస ద్రవం: రక్తనాళాల నుండి కణజాలాల్లోకి కారిపోయే ప్రొటీన్లు, నీరు, తెల్ల రక్తకణాలతో కూడిన స్వచ్ఛమైన నీటి వంటి ద్రవం.
శోషరస నాళాలు: శరీరం అంతటా విస్తరించి, శోషరస ద్రవాన్ని సేకరించి తిరిగి రక్తంలోకి చేర్చే సన్నని నాళాలు.
శోషరస కణుపులు: గొంతు, బాహుమూలాలు, గజ్జల్లో ఉండే చిన్న గింజ వంటి నిర్మాణాలు. ఇవి ద్రవాన్ని వడపోసి హానికరమైన బాక్టీరియా, వైరస్‌లను నిర్మూలిస్తాయి.
ముఖ్య అవయవాలు: ప్లీహం, థైమస్ గ్రంథి, టాన్సిల్స్ కూడా ఈ వ్యవస్థలో భాగమే. థైమస్ గ్రంథి మానవ రోగ నిరోధక వ్యవస్థలో అంతి కీలకమైన భాగం. ఇది గుండె, రొమ్ము ఎముక మధ్యలో, ఛాతీ ఎగువ భాగంలో ఉంటుంది.
ముఖ్యమైన విధులు
శరీర ద్రవాల సమతుల్యత: కణజాలాల్లో అదనంగా ఉన్న నీటిని, ద్రవాలను తొలగించి వాపులు రాకుండా చూస్తుంది.
రోగనిరోధక శక్తి: ల్యూకోసైట్స్ (తెల్ల రక్తకణాలు) ద్వారా ఇన్ఫెక్షన్లు, వ్యాధులపై పోరాడుతుంది.
కొవ్వుల శోషణం: జీర్ణవ్యవస్థ నుండి కొవ్వులను అనుమతించి రక్తంలోకి చేర్చుతుంది.
శోషరస వ్యవస్థలోని నాళాలు దెబ్బతిన్నా లేదా మూసుకుపోయినా, ద్రవం ఒకే చోట నిలిచిపోయి కాళ్లు లేదా చేతులు విపరీతంగా వాచిపోతాయి. ఈ పరిస్థితినే లింఫడీమా అంటారు.
సెక్లోడెక్స్‌ట్రిన్ ఎలా పని చేస్తుంది?
చీజ్, బట్టర్ వంటి పాల ఉత్పత్తుల నుండి కొలెస్ట్రాల్‌ను తీసివేసి ‘లో–ఫ్యాట్’గా మార్చడానికి సెక్లోడెక్స్‌ట్రిన్‌ను విరివిగా వాడుతారు. ఇది కొలెస్ట్రాల్ స్ఫటికాలను తన గుల్లగా ఉండే నిర్మాణం లోపల బంధించి, నీటి ద్వారా బయటకు పంపివేస్తుంది.
రొమ్ము క్యాన్సర్ చికిత్స పొందుతూ లింఫడీమా వచ్చిన మహిళల చర్మ కణజాలాలను శాస్త్రవేత్తలు పరిశీలించినప్పుడు లింఫ్ ప్రవాహం తగ్గడం వల్ల చుట్టూ ఉన్న కణజాలంలో అధిక పరిమాణంలో కొలెస్ట్రాల్ చేరుకోవటాన్ని గమనించారు. సాధారణంగా లింఫ్ నాళాలు కణజాలాల నుండి కొలెస్ట్రాల్‌ను తిరిగి రక్తంలోకి తీసుకెళ్తాయి. కానీ కణజాలంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్లే లింఫడీమా వస్తుందని వారి పరిశీలనలో తేలింది. ఈ కొలెస్ట్రాల్ వల్ల వాపు, మచ్చలు ఏర్పడి లింఫ్ ప్రవాహానికి అడ్డంకిగా మారాయి.
దాంతో, సైక్లోడెక్స్‌ట్రిన్‌లలోని ‘కొలెస్ట్రాల్‌ను తగ్గించే శక్తి’ ఈ వాపును నయం చేయగలదా అని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు తదుపరి ప్రయోగం చేశారు. లింఫడీమా ఉన్న ఎలుకల శరీరంలోని ప్రభావిత ప్రాంతంలో 8 వారాల పాటు క్రమంగా సైక్లోడెక్స్‌ట్రిన్ ఇంజెక్షన్ ఇచ్చారు. అద్భుతమైన ఫలితాలు వచ్చాయి! సైక్లోడెక్స్‌ట్రిన్... వాపును, ఇన్‌ఫ్లమేషన్‌ను (శరీరంలో వచ్చే మంట/వాపు) గణనీయంగా తగ్గించింది. అంతకంటే ముఖ్యంగా, దెబ్బతిన్న లింఫ్ నాళాలను తిరిగి బాగు చేయడానికి ఇది సహాయపడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనివల్ల వ్యాధి లక్షణాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి.
‘‘ఇది నిజంగానే విప్లవాత్మకమైన ఆవిష్కరణ. ఎందుకంటే లింఫడీమాకు ఇప్పటివరకు శాశ్వత నివారణ అనేదే లేదు. ప్రభావిత కణజాలంలో పేరుకుపోయే కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే లక్ష్యంగా చికిత్స చేయవచ్చని ఈ అధ్యయనం చూపించింది. అయితే మనుషులపై ఇది ఎంతవరకు సురక్షితం, ప్రభావవంతం అని తెలుసుకోవడానికి మానవులపై ప్రయోగాలు జరగాల్సి ఉంది’’ అని పరిశోధకులు అంటున్నారు. అలాగే రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించే స్టాటిన్‌ల వంటి సాధారణ మందులు దీనికి పనిచేయకపోవచ్చని వారు భావిస్తున్నారు. ఎందుకంటే ఆ మందులు రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి కానీ, ప్రత్యేకంగా లింఫ్ నాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌పై పనిచేయవు.
మొత్తానికైతే లింఫడీమాతో బాధపడుతున్న లక్షలాది మంది రోగులకు గొప్ప ఊరటనిచ్చే పరిశోధనా ఫలితం ఇది. సాధారణంగా ఆహార పరిశ్రమలో వాడే ఒక చవకైన పదార్థం (సైక్లోడెక్స్‌ట్రిన్), ఇలా ప్రాణాంతకమైన శారీరక సమస్యకు çపరిష్కారం అయ్యే సూచనలు కనిపించటం నిజంగా మంచి విషయమే. త్వరలోనే మనుషులపై జరిపే ప్రయోగాల్లో కూడా ఇవే సానుకూల ఫలితాలు వస్తే, లింఫడీమా బాధితులకు తక్కువ ఖర్చుతోనే మెరుగైన శాశ్వత చికిత్స లభించే అవకాశం ఉంది.
- సాక్షి స్పెషల్ డెస్క్
ఇదీ చదవండి: ప్రసవ నొప్పులు రాకపోతే?


