భారత విజ్ఞానం
ధర్మో రక్షితి రక్షితః.... అంటే ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. పాండవుల విషయంలో... ముఖ్యంగా ధర్మరాజు విషయంలో ఈ సూత్రం రుజువయ్యింది.
మహాభారత యుద్ధం ముగిసిన అనంతరం విజయం సాధించిన పాండవులు పట్టాభిషిక్తులయ్యారు. పాండవుల రాజ్యపాలన కూడా ముగిసింది... జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారాన్ని చాలించాడు. పాండవులకు కూడా జీవిత సత్యం బోధ పడింది. జీవిత చరమాకంలోకి చేరుకున్న పాండవులు అన్నింటినీ పరిత్యజించి హిమాలయాల మీదుగా స్వర్గానికి ప్రయాణమయ్యారు.
దానికే స్వర్గారోహణ పర్వమని పేరు. అదే సమయంలో ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ ఒక శునకం వారి వెనుకే నడుస్తూ పాండవులను అనుసరించింది. అలా వెళుతున్న సమయంలో వారి వారి పాప పుణ్యాల తీవ్రతను బట్టి మొదటగా ద్రౌపది, తరవాత వరుసగా సహదేవుడు, నకులుడు, అర్జునుడు, చివరగా భీముడు ఒకరి తర్వాత మరొకరు ప్రాణాలు విడిచారు. కానీ ధర్మరాజు ఒక్కడే వెనుతిరగకుండా ముందుకు సాగుతున్నాడు.« ధర్మరాజుకు తోడుగా శునకం ఆయన వెంట నడిచింది.
ధర్మరాజు హిమాలయాల చివరి అంచుకు చేరుకోగానే దేవేంద్రుడు తన దివ్య రథంతో వచ్చి ప్రాణాలతో స్వర్గానికి రమ్మని, దివ్య రధం ఎక్కమని ధర్మరాజును ఆహ్వానించాడు. అందుకు ధర్మరాజు తనతోపాటు ఉన్న శునకాన్ని కూడా తీసుకొని వస్తానని చెప్పడంతో ఇంద్రుడు నిరాకరించి కుక్కకు స్వర్గంలో ప్రవేశం లేదని, ఒక్కడివే రథాన్ని ఎక్కమని చెప్పగా ధర్మరాజు నిరాకరించాడు. నన్ను నమ్మి నా వెంట ఎంతో దూరం వచ్చిన ఈ ప్రాణిని నా స్వార్థం కోసం వదిలేయడం అధర్మమని, అలాంటి స్వర్గం తనకు అవసరం లేదని ధర్మరాజు ఇంద్రునితో కచ్చితంగా చెప్పాడు. ధర్మరాజు ధర్మనిష్టకు, కారుణ్యానికి సంతోషించిన ఆ శునకం తన నిజరూపమైన ధర్మదేవతగా ప్రత్యక్షమైంది. అనంతరం ధర్మరాజు స్వర్గానికి చేరుకున్నాడు.
– సి. ఎన్. మూర్తి,సీనియర్ పాత్రికేయులు


